నివురుగప్పిన నిప్పులా..!

8 Oct, 2013 02:10 IST|Sakshi
నివురుగప్పిన నిప్పులా..!

సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం పూర్తిగా పోలీసుల దిగ్బంధంలో ఉంది.  ఏ వీధిలో చూసినా పోలీసులు, సీఆర్పీఎఫ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాల బూట్ల చప్పుడే వినిపిస్తోంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. రెండ్రోజులుగా పోలీసుల మీద రాళ్లతో విరుచుకుపడిన ఉద్యమకారులు కాస్త నెమ్మదించారు. ఇదే తరుణంలో భద్రతా బలగాలు వీధివీధినా జల్లెడపట్టి అనుమానం వచ్చిన వారందర్నీ వ్యాన్లలో ఎక్కించి పోలీస్‌స్టేషన్లకు తరలిం చారు.

 

అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నదీ పోలీసులు వెల్లడించడం లేదు. ఆదివారం ఉదయం నుంచీ కర్ఫ్యూ అమలు చేయగా సోమవారం సైతం అదే పరిస్థితి కొనసాగించారు. దీంతో పట్టణం మొత్తం నిర్మానుష్యంగా మారింది. భద్రతా బలగాల బూట్ల చప్పుళ్లు, వారి వాహనాల రొద మినహా ఇతరత్రా శబ్దాలేమీ వినిపించడం లేదు. నిత్యావసరాలు, పాలు సైతం దొరక్క ప్రజలు అవస్థలు పడ్డారు. దీనికితోడు  విద్యుత్ సరఫరా సైతం నిలిచిపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతం. రెండురోజుల పాటు ఉద్యమకారులు, పోలీసులకు మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగినా సోమవారానికి పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది. రోడ్లమీద కొందరు యువకులు సంచరించడాన్ని గుర్తించిన బలగాలు ఆయా కాలనీలు, ఇళ్లలోకి చొరబడి చితకబాదడం మొదలెట్టారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
 
 అనంతరం కొందరు యువకులు వీధుల్లోకి వచ్చి పోలీసుల మీదకు రాళ్లు రువ్వారు.  పరిస్థితి  ఉద్రిక్తంగా మారడంతో  జొన్నగుడ్డి కాలనీలో పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఈ షెల్ సరాసరి నాలుగు నెలల పసిపాప ముందు పడడంతో ఆ చిన్నారి ఊపిరి తీసుకోవడం కష్టమై అస్వస్థతకు గురైంది. ఈపాపతోబాటు మరో ఇద్దరు చిన్నారులు ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు.  దీంతో కాలనీవాసులు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి నిరసన తెలిపారు. ఇంతలో స్థానిక ఎస్‌ఐ కృష్ణ కిశోర్ వచ్చి బలగాలకు సర్దిచెప్పి, చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఎస్పీ నవీన్ గులాటీ తదితరులు అక్కడికి వచ్చి స్థానికులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కన్యకాపరమేశ్వరి ఆలయం వద్ద  యువకులు రాళ్లు రువ్వడంతో కొద్దిపాటి ఉద్రిక్తత నెలకొనగా పోలీసులు నియంత్రించారు. మండపం వీధి వద్ద పోలీసు జీపు మీదకు ఓ ఆకతాయి రాయి విసరడంతో ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. మొత్తానికి రెండు రోజులుగా విధ్వంసాలతో అట్టుడికిన విజయనగరంలో ఇప్పుడిప్పుడే ప్రశాంతత నెలకొంటోంది.
 
 బొత్స దిష్టిబొమ్మతో శవయాత్ర
 విజయనగరం యుద్ధభూమిలా మారేందుకు బొత్స సత్యనారాయణే కారణమని ఆరోపిస్తూ పట్టణ శివారు బీసీ కాలనీలో ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర చేసి అంత్యక్రియలు నిర్వహించారు. పదవి కోసం తన స్వలాభం కోసం రాష్ట్ర విభజనకు బొత్స కుట్రపన్నారని స్థానికులు ఆరోపించారు. ఆయన స్వార్థానికి ప్రజలు బలైపోతున్నారని ఆవేదన చెందారు.
 
 నేడు కర్ఫ్యూ సడలింపు
 ఇదిలా ఉండగా రెండ్రోజులుగా అమలవుతున్న కర్ఫ్యూను మంగళవారం గంటసేపు సడలించనున్నట్లు కలెక్టర్ కాంతిలాల్ దండే తెలిపారు. ఉదయం 7నుంచి 8 గంటల వరకూ కర్ఫ్యూ సడలిస్తామని, ఈ సమయంలో నిత్యావసరాలు కొనుక్కోవాలని ప్రజలకు సూచించారు. పరిస్థితిని బట్టి సడలింపు పెంచుతామన్నారు.

మరిన్ని వార్తలు