ఏజెన్సీలో బూట్ల చప్పుళ్లు!

29 Jul, 2019 12:30 IST|Sakshi
జోలాపుట్‌ రోడ్డులో డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేస్తున్న దృశ్యం

ప్రారంభమైన మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు

మావోయిస్టులు సంచరిస్తున్నట్టు ప్రచారం

జోరువానలో పోలీసుల గాలింపు

ముమ్మరంగా కూంబింగ్‌ నిలిచిపోయిన బస్సులు

విశాఖపట్నం,అరకులోయ/పెదబయలు: మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాలు  ఏవోబీలో ఆదివారం  ప్రారంభమయ్యాయి. ఆంధ్ర–ఒడిశా సరిహద్దులో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ మావోయిస్టులు అధికంగా సంచరిస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జోరువానలో తడుస్తూనే గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. కూంబింగ్‌తో అడవిని జల్లెడ పడుతున్నారు. దీంతో పోలీసులు, మావోయిస్టుల బూట్ల చప్పుళ్లతో అటవీ ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

ఇళ్లకే గిరిజనులు పరిమితం
మావోయిస్టులు తలపెట్టిన అమరవీరుల వారోత్సవాలు ముగిసేంత వరకు గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒడిశాలోని మల్కన్‌గిరి, కోరాపుట్‌ జిల్లాల పరిధిలోని గిరిజన ప్రజలతో పాటు ముంచంగిపుట్టు, పెదబయలు, జి.మాడుగుల, చింతపల్లి, జి.కె.వీధి మండలాల పరిధిలోని మావోయిస్టుపభావిత గ్రామాల గిరిజనులంతా తమ ఊర్లకే పరిమితమయ్యారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. బలిమెల రిజర్వాయర్‌ కటాప్‌ ఏరియాలోని గిరిజనులు రిజర్వాయర్‌లో లాంచీల ప్రయాణాన్ని మానుకున్నారు. ఏవోబీలోని గిరిజనులకు ప్రధాన మార్కెట్‌ ప్రాంతమైన ఒనకఢిల్లీకి గిరిజనుల రాకపోకలు తగ్గాయి.

నిలిచిపోయిన బస్సులు :  ఏజెన్సీలోని మారుమూల గ్రామాలు, సరిహద్దు ఒడిశాలోని గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. పాడేరు డిపో నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మండల కేంద్రాల వరకు ఆర్టీసీ బస్సులు నడుపుతుండగా, మారుమూల గ్రామాల సర్వీసులను రద్దు చేశారు. ప్రైవేటు వాహనాల రాకపోకలు  ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. ముంచంగిపుట్టు మండలం కుమడ నుంచి ఒడిశాలోని కటాప్‌ ఏరియాతో రవాణా సంబంధాలు నిలిచాయి. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో మావోయిస్టుల అమరవీరుల స్థూపాలు అధికంగా ఉండడంతో గిరిజనులు మరింత భయపడుతున్నారు.

మన్యంలో ఉద్రిక్తత : అమరవీరుల వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోయిస్టులు ప్రచారం చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారోత్సవాలను  భగ్నం చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. పైచేయి కోసం పోలీసులు, మావోయిస్టులు ఎవరికివారే ప్రయత్నం చేస్తుండడంతో విశాఖ మన్యంతో పాటు ఏవోబీలో ఉద్రిక్తత నెలకొంది. ఏవోబీలో ప్రత్యేక పోలీసు బలగాలు కూడా కూంబింగ్‌ చర్యలను చేపడుతున్నాయి. కటాప్‌ ఏరియాలో మల్కన్‌గిరి, కోరాపుట్‌ పోలీసు పార్టీలు, ఏజెన్సీ మారుమూల అటవీ ప్రాంతాలలో విశాఖ జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మందుపాతరలపై పోలీసుల నిఘా
మావోయిస్టులు ఏజెన్సీతో పాటు సరిహద్దులోని ఒడిశా రోడ్లలో మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానాలతో పోలీసు యంత్రాంగం  అప్రమత్తమైంది. కూంబింగ్‌ పార్టీలతోపాటు బాంబు తనిఖీ బృందాలు కూడా సంచరిస్తున్నాయి. మందుపాతరలు, ఇతర పేలుడు సామగ్రిని గుర్తించేందుకు డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపడుతున్నారు. ఆదివారం ముంచంగిపుట్టు నుంచి జోలాపుట్టు, ఒడిశాకు పోయే ప్రధాన రోడ్లలో బాంబు, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేపట్టారు. ఏజెన్సీలోని అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలు జరుగుతున్నాయి. అన్ని వాహనాలను తనిఖీ చేసి,అనుమానిత వ్యక్తుల లగేజీ బ్యాగ్‌లను క్షుణంగా సోదా చేస్తున్నారు.ఒడిశా నుంచి అరకు ప్రధాన రోడ్డులో కూడా పోలీసుల తనిఖీలు మమ్మురమయ్యాయి.  పాడేరు, ముంచంగిపుట్టు  మండలాల నుంచి వచ్చే వాహనాలను స్థానిక ఎస్సై రాజారావు ఆధ్వర్యంలో తనిఖీ చేశారు.

మరిన్ని వార్తలు