పోలీసుల అదుపులో జేసీబీ డ్రైవర్

14 Oct, 2013 04:18 IST|Sakshi
 డిచ్‌పల్లి, న్యూస్‌లైన్: అటవీ సెక్షన్ అధికారులపై దాడికి యత్నించిన జేసీబీ డ్రైవర్ తౌఫిక్‌ను ఆదివారం డిచ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రం ఇందల్వాయి అటవీ రేంజ్ పరిధిలోని అటవీ భూమిలో అనుమతి లేకుండా మొరం తవ్వకాలు జరుపుతున్నారనే సమాచారంతో సెక్షన్ అధికారి గోవర్ధన్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీ అధికారులను గమనించిన జేసీబీ డ్రైవర్ పారిపోయేందుకు యత్నించాడు. పట్టుకునేందుకు వెంబడించిన అటవీ అధికారుల జీపును జేసీబీతో ఢీకొట్టగా తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. 
 
 అటవీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన డిచ్‌పల్లి పోలీసులు జేసీబీని, ధ్వంసమైన జీపును పోలీస్‌స్టేషన్‌ను తరలించారు. పరారీలో ఉన్న డ్రైవర్ తౌఫిక్‌ను పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం. గతనెలలో ఇందల్వాయి రేంజ్ అధికారి గంగయ్య హత్యోదంతం మరువక ముందే మరోసారి అటవీ అధికారులపై దాడి యత్నం జరుగడం అటవీ సిబ్బందిలో అందోళన రేకేత్తిస్తోంది. దాడులకు పాల్పడే వారిపై కఠినచర్యలు తీసుకోవాలని అటవీ సిబ్బంది కోరుతున్నారు. ఎఫ్‌ఆర్వో హత్య సమయంలో ధ్వంసమైన జీపుకు మరమ్మతులు చేయించిన తర్వాత శనివారం మధ్యాహ్నం కార్యాలయానికి తీసుకువచ్చినట్లు సిబ్బంది తెలిపారు. అదే రోజు సాయంత్రం తిరిగి జీపు జేసీబీ దాడిలో మరోసారి ధ్వంసమైంది.
 
మరిన్ని వార్తలు