కిలాడి దంపతుల అరెస్టు

2 Dec, 2014 02:31 IST|Sakshi

క్రైం (కడప అర్బన్) : రెడీమేడ్ షోరూం నిర్వహిస్తూ అప్పుల పాలైన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ ఎట్టకేలకు పోలీసుల వలలో చిక్కాడు. ఏకంగా కానిస్టేబుల్ ఇంటిలో గతనెల 14వ తేదీన దొంగతనానికి పాల్పడే యత్నంలో అడ్డంగా దొరికిపోయాడు.  భర్త పాల్పడే దొంగతనాలకు భార్య తోడునీడగా నిలవడంతో  ఆమె కూడా కటాకటాల పాలైంది.  పసుపులేటి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ (34), అతని భార్య పసుపులేటి మంజువాణి అలియాస్ వాణి అలియాస్ గనమంతు మంజువాణి (30) అనే  కిలాడిజంటను  జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అర్బన్ సీఐ శ్రీరాములు, తాలూకా ఎస్‌ఐ బాల మద్దిలేటి  ప్రత్యేక బృందంగా ఏర్పడి ఐటీఐ సర్కిల్ వద్ద సోమవారం అరెస్టుచేశారు.

వారి వద్దనుంచి రూ. 12 లక్షల విలువైన 405 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలను రికవరీ చేశారు. సోమవారం రాత్రి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారిని హాజరు పరిచారు. ఈ సందర్బంగా డీఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన పసుపులేటి చంద్రశేఖర్ అలియాస్ శంకర్ నేహా రేడీమేడ్ షోరూం పెట్టుకుని జీవించేవాడన్నారు. ఆ షాపు దివాళా తీయడంతో అప్పుల పాలై దుర్వసనాలకు లోనై నేరాలకు పాల్పడ్డాడన్నారు. 2013 నుంచి ఇప్పటివరకు 12 దొంగతనాల్లో ప్రమేయం ఉన్నట్లు తమ విచారణలో తెలిసిందన్నారు.

గత సంవత్సరం డిసెంబరు 2న నకాష్‌లో, జనవరి 23న బాలాజీనగర్‌లో, ఏప్రిల్ 4న విజయనగర్ కాలనీలో, జూన్ 7న బాలాజీనగర్‌లో, జులై 28, 29 తేదీలలో ఎస్‌బీఐ కాలనీలోని పామ్ గ్రూవ్ రెసిడెన్సీలో, ఆగస్టు 10, 11 తేదీలలో విజయదుర్గ కాలనీలో, అక్టోబరు 15న రాజారెడ్డివీధిలో, అదేరోజు ప్రకాశ్‌నగర్‌లో, అదేనెల 26న నబీకోటలో చోరీలకు పాల్పడ్డారు. అదేనెలలో 19న జెడ్పీ ఆవరణంలో, జూన్ 10వ తేదీన హరిత రెస్టారెంట్ సమీపంలో మోటారు సైకిళ్లను దోచుకున్నారు.

నేరాలకు పాల్పడే శైలి
చంద్రశేఖర్ అలియాస్ శంకర్ ప్రస్తుతం నగరంలోని ఓ ప్రముఖ షాపింగ్‌మాల్‌లో పనిచేస్తూ రాజారెడ్డివీధిలో నివసిస్తున్నాడు. అతని భార్య మంజువాణి నగర శివార్లలోని ఓ ప్రముఖ కార్పొరేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. తన సహచర ఉపాధ్యాయులు నివసించే ప్రాంతాలను మొదట తన భర్తతోసహా వెళ్లి పరిశీలిస్తారు. పాఠశాల వేళల్లో ఉపాధ్యాయుల హ్యాండ్‌బ్యాగుల్లో ఉండే తాళాలను వారికి తెలియకుండా తీసుకుని భర్తకు అందజేస్తుంది. తర్వాత ఆమె భర్త సదరు ఇళ్లకు వెళ్లి తాళాలు తీసి లోపలున్న వస్తువులను దోచుకుంటారు. తర్వాత ఏమీ ఎరగనట్లు తాళాలను భార్య చేతికి ఇస్తే ఆమె సదరు ఉపాధ్యాయుల తాళాలను వారి బ్యాగులోనే గమనించకుండా దాచేస్తుంది.

ఒకవేళ తాళాల కనబడక బాధితులు వెతుకుతుంటే తనకు ఫలానా చోట దొరికాయని ఆమె వారికి అందజేస్తుంది.  గతనెల 14వ తేదీన బాలల దినోత్సవం కావడం, అదే పాఠశాలలో బాలాజీనగర్‌లో నివసిస్తున్న ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలకు వెళ్లింది. సదరు ఉపాధ్యాయురాలు భర్త ట్రాఫిక్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతను టిఫెన్ తినేందుకు ఇంటికి వెళ్లిన సమయంలో  ఇంట్లో ఉన్న నిందితుడు చంద్రశేఖర్ అలియాస్ శంకర్ కానిస్టేబుల్‌ను చూడగానే బిత్తరపోయి పరారయ్యాడు. తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తే ఈ నేరాలన్నీ బట్టబయలయ్యాయి.

ఈ నేరాలను చేధించడంలో కృషి చేసిన కడప అర్బన్ సీఐ శ్రీరాములు,ఎస్‌ఐ బాల మద్దిలేటి, తాలూకా, సీసీఎస్ పోలీసులు, ఏఎస్‌ఐ మరియన్న, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున,కానిస్టేబుళ్లు రామాంజనేయులు, పరమేశ్, ప్రవీణ్, పెంచలయ్య, సాగర్, ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్‌రాజు, మహేశ్వరి, హోంగార్డులు సూర్యనారాయణమ్మ, శశికళలను డీఎస్పీ అశోక్‌కుమార్ అభినందించారు.  సమావేశంలో డీఎస్పీతోపాటు సీఐలు శ్రీరాములు, సదాశివయ్య, నాయకుల నారాయణ, ఎస్‌ఐలు బాలమద్దిలేటి, ఎస్వీ నరసింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.  ట్రాఫిక్ కానిస్టేబుల్ శంకర్‌రాజునుడీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

మరిన్ని వార్తలు