మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు

7 Feb, 2019 11:38 IST|Sakshi

సాక్షి, విజయవాడ: సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం చేపట్టిన ‘ఛలో అసెంబ్లీ’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో భాగంగా బీసెంట్‌ రోడ్డులో ధర్నా చేస్తున్న ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. మహిళా ఉద్యోగుల్ని ఈడ్చి పడేశారు. 13 జిల్లాల నుంచి అమరావతి తరలి వస్తున్న ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. విజయవాడలోని యూటిఎఫ్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. యూటీఎఫ్‌ కార్యాలయం వద్ద ప్యాప్టో చైర్మన్‌ సహా పలువురు ఉపాధ్యాయ, ఉద్యోగులను అరెస్టు చేసి బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

శాంతియుతంగా ధర్నా చేస్తున్న తమపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని ఉద్యోగులు  మండిపడ్డారు. గత మూడు సంవత్సరాలనుండి లక్షా ఎనభైవేల మంది రోడ్లపైకొచ్చి ఉద్యమాలు చేస్తున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనలకు పిలుపునిచ్చిన ఉద్యోగులను దొంగలు, దోపిడీ దారుల మాదిరిగా ఇళ్లకు, స్కూళ్లకు వెళ్లి బైండోవర్‌ చేయడం దారుణమన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయకపోతే టీడీపీకి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు