పరిమళించిన మానవత్వం

10 Apr, 2018 13:48 IST|Sakshi

కొత్తపాలెం అండర్‌పాత్‌వేలో పడి ఉన్న వృద్ధురాలు

స్పందించండంటూ సీపీకి ఓ వ్యక్తి వాట్సాప్‌ మెసేజ్‌

సీపీ ఆదేశాలతో పరుగులు తీసిన గోపాలపట్నం పోలీసులు

ఎస్‌ఆర్‌ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు

అనంతరం పెందుర్తి లయోలా ఆశ్రమానికి తరలింపు

గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): మానవత్వం పరిమళించింది. ఎంతలా అంటే... కాలువలో దీనావస్థలో పడి ఉన్న వృద్ధురాలికి మెరుపు వేగంతో ఆస్పత్రిలో వైద్యం చేయించడం... అనంతరం ఓ ఆశ్రమానికి తరలించడం... ఇదంతా ఒకే ఒక్క ఫొటో ఆధారంగా గంటల వ్యవధిలోనే జరిగిపోయింది. వివరాల్లోకి వెళ్తే... గోపాలపట్నం శివారు కొత్తపాలెం అండర్‌ పాత్‌ వే వద్ద 80 ఏళ్ల  వయసున్న ఓ వృద్ధురాలు పడి ఉంది. మలమూత్ర విసర్జనలతో మూలుగుతోంది.

ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మనకెందుకులే అని ముందుకు సాగిపోయారు. అయితే రాత్రి ఏడు గంటల సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఇలా వెళ్తూ ఆ వృద్ధురాలిని గమనించాడు. మాట్లాడుదామంటే ఆమె నోట మాట లేదు. దగ్గరకెళ్తే తీవ్రంగా రోత... ఇలా ఉన్న చిత్రాన్ని అతను నేరుగా పోలీస్‌ కమిషనర్‌ యోగానంద్‌కు వాట్సాప్‌లో పంపారు. దయచేసి స్పందించాలని కోరాడు.

అంతే యోగానంద్‌ నుంచి గోపాలపట్నం సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వైకుంఠరావుకు సమాచారం వచ్చింది. ఆయన ఎస్‌ఐ శ్రీనివాస్‌మహంతి, సిబ్బందితో హుటాహుటిన కొత్తపాలెం అండర్‌పాత్‌వే వద్దకు చేరుకుని రక్షక్‌లో గోపాలపట్నం ఎస్‌ఆర్‌ మల్టీస్పెషాల్టీ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ సీఈవో గిరి, వైద్యులను ఒప్పించి ఉచితంగా వైద్యసేవలు చేయించారు. అనంతరం సీఐ వైకుంఠరావు ప్రేమసమాజం యాజమాన్యంతోనూ, పలు వృద్ధాశ్రమాల నిర్వాహకులతోనూ సంప్రదించారు. పెందుర్తిలో ఉన్న లయోలా వృద్ధాశ్రమ నిర్వాహకుడు ప్రకాశరావు స్పందించడంతో అక్కడికి పోలీసులు వృద్ధురాలిని అంబులెన్స్‌లో తరలించారు.

అయితే వృద్ధురాలి వివరాలు తెలియకపోవడంతో పోలీసులు ఆ దిశగా ప్రయత్నిస్తున్నారు. మెరుపువేగంతో పోలీసులు, ఇక్కడి ఆస్పత్రి  వైద్యులు, సిబ్బంది స్పందించిన తీరుకి సీపీ యోగానంద్‌ వాట్సాప్‌ ద్వారా ప్రశంసించారు. 

మరిన్ని వార్తలు