కోరుకొండ దళమే టార్గెట్‌

14 Jun, 2019 13:16 IST|Sakshi
కూంబింగ్‌ నిర్వహిస్తున్న గ్రేహౌండ్స్‌ బలగాలు

ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నది ఆ దళమే

ముమ్మరంగా కూంబింగ్‌ భయాందోళనలో గిరి గ్రామాలు

సీలేరు(పాడేరు): విశాఖ ఏజెన్సీలో మావో యిస్టు పార్టీ ఆవిర్భవించిన∙నాటి నుంచి కోరుకొండ దళం ఆ ఉద్యమానికి ఎంతో కీలకం మారింది. ఎన్నో ఏళ్లుగా కోరుకొండ దళం ఈ ప్రాంతంలో పనిచేస్తోంది. ఆ దళంలో పనిచేసిన ఎందరో మావోయిస్టులు నాయకత్వ బాధ్యతలు నిర్వహించి పోలీసుశాఖకు  చెమటలు పట్టించారు. ఆ దళాన్నే టార్గెట్‌ చేసుకుని పోలీసు బలగాలు  జల్లెడ పడుతున్నాయి. ఆ దళం కోసం అణువణువు గాలింపు చేపడుతూ కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే గాలికొండ దళాన్ని నిర్మూలన చేశామని ప్రకటించిన పోలీసులు కోరుకొండ దళాన్ని కూడా పట్టుకుంటామని దీమాగా చెబుతున్నారు.విశాఖ ఏజెన్సీ తూర్పుగోదావరి అటవీ ప్రాంతంలో కోరుకొండ దళం ఉందని తాజాగా అందిన సమాచారంతో ఎనిమిది గ్రేహౌండ్స్‌ బలగాలు  ఆ ప్రాంతానికి చేరుకుని దళాన్ని చుట్టుముట్టాయి. అయితే త్రుటిలో మావోయిస్టులు తప్పించుకోవడతో వారికి చెందిన  తుపాకీలు, కిట్‌ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తప్పించుకున్నది కోరుకొండ దళమేనని పోలీసులు భావిస్తున్నారు. ఆ దళాన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో  కూంబిం గ్‌ను మరింత ముమ్మరం చేశారు. మరిన్ని బలగాలను అటవీ ప్రాంతంలో దింపారు. ఎదురుకాల్పుల్లో పాల్గొన్న గ్రేహౌండ్స్‌ బలగాలు కూడా ఇంకా తిరిగి రాలేదు.

మావోయిస్టు అగ్రనేత నవీన్‌ కీలకం
విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం మారుమూల ప్రాంతంలో ఎన్నో ఏళ్లుగా కోరుకొండ దళం ఉంది. ఆ దళానికి ప్రస్తుతం కీలక నేతగా  నవీన్‌ ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే దళం వ్యూహ, ప్రతి వ్యూహాలు పన్నుతోంది. ఆయనకు ముందున్న కుడుముల రవి, ఆజాద్‌తో పాటు మరికొందరు ముఖ్య నాయకులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఆ తర్వాత వచ్చిన నవీన్‌ ఆ దళాన్ని ముందుకు నడపడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.  మంగళవారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో నవీన్‌ కూడా ఉన్నట్టు పోలీసుల వద్ద సమాచారం ఉంది. దీనికి నిదర్శనం స్వాధీనం చేసుకున్న 303 తుపాకీలేనని, ఆ స్థాయి నేతలే దీన్ని వినియోగిస్తారని పోలీసులు భావిస్తున్నారు.ఈ క్రమంలో కూంబింగ్‌ ఉధృతం చేసి నవీన్‌ను పట్టుకోవాలని పోలీసులు కంకణం కట్టుకున్నారు. ఈ నేపధ్యంలో తూర్పుగోదావరి సరిహద్దు ప్రాంతంలో గిరిజన గ్రామాల్లో ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనని భయాందోళనలో గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు.

మరిన్ని వార్తలు