పోలీసులే ఆత్మబంధువులై.. 

1 Jul, 2020 09:42 IST|Sakshi
మృతదేహాన్ని అంత్యక్రియల వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు

కరోనాతో కుమారుడు, గుండెపోటుతో తండ్రి మృతి

కరోనా భయంతో బంధువులెవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించిన పోలీసులు 

సాక్షి, నగరి(చిత్తూరు) : కుమారుడికి కరోనా వైరస్‌ సోకిందనే మనోవ్యధతో గుండెపోటుకు గురై 68 ఏళ్ల వృద్ధుడు మరణించగా ఆ తర్వాత కొంతసేపటికే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతని కుమారుడు సైతం ప్రాణాలొదిలిన ఘటన నగరి ఏకాంబరకుప్పంలో మంగళవారం చోటుచేసుకుంది. చుట్టుపక్కలే బంధువులున్నా కరోనా భయంతో కనీ సం చూసేందుకు కూడా ఎవరూ రాలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులే ముందుకొచ్చి వృద్ధుడి మృతదేహానికి అంత్యక్రియలు జరిపించారు. వివరాలివీ.. కో–ఆప్టెక్స్‌ సంస్థలో పనిచేసి రిటైరైన 68ఏళ్ల వృద్ధుడు ఏకాంబర కుప్పంలో చిన్నపాటి జిరాక్స్‌ షాపు నడుపుకుంటూ షాపు పైభాగాన గల గదిలో ఒంటరిగా ఉంటున్నారు. అతని భార్య గతంలోనే మరణించగా కుమారుడు, కోడలు పక్క వీధిలో నివాసముంటున్నారు. ప్రైవేటు వాహనాల్లో డ్రైవర్‌గా పనిచేసే కుమారుడికి వారం రోజుల క్రితం కరోనా సోకడంతో తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసి తండ్రి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

శ్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు చేస్తున్న పోలీసులు  

మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో ప్రాణాలొదిలాడు. ఆ తరువాత కొంతసేపటికి కుమారుడు కూడా ఆస్పత్రిలో మరణించాడు. కరోనా భయంతో వృద్ధుడి మృతదేహాన్ని చూసేందుకు కూడా బంధువులెవరూ రాకపోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్క డికి చేరుకున్నారు. మృతదేహానికి అంత్యక్రియలు జరిపించాలని వృద్ధుడి బంధువులకు పోలీసులు సూచించగా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులే ఆత్మబంధువులయ్యారు. సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలో మృతదేహాన్ని కిందకు దించి శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు చేశారు. కరోనాతో మరణించిన కుమారుడి మృతదేహం రుయా ఆస్ప త్రిలోనే ఉంచారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి మృతదేహాన్ని ఖననం చేయాల్సి ఉంది. ఈ ఘటనపై సీఐ మద్ద య్య ఆచారి మాట్లాడుతూ కరోనా ఆస్పత్రిలో మృతిచెందిన యువకునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారని చెప్పారు. వారికి కరోనా పరీక్షలు చేయించి, తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 

>
మరిన్ని వార్తలు