ఖాకీ కాంప్లెక్స్‌కు ‘కుచ్చుటోపీ’..!

18 Jun, 2018 09:50 IST|Sakshi
కడప పాతబస్టాండ్‌ సమీపంలో ఉన్న పోలీసు కాంప్లెక్స్‌ దుకాణాల్లో ఓ వైపు సముదాయం  

2003 నుంచి టెండర్లు ఆహ్వానించని వైనం 

గడువు ముగిసిన ప్రతిసారీ నామమాత్రపు అద్దెలు పెంపు

ఈనెలాఖరుకు ముగియనున్న కాలపరిమితి

అధికార పార్టీ నేతల అండతో కొనసాగిస్తామంటున్న కొందరు వ్యాపారులు 

సాక్షి, కడప అర్బన్‌ : సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు యంత్రాంగం అహర్నిశలు శ్రమిస్తోంది. అలాంటి పోలీసు శాఖ పర్యవేక్షణలో ఉన్న పోలీసు కాంప్లెక్స్‌ దుకాణాల నిర్వాహకులు కొందరు ఆ శాఖ ఆదాయానికి గండిపడేలా ప్రవర్తించి ఏకంగా వారికే ‘కుచ్చుటోపీ’ పెడుతున్నారు. ఈ వ్యవహారంపై  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జిల్లా పోలీసు యంత్రాంగం సంక్షేమం కోసం కడప నగరం నడిబొడ్డున పాతబస్టాండ్‌ సమీపంలో 14 సెంట్ల స్థలంలో 22 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఈ దుకాణాల ద్వారా వచ్చే ఆదాయంతో అక్కడే ఉన్న పోలీస్‌ గెస్ట్‌హౌస్‌ నిర్వహణ, ఇతర ఖర్చులు, సంక్షేమం కోసం అప్పట్లో కడప ఒన్‌టౌన్‌ సీఐ పర్యవేక్షణలో వినియోగించేవారు. 2002కు ముందు ఈ దుకాణాల అద్దె నామమాత్రంగా ఉండేది. తర్వాత 2003లో 22 దుకాణాలకు గానూ టెండర్లను ఆహ్వానించి అద్దెలను దుకాణం విస్తరణ స్థలాన్ని బట్టి నిర్ణయించారు. తర్వాత ఇప్పటి వరకు టెండర్ల ఆహ్వానం లేకుండా అద్దెలను చెల్లిస్తూనే కాలం వెళ్లదీస్తున్నారు. నాలుగేళ్ల క్రితం ఇదే స్థలంలో ఓ మూలన  విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ను నిర్మించారు. ప్రస్తుతం ఈ గదుల నుంచి పోలీస్‌శాఖకు రూ.1.87 లక్షలు మాత్రమే నెలసరి ఆదాయం వస్తోంది.  


పేరుకే 22 దుకాణాలు.. ఉన్నవి ఇంకెన్నో..
పోలీసుశాఖ పాతబస్టాండ్‌లోని తమ కాంప్లెక్స్‌కు కేవలం 22 దుకాణాలను కేటాయించి, తద్వారా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నామమాత్రపు అద్దెకు ఇచ్చారు. కానీ ఇక్కడ అంతా సవ్యంగా జరుగుతోందనుకుంటే పొరపాటే.. పోలీసు శాఖ నిర్ణయించిన అద్దెను చెల్లిస్తూనే మరికొంతమందికి అనధికారికంగా తమ దుకాణాల ముందు ప్రజలకు ఇబ్బందికరంగా మరికొంత స్థలాన్ని ఆక్రమించారు. మరికొంతమంది ఇది పోలీసు కాంప్లెక్స్‌ అనే ధీమాతో ఇష్టానుసారంగా తాము ఉంటున్న దుకాణానికి ముందు స్థలాన్ని అక్రమిస్తున్నట్లు, ఈ వ్యవహారాన్ని కూడా కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. 


పోలీస్‌ కాంప్లెక్స్‌ దుకాణాల అద్దెల గడువు ఈనెలాఖరుకు ముగియనుంది. ఈ క్రమంలో పోలీసు కాంప్లెక్స్‌ అద్దె నిర్ణయ కమిటీ దుకాణాల కొలతలు చేపట్టారని, అయితే ఇదే దుకాణాల్లో పూల వ్యాపారం చేస్తున్న ఓ ప్రముఖుడు తాను అధికార పార్టీ నేతలతో మాట్లాడి టెండర్లు లేకుండానే చూస్తాననీ ధీమాగా ఇతరులకు చెబుతున్నట్లు బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.పోలీసు అధికారులచేత కేవలం అద్దె పెంచేలా చూస్తామనీ ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.వేలల్లో వసూలు కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి.  మరోవైపు దుకాణాల్లో అద్దెలకుంటున్న కొందరు అద్దెను చెల్లిస్తూనే, విద్యుత్‌ మీటర్లను తమ పేర్లతో తీసుకుని బిల్లులను కడుతున్నట్లు కూడా సమాచారం.

2003 నుంచి ప్రతి మూడేళ్లకోసారి టెండర్ల ద్వారా ఆశావహులను పిలిపించి అద్దెలను నిర్ణయిస్తే.. ఇప్పటికి నెలసరి అద్దె రూ.10–12 లక్షలు అవవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇలాంటి ఆదాయ వనరుకు చక్కటి ఉదాహరణగా కడప నగరంలోని ఉమేష్‌చంద్ర కల్యాణ మండపానికి సంబంధించి అద్దెను పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు వివాహాది ఫంక్షన్ల కోసం నామమాత్రంగా కేటాయించారు. అయితే ఇదే కల్యాణ మండపానికి ఇతరులు శుభకార్యాల సమయంలో డెకరేషన్‌కు సంబంధించి కాంట్రాక్ట్‌ను గతంలో రూ.2 లక్షలు ఏడాదికి కేటాయించారు. ఇదే కాంట్రాక్ట్‌ను ఈ ఏడాది 2018 జనవరి నుంచి డిసెంబర్‌ 31 వరకు ఏడాదికి డెకరేషన్‌ కాంట్రాక్ట్‌ను రూ.30 లక్షలుగా నిర్ణయించారు.

మరిన్ని వార్తలు