మీకో దండం.. మీ పరిహారానికో దండం!

22 Nov, 2018 08:11 IST|Sakshi
వెంకన్న చౌదరిని, అధికారులను నిలదీస్తున్న బాధితులు

ఎమ్మెల్యే సమావేశం వద్ద ఆవేదన వెల్లగక్కిన తిత్లీ బాధితులు

దరఖాస్తులతో వచ్చిన వారిని తోసేసిన పోలీసులు

రసాభాసగా ఉద్యానపంటల సమావేశం

శ్రీకాకుళం, వజ్రపుకొత్తూరు రూరల్‌: వజ్రపుకొత్తూరు మండల పరిషత్‌ కార్యాలయంలో బుధవారం ఉద్యానవన పంటలపై నిర్వహించిన సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. తిత్లీ తుఫాన్‌ నష్టపరిహారం అందకపోవడంతో ఎమ్మెల్యే శివాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి అధిక సంఖ్యలో బాధితులు తరలివచ్చి తమ ఆవేదన వెల్లగక్కారు. ఎమ్మెల్యే సమక్షంలో తమ గోడు వినిపించుకుంటే కొంతైనా  న్యాయం జరుగుతుందని ఆశగా వస్తే చివరికి నిరాశే మిగిలింది. ఎమ్మెల్యే మాట్లాడుతుండగా బాధితులు తమ బాధలు చెప్పడంతో ‘మీరు కేకలు వేస్తే ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ’ అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కొందరు బాధితులు అధికారులకు, ఎమ్మెల్యే అల్లుడు వెంకన్న చౌదరి(వీసీ)కి దరఖాస్తులు అందించడానికి ఎగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సమయంలో వీసీ పక్కన ఉన్న ఎస్సై కె.వి.సురేష్‌ను పిలిచి బాధితులను బయటకు పంపించమని చెప్పడంతో పోలీ సులు వారిని బయటకునెట్టేశారు. దీంతో వృద్ధులు, మహిళలు స్పల్ప అస్వస్థతకు గురై కార్యాల యం బయటకు వచ్చేశారు. మీకో దండం.. మీరిస్తు న్న పరిహారానికో దండం అంటూ శాపనార్థాలు పెట్టారు.

గోడు వినే వారే లేరా?
బాధితుల గోడు వినని సమావేశం ఎందుకు నిర్వహించారో ఎమ్మెల్యే, అధికారులకే తెలియాలని సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. దరఖాస్తులు తీసుకోకుండా, తమ బాధలు వినే వారే కరువయ్యారని పలువురు వాపోయారు. న్యాయం జరుగుతుందనే ఆశతో వస్తే ఎమ్మేల్యే అల్లుడు వెంకన్న చౌదరి పోలీసులను ఆదేశించి బయటకు నెట్టడం భావ్యంగా లేదని దేవునల్తాడ, కొత్తపేట, అమలపాడు, తోటూరు, కంబలరాయుడుపేట తదితర గ్రామాల బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 

పరిహారం అందిస్తాం..
నష్టపోయిన బాధితులందరికీ పరిహారం అందిస్తామని ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, పెరిగిన ఒత్తిడి వల్ల నమోదులో తప్పులు దొర్లాయన్నారు. ఇప్పటికే మండల కేంద్రానికి 29 వేలు దరఖాస్తులు రావడంతో వాటన్నింటినీ పరిశీలించడం సా ధ్యం కాదని, ప్రజలే వాస్తవాలు చెప్పి అధికారుల కు సహకరించాలని కోరారు. అధికారులు కూడా నిజమైన బాధితుల జాబితానే అందించాలని ఆదేశించారు. అనర్హులు ఉంటే వారి నుంచి పరిహారా న్ని రికవరీ చేస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో ఉద్యానవన శాఖ ఏడీ చిట్టిబాబు, ఎంపీపీ గొరకల వసంతరావు, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరపల్లి నీలవేణి, తహసీల్దార్‌ రమణయ్య, ఎంపీడీ ఓ తిరుమలరావు, ఉద్యానవన శాఖాధికారి సునీత తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా