మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం..

6 Dec, 2014 03:06 IST|Sakshi
మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం..

రాబంధువు
ఒంగోలులో మూడేళ్లుగా మహిళ నిర్బంధం
బంధువే వ్యభిచారం కూపంలోకి దించి చిత్రవధ
మాదక ద్రవ్యాలు, మత్తు ఇచ్చి నిత్యం వేధింపులు
రక్తమోడుతూ బయటకు పరుగులు తీసిన బాధితురాలు
స్థానికుల సాయంతో వ్యభిచారం నిర్వాహకుల గుట్టురట్టు  
హౌసింగ్‌బోర్డు, అరుణోదయకాలనీల్లో రెండు ఇళ్ల తనిఖీ
అక్కడి పరిస్థితులు చూసి నెవ్వెరపోయిన పోలీసులు
ఓ నిర్వాహకుడు అరెస్టు.. పోలీసుస్టేషన్‌కు తరలింపు
 
ఒంగోలు క్రైం : ఒంగోలులో మహిళలను బలవంతంగా వ్యభిచారం కూపంలోకి దించి వారిని చిత్రవధకు గురి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. నగరంలోని హౌసింగ్ బోర్డుకాలనీతో పాటు అరుణోదయ కాలనీలో రెండు ఇళ్లలో పోలీసులు శుక్రవారం తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులు చూసి విస్తుపోయారు. వివరాలు.. హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఓ ఇంటి నుంచి తీవ్రగాయాలు, అరకొర దుస్తులతో 24 ఏళ్ల యువతి శుక్రవారం ఉదయం బయటకొచ్చి దొడ్డిదారి నుంచి పక్కింట్లోకి వెళ్లింది.

ఆ ఇంటి యజమాని, ఎన్‌జీవో అసోసియేషన్ నాయకురాలు టి.రాజ్యలక్ష్మి.. ఆమెకు దుస్తులిచ్చి చేరదీసింది. వెంటనే చైల్డ్‌లైన్ (1098) ప్రతినిధి బీవీ సాగర్‌కు సమాచారం అందించింది. తాలూకా పోలీసులతో సాగర్ అక్కడకు చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు. ఆమె చెప్పిన మాటలు విని స్థానికులు, పోలీసులు నివ్వెరపోయారు. బాధితురాలు గాయాలపాలై ఉంది. వీపుపై కొరికిన గాయాలున్నాయి. అంటే ఆమెను ఏ స్థాయిలో చిత్రహింసలకు గురి చేశారో అర్థమవుతోంది. మూడేళ్లుగా నిర్బంధించి వ్యభిచారం చేయిస్తున్నారని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది.

పుట్టినరోజుకు పిలిచి.. చచ్చే వరకు కొట్టి
బాధితురాలిది కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం. వ్యభిచారం నిర్వాహకురాలు లక్ష్మిది కూడా అదే గ్రామం కావడం గమనార్హం. పైగా ఆమె బాధితురాలికి దూరపు బంధువు కూడా. పుట్టినరోజు పార్టీకని మూడేళ్ల క్రితం బాధితురాలిని లక్ష్మి తన ఇంటికి ఆహ్వానించింది. అప్పటి నుంచి ఆమెతో వ్యభిచారం చేయిస్తూనే ఉంది. బలవంతంగా మద్యం తాగించటం.. మత్తు పదార్థాలు తినిపించడం.. మాదక ద్రవ్యాలు చేతి మీద వేసి ముక్కుతో పీల్పించటం లక్ష్మికి వెన్నతో పెట్టిన విద్యని బాధితురాలు రోదిస్తూ చెబుతోంది. మంచానికి కట్టేసి మరీ చిత్రహింసలు పెట్టేదని కన్నీటిపర్యంతమైంది. రోకలిబండతో కొట్టడం.. కత్తితో పొడుస్తానని బెదిరించటం లక్ష్మికి నిత్యకృత్యమని చెప్పడంతో పోలీసులు సైతం చలించారు.

ఇక్కడా అంతే..
బాధితురాలి కథనం ప్రకారం అరుణోదయకాలనీలోని ఓ ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. తీరా అక్కడ శ్రీను అనే వ్యక్తి ఒక్కడే ఉన్నాడు. ఆ ఇల్లు కూడా హౌసింగ్‌బోర్డు కాలనీలోని ఇంటిని తలపించింది. సుమారు 100కుపైగా సీడీలు బయటపడ్డాయి. వాటిల్లో అశ్లీల చిత్రాలు, సినిమాలు ఉండి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలిని చికిత్స కోసం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తాలూకా పోలీసులు తెలిపారు.
 
అది ఇల్లేనా?
హౌసింగ్‌బోర్డులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటికి బాధితురాలితో కలిసి పోలీసులు వెళ్లారు. అప్పటికే లక్ష్మి తన ఇంటిక తాళం వేసి పరారైంది. ఇంటి చుట్టూ తిరిగిన పోలీసులకు లోన ఎవరో ఉన్నారని అనుమానం వచ్చింది. తాళాలు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లారు. మద్యం మత్తులో సుమారు 22 ఏళ్ల యువతి పోలీసుల కంటబడింది. ఆమెతో పాటు నలుగురు చిన్నపిల్లలూ ఉన్నారు. లోపల పరిస్థితి చూస్తే అత్యంత దారుణంగా ఉంది. ఇంటి నిండా వాడిపడేసిన కండోమ్‌లు, మద్యం సీసాలు, బటన్ చాకులు, ఏవేవో మత్తు పదార్థాలు కనిపించడంతో చుట్టుపక్కల వారు బిత్తరపోయారు.

మరిన్ని వార్తలు