మావోల కోసం వేట

1 Feb, 2019 08:13 IST|Sakshi
ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు బలగాలు

సరిహద్దుల్లో జాయింట్‌ ఆపరేషన్‌

అడవిని జల్లెడ పడుతున్న ప్రత్యేక బలగాలు

సరిహద్దుల్లో హై అలర్ట్‌

తూర్పుగోదావరి , చింతూరు (రంపచోడవరం): సరిహద్దుల్లో తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టుల కోసం వేట మొదలైంది. నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రభావం పెంచుకుంటున్న మావోయిస్టుల జాడ కోసం ప్రత్యేక బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. రెండు రోజుల క్రితం విలీన మండలాల్లో మావోయిస్టులు ఆర్టీసీ బస్సు, లారీని దహనం చేసిన నేపథ్యంలో మన్యంలో ఒక్కసారిగా అలజడి రేగింది. దీంతో జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటించి బలగాలను అప్రమత్తం చేశారు. మావోయిస్టులను కట్టడి చేసేందుకు సరిహద్దుల్లో కూంబింగ్‌ ముమ్మరం చేస్తున్నామని ఆయన ప్రకటించారు. ఘటనలకు పాల్పడింది ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మావోయిస్టు దళ సభ్యులైనా ఆ ప్రభావం విలీన మండలాలపై పడడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దుల్లో ఓవైపు మావోయిస్టుల కార్యకలాపాలు, మరోవైపు ప్రత్యేక బలగాల కూంబింగ్‌తో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్‌ వాతావరణం నెలకొంది.

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్నికల నేపథ్యంలో కొంతకాలం స్తబ్దుగా ఉన్న మావోయిస్టులు తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌ సమాధాన్, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంతో పాటు గురువారం మావోయిస్టులు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చారు. దీనిని పురస్కరించుకుని మావోయిస్టులు అటు ఛత్తీస్‌గఢ్‌లో పలు హింసాత్మక సంఘటనలకు పాల్పడడంతో పాటు ఇటీవల చింతూరు మండలం పేగలో ఓ వ్యానును, సరివెల వద్ద జాతీయ రహదారిపై తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు, లారీని దగ్ధం చేశారు.

కుంట ఏరియా కమిటీ పనేనా?
ఈ రెండు ఘటనలు మావోయిస్టు పార్టీ కుంట ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినట్టు పోలీసులు భావిస్తున్నారు. గతంలో విలీన మండలాల్లో మావోయిస్టు పార్టీ శబరి ఏరియా కమిటీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ఆ కమిటీ కార్యదర్శి కల్మా చుక్కా అలియాస్‌ నగేష్‌ ఎన్‌కౌంటర్‌ అనంతరం రూపు మార్చుకుని చర్ల, శబరి ఏరియా కమిటీగా అవతరించింది. ఈ కమిటీకి కొంతకాలం రజిత, సునీల్‌లు కార్యదర్శులుగా వ్యవహరించారు. అనంతరం సునీల్‌ పోలీసులకు లొంగిపోడంతో ఈ కమిటీ బాధ్యతలను భద్రాద్రి కొత్తగూడెం, ఈస్ట్‌ గోదావరి జిల్లాల కమిటీ ఆధ్వర్యంలోనే పర్యవేక్షిస్తూ ఈ కమిటీకి శారదక్కను కార్యదర్శిగా నియమించినట్టు తెలిసింది. కాగా శబరి లోకల్‌ ఆర్గనైజేషన్‌ స్క్వాడ్‌(ఎల్‌వోఎస్‌)కు సోమ్‌డాను కమాండర్‌గా నియమించినట్టు సమాచారం. చర్ల, శబరి ఏరియా కమిటీ ప్రధానంగా తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోనే కార్యకలాపాలు నిర్వహిస్తుండగా ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల కార్యకలాపాలను శబరి ఎల్‌వోఎస్, కుంట ఏరియా కమిటీకి అప్పగించినట్లుగా సమాచారం.

సరిహద్దుల్లో జాయింట్‌ ఆపరేషన్‌
బస్సు, లారీ దగ్థం ఘటన అనంతరం ప్రత్యేక బలగాలతో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో జాయింట్‌ ఆపరేషన్‌ ద్వారా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఆంధ్రాకు చెందిన గ్రేహౌండ్స్, స్పెషల్‌పార్టీ, సీఆర్పీఎఫ్‌ బలగాలు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కోబ్రా, ఎస్టీఎఫ్, డీఎఫ్, సీఏఎఫ్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఘటనలకు పాల్పడుతున్న మావోయిస్టులు సరిహద్దు గ్రామాల్లో తలదాచుకునే అవకాశమున్న నేపధ్యంలో సరిహద్దుల్లోని మల్లంపేట, నర్శింగపేట, నారకొండ, అల్లిగూడెం, దొంగల జగ్గారం, దుర్మా, మైతా, సింగారం, బండ ప్రాంతాలను బలగాలు జల్లెడ పడుతున్నాయి. అటు పోలీసుల జాయింట్‌ ఆపరేషన్, ఇటు మావోయిస్టుల ఆధిపత్య పోరు నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని సరిహద్దు పల్లెల ఆదివాసీల్లో ఆందోళన నెలకొంది. మావోయిస్టుల బంద్‌ కారణంగా రెండోరోజు కూడా విలీన మండలాలకు బస్సులు బంద్‌ అయ్యాయి. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

మరిన్ని వార్తలు