పందెం.. కన్నీటి సంద్రం

12 Jan, 2019 12:59 IST|Sakshi
ప్రమాదానికి కారణమైన బావి

పండుగ సమయాన రెండు కుంటుంబాల్లో విషాదం

చాట్రాయిలోని కోడి పందేల శిబిరంపై అర్ధరాత్రి పోలీసుల దాడి

పరుగులు పెట్టిన పందెం రాయుళ్లు, వీక్షకులు

ప్రమాదవశాత్తూ నేలబావిలో పడిన ఇద్దరు యువకులు

బయటకు తీసే లోపే మృతి

పండగ సమయాన రెండు కుంటుంబాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. సరదాగా కోడి పందేలు చూద్దామని వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరిపోయారు. కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు చేసిన దాడి రెండు కుంటుంబాలను కన్నీటి సంద్రంలోకి నెట్టింది. పోలీసులు రావడాన్ని గమనించిన పందెం రాయుళ్లు, వీక్షకులు అక్కడి నుంచి పరుగులు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు మాత్రం నేల బావి రూపంలో కాపుకాసిన మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. మృతుల్లో మరో రెండు నెలల్లో పెళ్లి నిశ్చియమైన యువకుడు.. రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబానికి ఆధారమైన మరో వ్యక్తి ఉన్నారు. దీంతో ఆయా కుంటుంబాలు శోకంలో మునిగిపోయాయి.

సాక్షి, అమరావతిబ్యూరో/ చిత్తపూరు(చాట్రాయి) : కోడి పందేల శిబిరంపై పోలీసులు నిర్వహించిన దాడిలో పెను విషాదానికి దారి తీసింది. ఘటనలో పందెం రాయుళ్లు పారిపోగా.. పోటీలను చూసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నేలబావిలో పడి మృత్యువాత పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామ శివారుల్లో గొల్లగూడెంకు చెందిన గంగుల సాంబయ్య ఇంటివెనుక ఉన్న స్థలంలో గ్రామంలోని యువకులు వాలీబాల్‌ ఆడుకుంటూ ఉంటారు. అదే ఆటస్థలంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గత పదిరోజులుగా ఫ్లడ్‌లైట్ల వెలుగులో అర్ధరాత్రి సమయంలో దాదాపు 40 మంది వరకు కోడిపందేలు నిర్వహిస్తున్నారు.

ఈ విషయం చాట్రాయి పోలీసులకు తెలియడంతో ఎస్‌ఐ షబ్బీర్‌అహ్మద్, తన సిబ్బందితో కలిసి గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో దాడిచేశారు. పోలీసులు వస్తున్నారన్న విషయం తెలియడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా తలోదిక్కుకు పరుగులు పెట్టారు. వారితోపాటు పోటీలను వీక్షించేందుకు వచ్చిన చిత్తపూరు శివారు వీరయ్య నగర్‌కి చెందిన చిట్టూరి శ్రీనివాసరావు (21), విస్సన్నపేట మండలం కొండపర్వ గ్రామానికి చెందిన కుక్కల చెన్నకేశవరావు (26)లు కూడా పారిపోతూ అక్కడికి సమీపంలోనే ఉన్న నేలబావిలో పడిపోయి నీళ్లల్లో మునిగిపోయారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో పోలీసులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు మృతి చెందారు. శుక్రవారం ఉదయం విసన్నపేట అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మృతదేహాలను వెలికితీశారు.

కొత్తబట్టలు తెచ్చుకున్న కొన్ని గంటల్లోనే..  
మృతుడు శ్రీనివాసరావు చిత్తపూరు శివారు వీరయ్యనగర్‌లో నివసిస్తున్నాడు. ఇతను అవివాహితుడు. పదేళ్ల కిందటే శ్రీనివాస్‌ తండ్రి మృతిచెందడంతో.. తల్లి రమాదేవి, అన్న అనిల్‌తో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా గురువారం రాత్రే కొత్త బట్టలు కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకొచ్చారు. గ్రామంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలియడంతో పందేలు చూడడానికి వెళ్లాడు. ఇంతలో పోలీసులు రావడం.. భయంతో పరుగెత్తి నేలబావిలో పడి మృతి చెందడం క్షణాల్లో జరిగిపోయాయి. చేతికొచ్చిన కుమారుడికి రెండు నెలల్లో పెళ్లి చేద్దామని అనుకుంటున్న సమయంలో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఆధారం కోల్పోయారు..
ఇదే సంఘటనలో విస్సన్నపేట మండలం కొండపర్వలో నివసిస్తున్న కుక్కల చెన్నకేశవరావు మృతి చెందారు. దీంతో కొండపర్వలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి చెందిన చెన్నకేశవరావుకు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. కూలిపనులకు వెళ్లి వచ్చిన కూలి డబ్బులతో భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఆనందంగా ఉన్న ఈ కుటుంబంలో పెద్ద దిక్కు మృత్యువాత పడటం ఆ కుటుంబానికి తీరని నష్టం వాటిల్లింది. నాన్నా కావాలి.. అంటూ ఇద్దరు చిన్నారులు ఏడుస్తుండటం.. ఆ చిన్న పిల్లలను ఏవిధంగా పోషించుకోవాలి అంటూ మృతుడి భార్య విలపిస్తుండడంతో స్థానికులను కంటతడి పెట్టించింది.

పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు
కోడి పందేలపై కఠినంగా వ్యహరిస్తామంటూ ఏటా తీవ్ర హెచ్చరికలు జారీ చేసే పోలీసులు వాటిని ముందస్తుగా కట్టడి చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమయ్యారు. జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇప్పటికే అన్ని గ్రామాల్లోనూ టీడీపీ నేతల అండదండలతో నిర్వాహకులు బరులు ఏర్పాట్లు చేసేశారు. అయినా పోలీసులు ఎక్కడా ఎవరిని అడ్డుకున్న దాఖలాలు లేకపోగా.. ఇప్పుడు హడావుడిగా అర్ధరాత్రి వేళల్లో దాడులకు ఉపక్రమించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు