కావలి డీఎస్పీ నేతృత్వంలో నిఘా పటిష్టం

12 Mar, 2019 12:14 IST|Sakshi
జాతీయ రహదారిపై ఉన్న చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు

సాక్షి, కావలి:  నియోజకవర్గంలో ఎన్నికలు నిబంధనలు మేరకు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు కావలి డీఎస్పీ దేవరకొండ ప్రసాద్‌ నేతృత్వంలో అధికారులు నిఘాను పటిష్టం చేశారు. కావలి వన్‌ టౌన్, టూ టౌన్, కావలి రూరల్, బిట్రగుంట, దగదర్తి, అల్లూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఉన్న సీఐలు, ఎస్‌ఐలను సమన్వయం చేసుకుని ఏఎస్‌ఐలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులతో పాటు అదనంగా ఇతర బలగాలను నియోజకవర్గంలో మోహరించారు.

కావలిలోని డీఎస్పీ కార్యాలయంలో ఎన్నికల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు.  కాగా నియోజకవర్గం ప్రధానంగా జిల్లా సరిహద్దు కావడం,  చెన్నై –కలకత్తా జాతీయ రహదారి ఉండటంతో సున్నితమైన అంశాలపై  ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. జిల్లా సరిహద్దు ప్రాంతమైన రుద్రకోట వద్ద అంతర్‌ జిల్లా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లా నుంచి కావలిలోకి ప్రవేశించే  వాహనాలను తనిఖీ చేయడానికి కావలి పోలీసుల ఆధర్వంలో చెక్‌ పోస్టు నిత్యం పని చేస్తోంది.

ప్రతి ఇవాహనాన్ని తనిఖీ చేయనిదే జిల్లాలోకి ప్రవేశించనీయడం లేదు. అలాగే కావలి నుంచి వెళ్లే వాహనాలను ప్రకాశం జిల్లా గుడ్లూరు పోలీసులు తనిఖీలు చేసేందుకు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ రహదారిని పోలీసులు డేగ కళ్లతో సునిశిత పరిశీలన చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారిపై కావలి రూరల్‌ మండలం గౌరవరం వద్ద ఉన్న టోల్‌గేట్‌ వద్ద చెక్‌ పోస్ట్, దగదర్తి మండలం సున్నపుబట్టి వద్ద చెక్‌ పోస్ట్‌ లను ఏర్పాటు చేశారు.

ఈ మూడు చెక్‌ పోస్టులు కూడా జాతీయ రహదారిపై ఉంది. అలాగే ఉదయగిరి నియోజకవర్గం నుంచి కావలి లోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేయడానికి కావలి–ఉదయగిరి రోడ్డు లో కావలి పట్టణ పడమటి పొలిమేరల్లో ఉన్న బుడంగుంట వద్ద చెక్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు. ఈ చెక్‌ పోస్ట్‌ల వద్ద సీసీ కెమెరాలు, బాడీ కెమెరాలను కూడా అమర్చారు. అలాగే రెవెన్యూ అధికారి, పోలీసులతో కలిసి ఒక్కో స్టేషన్‌ పరిధిలో ఫైయింగ్‌ పోలింగ్‌ ను ఏర్పాటు చేశారు. వీరికి కూడా బాడీ కెమెరాలను అమర్చారు.

నియోజకవర్గంలోని ఆరు పోలీస్‌ స్టేష న్లు పరిధిలో నిత్యం వీరు విస్తృతంగా పర్యటించి, సాయంత్రానికి డీఎస్పీకి నివేదిక అందజేస్తారు. ఆరు మంది ఎస్‌ఐలు, ముగ్గురు సీఐలు, పది మంది ఏఎస్‌ఐలు అధికారులు, ఇతర పోలీసు సిబ్బందిని కావలి డీఎస్పీ డి.ప్రసాద్‌  సమన్వయం చేసుకొంటూ ఎన్నికల బృందంగా ఎన్నికల ప్రశాంతంగా జరిగేందుకు, నిబంధనలు ఉల్లంఘన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొంటున్నారు.  

ప్రజల సహకారంతోనే ఎన్నికలు ప్రశాంతం 
ప్రజల సహకారంతో కావలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా జరిగేలా చేస్తాం. ప్రజలు ఎప్పటికప్పుడు అనుమానం ఉన్న అంశాలను, నిబంధనలు ఉల్లంఘించిన సమాచారాన్ని తెలియజేయాలి. సమాచారాన్ని తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం. చెక్‌ పోస్టుల వద్ద తనిఖీల సందర్భంలో, గ్రామాల్లో విధులు నిర్వహించే పోలీసులకు బాధ్యతగా సహకరించాలి. అసాంఘిక శక్తులు తోక జాడిస్తే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయి.                                             
–  దేవరకొండ ప్రసాద్, డీఎస్పీ, కావలి      

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా