రొయ్యల మేత లారీ అపహరణ 

15 Dec, 2019 10:30 IST|Sakshi
చోరీకి గరైన లారీని స్వాధీనం చేసుకుని స్టేషన్‌ వద్ద ఉంచిన దృశ్యం

డయల్‌ 100 కాల్‌తో స్పందించిన పోలీసులు 

గంటల వ్యవధిలోనే లారీ గుర్తింపు, స్వాధీనం 

బాలాజీనగర్‌ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ 

నెల్లూరు (క్రైమ్‌):  రొయ్యల మేతలోడ్‌తో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని గుర్తుతెలియని దుండగులు అపహరించారు. ఈ ఘటనపై బాధిత లారీ యజమాని డయల్‌ 100కు ఫోన్‌ చేయడంతో బాలాజీనగర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గంటల వ్యవధిలోనే లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సేకరించిన సమాచారం మేరకు.. ఎన్‌టీఆర్‌ నగర్‌ నాల్గో బిట్‌లో ఎ.మల్లికార్జున్‌రెడ్డి నివాసం ఉంటున్నారు. ఆయనకు ఐదు లారీలు ఉన్నాయి. వాటిని అద్దెకు తిప్పుతున్నారు. అతని వద్ద  సరస్వతీనగర్‌కు చెందిన జి.వెంకటేశ్వర్లు (అల్లుడు) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 12న వెంకటేశ్వర్లు బియ్యం లోడ్‌ను తీసుకుని చెన్నైకు వెళ్లాడు. అక్కడ 13వ తేదీన నెల్లూరు రామ్మూర్తినగర్‌లోని నర్మదా ఎంటర్‌ప్రైజస్‌కు చెందిన రొయ్యల మేతను లారీలో లోడ్‌ చేయించుకుని నెల్లూరుకు బయలుదేరాడు. రాత్రి 9.30 గంటలకు నెల్లూరుకు చేరుకున్నాడు. ఆ సమయలో కూలీలు లేకపోవడంతో లారీని ఎన్‌టీఆర్‌నగర్‌లోని ఎస్వీజీఎస్‌ కళాశాల వద్ద పార్క్‌ చేసి లారీలోనే పడుకుని ఉదయం కూలీలు వచ్చిన అనంతరం అన్‌లోడ్‌ చేయించాలని అతని మామ మల్లికార్జునరెడ్డి సూచించాడు. అయితే వెంకటేశ్వర్లు లారీలో కొద్ది సేపు పడుకుని, లారీ తాళాలను క్యాబిన్‌లో పెట్టి డోర్‌కు తాళం వేసుకుని ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం కళాశాల వద్దకు వచ్చి చూడగా లారీ కనిపించలేదు. దీంతో వెంకటేశ్వర్లు తన మామకు చెప్పాడు.
 
డయల్‌ 100కు ఫిర్యాదు.. గంటల వ్యవధిలో లారీ పట్టివేత 
లారీ చోరీ ఘటనపై బాధితుడు మల్లికార్జునరెడ్డి శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో  ఘటనా స్థలం నుంచే డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వైవీ సోమయ్య జిల్లా వ్యాప్తంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం కావలి వైపు టోల్‌ప్లాజా, మరో బృందం గూడూరు బూదనం టోల్‌ప్లాజాలను పరిశీలించారు. చోరీకి గురైన లారీ బూదనం టోల్‌ ప్లాజాను క్రాస్‌ చేసి వెళ్లినట్లు సోమయ్య గుర్తించి లారీ ఆచూకీని కనుగొన్నారు. పోలీసు వాహనం లారీని సమీపిస్తున్న విషయాన్ని గమనించిన దుండగుడు లారీని ఆపి దూకి పరుగులు తీశాడు. పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు.  లారీని స్వాదీనం చేసుకుని, నిందితుడితో పాటు బాలాజీనగర్‌ స్టేషన్‌కు తరలించారు. నగర  ఇన్‌చార్జి డీఎస్పీ పి. శ్రీధర్‌ బాలాజీనగర్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుని లోతుగా విచారిస్తున్నారు. రొయ్యల ఫీడ్‌ విలువ రూ.43 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. చోరీకి గురైన రెండు గంటల వ్యవధిలోనే లారీని, అందులోని రొయ్యల ఫీడ్‌ను స్వాదీనం చేసుకున్న బాలాజీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వైవీ సోమయ్య, ఎస్సైలు పవన్‌కుమార్, వీరప్రతాప్‌ తదితరులను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ అభినందించినట్లు సమాచారం.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు