రూ.82లక్షల దోపిడీని ఛేదించిన పోలీసులు

14 May, 2015 18:43 IST|Sakshi

కావలి :  నవజీవన్ ఎక్స్ప్రెస్లో పోలీసులమని చెప్పి వ్యాపారుల నుంచి భారీగా నగదు దోచుకున్న కేసును పోలీసులు ఛేదించారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం అలవలపాడు వద్ద దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దోపిడీ చేసిన రూ.82 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.  పోలీసుల విచారణలో ఓ కొత్త కోణం వెలుగు చూసింది. వ్యాపారులను బెదిరించి వారి వద్ద నుంచి రూ.82 లక్షలు దోచుకు వెళ్లిన నలుగురు దుండగుల్లో ముగ్గురు స్పెషల్ పార్టీ పోలీసులు కావటం విశేషం. వీరంతా ప్రకాశం జిల్లాకు చెందినవారు.

కాగా కావలికి చెందిన వ్యాపారులు కొందరు గురువారం బంగారం కొనేందుకు నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైలులో నెల్లూరుకు బయలుదేరారు. అదే రైలులో ఎక్కిన నలుగురు వ్యక్తులు పోలీసులమంటూ వారి వద్దకు వచ్చారు. తనిఖీ చేయగా వ్యాపారుల వద్ద నగదు కనిపించింది. అందుకు సంబంధించి రుజువులు చూపాలని ఆగంతకులు వారిని బెదిరించారు.

వ్యాపారుల వద్ద ఉన్న మొత్తం రూ.82 లక్షలను లాక్కుని...నెల్లూరు నుంచి వారందరినీ కారులో ఎక్కించుకుని దగదర్తి మండలం దామవరం దగ్గర వదిలేశారు. అనంతరం ఆగంతకులు ప్రకాశం జిల్లా గుడ్లూరు వైపు వెళ్లి, కారును అక్కడ వదిలేశారు. బాధితులు కావలి చేరుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు దోపిడీని కొన్ని గంటల్లోనే ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు