ఆప్టింగ్‌ డ్రైవర్‌.. యాక్టింగ్‌ చోరీ

5 Aug, 2019 08:32 IST|Sakshi
ఐదుగురు దొంగలను విలేకర్ల ముందు ప్రవేశపెట్టి చోరీ వివరాలు చెబుతున్న డీఎస్పీ మసూమ్‌ బాషా, సీఐ నాగమోహనరెడ్డి 

సాక్షి, అమలాపురం : ఓ డాక్టర్‌గారి కారుకు తరచూ ఆప్టింగ్‌ డైవర్‌గా వెళ్లే ఓ యువకుడు ఆ ఇంటి ఆనుపానులు అన్నీ తెలుసుకొని స్నేహితులతో కలిసి చోరీకి పాల్పడ్డాడు. డాక్టర్‌ హైదరాబాద్‌ వెళ్లగా ఇంట్లో ఆయన భార్య మాత్రమే ఉన్న సమయంలో తన స్నేహితులతో చోరీ చేయించాడు. ఆమె మెడలోని రూ.1.32 లక్షల విలువైన 44 గ్రాముల బంగారు నగలు కాజేశారు. ఈ సంఘటన జరిగిన పదిరోజులు కాకుండానే రాజోలు పోలీసులు నిందితులను అరెస్టు చేసి నగలను స్వాధీనం చేసుకుని వారిని కోర్టులో హాజరుపరిచారు. ఆ వివరాలను ఆదివారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో అమలాపురం డీఎస్పీ షేక్‌ మసూమ్‌ బాషా రాజోలు సీఐ కె.నాగమోహరెడ్డి, ఎస్సై ఎస్‌.శంకర్‌లతో కలసి విలేకర్ల సమావేశంలో తెలియజేశారు. రాజోలు మండలం ములికిపల్లి గ్రామంలో డాక్టర్‌ గాదిరాజు నారాయణరాజు కొన్నేళ్లుగా ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన కొంబత్తుల శ్యామలరావు అలియాస్‌ శ్యామ్‌ కొన్నేళ్లుగా డాక్టర్‌ సూర్యనారాణరాజు కారుకు డ్రైవర్‌ అవసరమైతే ఆప్టింగ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

డాక్టర్‌ ఎక్కడకైనా వెళ్లాల్సివస్తే శ్యామ్‌కు ఫోన్‌ చేసి ఆప్టింగ్‌ డ్రైవర్‌గా తీసుకు వెళుతున్నారు. శ్యామ్‌ డాక్టర్‌ కుటుంబం నమ్మకాన్ని సంపాదించుకున్నాడు. గత నెల 26వ తేదీ మధ్యాహ్నం డాక్టర్‌ సూర్యనారాయణరాజు శ్యామ్‌కు ఫోన్‌ చేసి తాను హైదరాబాద్‌ వెళ్తున్నానని, కారుకు ఆప్టింగ్‌ డ్రైవర్‌గా రావాలని చెప్పారు. అయితే అదే సమయానికి తన ఆస్పత్రిలో డ్రైవింగ్‌ వచ్చిన కాంపౌండర్‌ అందుబాటులో ఉండడంతో డాక్టర్‌ నారాయణరాజు శ్యామ్‌కు ఫోన్‌ చేసి అవసరం లేదని చెప్పారు. డాక్టర్‌ ఊరు వెళ్లడంతో సాయంత్రం ఆరు గంటలైతే ఆసుపత్రి సిబ్బంది వెళిపోతారు. ఇంట్లో డాక్టర్‌ భార్య రాణి సంయుక్త (72) మాత్రమే ఉంటారు.  ఆమె దివ్యాంగురాలు. ఈ పరిస్థితులను శ్యామ్‌ అదనుగా తీసుకున్నాడు. తన స్నేహితులైన ఏనుగుపల్లి ధర్మరాజు అలియాస్‌ ధర్మ, నేరేడుమిల్లి రాజువర్మ అలియాస్‌ రాజేష్, మాదాసి వెంకటేష్‌ అలియాస్‌ చిన్న, మర్లపూడి ప్రేమ్‌బాబుతో కలిసి డాక్టర్‌  ఇంట్లో చోరీకి ప్లాన్‌ చేశాడు. ఈ అయిదుగురూ యువకులే.

డాక్టర్‌ భార్యపై దాడి..ఆపై చోరీ
26వ తేదీ సాయంత్రం ఆరు గంటలు దాటాక చీకటి పడ్డాక ఆసుపత్రి పై అంతస్తులో ఉన్న డాక్టర్‌ ఇంట్లోకి ధర్మ, రాజేష్‌ వెళ్లారు. ఆసుపత్రి గేటు వద్ద ఒకరు కాపలా ఉన్నారు. ఆసుపత్రి బయట రోడ్డుపై మరో స్నేహితునితో కలిసి రెండు మోటారు సైకిళ్లపై శ్యామ్‌ వేచి ఉన్నాడు. డాక్టర్‌ భార్యపై దాడి చేసి ఆమె మెడలో ఉన్న నగలను దోచుకున్నారు.

జిల్లా ఎస్పీ నయీం అస్మి అభినందన
ఈ చోరీ కేసును కేవలం ఎనిమిది రోజుల్లో ఛేదించి చోరీకి పాల్ప డిన డ్రైవర్‌ శ్యామ్, అతని నలుగురు స్నేహితులను అరెస్టు చేయడంతో పాటు బంగారు నగలను నూరు శాతం రికవరీ చేసిన రాజోలు సీఐ నాగమోహనరెడ్డి, ఎస్సై శంకర్, హెచ్‌సీలు కె.గణేష్, ఎ.ప్రభాకర్, బొక్కా శ్రీను, కానిస్టేబుల్‌ వీరేంద్ర, హోంగార్డ్‌ అనంద్‌లను జిల్లా ఎస్పీ నయిమ్‌ అస్మీ, డీఎస్పీ బాషా ప్రత్యేకంగా అభినందించారు. వారికి రివార్డు కూడా ప్రకటిస్తారని డీఎస్పీ తెలిపారు. చోరీకి ఉపయోగించిన రెండు మోటారు సైకిళ్లు, రెండు సెల్‌ఫోన్లను కూడా నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. ఈ అయిదుగుర్నీ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజోలు మండలం చింతలపల్లి కళింగుల సెంటరులో రెండు మోటారు సైకిళ్లపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు