అగ్రనేతల కోసం జల్లెడ!

13 May, 2019 12:43 IST|Sakshi

మన్యంపై పోలీసుల కన్ను

రంగంలోకి యాక్షన్‌ టీమ్‌లు

విశాఖ ఏజెన్సీలో యుద్ధ వాతావరణం

సాక్షి, విశాఖపట్నం: విశాఖ మన్యం వణుకుతోంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక గిరిజనులు బిక్కుబిక్కుమంటున్నారు. కూంబింగ్‌ దళాల బూటు చప్పుళ్ల శబ్ధాలతో దండకారణ్యం మరోసారి దద్దరిల్లుతోంది. ఒడిశా సరిహద్దుల్లోని పాడువా వద్ద జరిగిన ఎకౌంటర్‌లో ఐదుగురు కీలక నేతలు హతమయ్యారు. వీరిలో ముగ్గురు అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేర సోమలను హతమార్చిన మావోల బృందంలో కీలక పాత్ర పోషించినట్టుగా గుర్తించారు. మరో వైపు వీరి వద్ద లభ్యమైన కిట్‌ బ్యాగ్‌లలో అత్యంత కీలక సమాచారం పోలీసుల చేతికి చిక్కింది. ఏవోబీలో మావో అగ్రనేతలు గత కొంత కాలంగా షెల్టర్‌ తీసుకుంటున్నారన్న వార్త కలకలం రేపింది. ముఖ్యంగా మావోయిస్టుల అగ్రనేతలు చలపతి, అరుణ, నవీన్‌లు గిరిజనులతో కూడా భేటీఅవుతున్నారన్న సమాచారం పోలీసులను కలవరపెడుతోంది. పైగా మావోలకు సహకారం అందిస్తున్నది పోలీసులేనన్న వార్తలు పోలీస్‌ ఉన్నతా«ధికారులు జీర్ణించు కోలేకపోతున్నారు. ఈ ఆరోపణలతోనే సీలేరు జెన్కోలో పనిచేస్తున్న హోంగార్డులను సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మావో అగ్రనేతల కోసం మూడు కంపెనీల ప్రత్యేక బలగాలు గాలింపు సాగిస్తున్నారు. మరో వైపు ఆదివారం యాక్షన్‌ టీమ్స్‌ను కూడా రంగంలోకి దించారు. విశాఖ రేంజ్‌ డీఐజీ, ఎస్పీలు స్వయంగా పర్యవేక్షి స్తున్నారు. ఉత్తరాంధ్ర గిరిజనుల ఇలవేల్పు అయిన పాడేరు మోదకొండమ్మ జాతర మహోత్సవాలను లక్ష్యంగా చేసుకుని  ప్రతి ఏటా మావోలు ఏదో ఒక అలజడి సృష్టిస్తుంటారు. గతంలో ఇదే ఉత్సవాల సమయంలో జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్లు రవిశంకర్, సింహాచలంలను హతమార్చారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఇదే సమయంలో పలువుర్ని ఇన్‌ఫార్మర్ల నెపంతో మట్టుబెట్టారు.

ఈ నేపథ్యంలో ఈసారి జాతర మహోత్సవాల సందర్భంగా ఎలాంటి అలజడలు..అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు ఓ పక్క భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో వైపు విశాఖ మన్యంలోనే మావో అగ్రనేతలున్నారని, ఏదో భారీ విధ్వంసానికి తెగపడేందుకు కుట్ర చేస్తున్నారన్న సమాచారంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్‌ టీమ్‌లను రంగంలోకి దింపడంతో దండకారణ్యాన్ని జల్లెడపడుతున్నారు. అగ్రనేతలు సంచరించినట్టుగా చెబుతున్న గ్రామాల్లో అణువణువు గాలిస్తున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే ఓ ఆరడజను మంది గిరిజనుల విచారణ పేరుతో అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించారని, వార్ని విడిచిపెట్టాలంటూ వామపక్ష నేతలు ఎస్పీని కలిసి వినతిపత్రం కూడా సమర్పించారు.

మరో వైపు అనుమానం వచ్చిన గిరిజనులకే కాదు..పోలీసుల్లో కూడా మావోయిస్టులకు సహకరిస్తున్న వారు ఉన్నారన్న వార్తలతో మరింత నిఘా పెంచారు. ఒక్క పోలీసులనే కాదు.. వివిధ శాఖల్లో పనిచేస్తున్న మావో సాను భూతిపరులపై కూడా నిఘా పెట్టారు.ఏపీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి ఏపీ పోలీసులు, ఒడిశా సరిహద్దు వైపు నుంచి ఆ రాష్ట్ర పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఏవోబీలో కూంబింగ్‌ పార్టీని లక్ష్యంగా చేసుకుని శనివారం మావోలు మందుపాతర పేల్చడం..ఈ ఘటనలో ముగ్గురు ఎస్‌పీజీ దళ సభ్యులు గాయపడడంతో బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. కచ్చితంగా ఏవోబీలో మావోయిస్టుల కదలికలు ఎక్కువయ్యాయని భావిస్తున్నారు. ఎన్నికలనంతరం పోలీసులు కాస్త విశ్రాంతి తీసుకుంటారని భావించిన మావోలు ఏవోబీలో ఏదో విధంగా అలజడి సృష్టించేందుకు తెగపడే సూచనలు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. ఏది ఏమైనా మరో సంఘటన జరగకుండా సాధ్యమైనంత త్వరగా ఏవోబీలో మకాం వేసిన పోలీసులు మావో అగ్రనేతలను పట్టుకోవాలని పకడ్బందీ వ్యూహంతో ముందుకు కదులుతున్నారు.

మరిన్ని వార్తలు