సరిహద్దుల్లో కూంబింగ్‌ ముమ్మరం

31 Jan, 2019 08:20 IST|Sakshi

చింతూరు మండలం సరివెల వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మావోయిస్టులు బస్సు, లారీ దహనం చేసిన నేపథ్యంలో ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని ఆ పాంతాన్ని బుధవారం పరిశీలించారు. ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కుంట ఏరియా కమిటీకి చెందిన 20 నుంచి 25 మంది దళ సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం ఉందని ఎస్పీ తెలిపారు

తూర్పుగోదావరి , చింతూరు(రంపచోడవరం): ఆంధ్రా, తెలంగాణా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ను ముమ్మరం చేసినట్టు జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని తెలిపారు. చింతూరు మండలం సరివెల వద్ద జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి మావోయిస్టులు బస్సు, లారీ దహనం చేసిన ప్రాంతాన్ని ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం చింతూరులో విలేకర్లతో మాట్లాడుతూ ఈ ఘటనలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం కుంట ఏరియా కమిటీకి చెందిన 20 నుంచి 25 మంది దళ సభ్యులు పాల్గొన్నట్టు సమాచారం ఉందన్నారు. వారోత్సవాలు, బంద్‌ నేపథ్యంలో ఉనికిని చాటుకునేందుకే మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడ్డారని, ఘటనకు పాల్పడిన మావోయిస్టుల ఆచూకీ కోసం చింతూరు, ఏడుగురాళ్లపల్లి, ఎటపాక పోలీస్‌ స్టేషన్ల పరిధిలో బలగాలను అప్రమత్తం చేశామని తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల వెంబడి 45 కిలోమీటర్ల మేర సీఆర్పీఎఫ్, ప్రత్యేక బలగాలు నిత్యం పహారా కాస్తున్నాయని పేర్కొన్నారు.

ఇప్పటికే సరిహద్దుల్లోని సుక్మా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలతో మాట్లాడామని త్వరలోనే వారితో కలసి జాయింట్‌ ఆపరేషన్‌ చేపడతామని తెలిపారు. ఇటీవల జిల్లాలో మావోయిస్టుల అరెస్టులు, లొంగుబాట్లు అధికం చేశామని, మిలీషియా నెట్‌వర్క్‌పై దృష్టి సారించామని, సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీలో కొత్త రిక్రూట్‌మెంట్లు జరగడం లేదని ఎస్పీ తెలిపారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టులు ఎలాంటి ఘటనలకు పాల్పడకుండా భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపే అవకాశమున్నందున జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉండదని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చింతూరు ఓఎస్డీ అమిత్‌బర్దర్, డీఎస్పీ దిలీప్‌కిరణ్, సీఐలు దుర్గాప్రసాద్, అనీష్‌బాబు పాల్గొన్నారు.

మావోయిస్టుల ఘటనతో బస్సుల బంద్‌
చింతూరు (రంపచోడవరం): జాతీయ రహదారిపై మావోయిస్టులు బస్సు, లారీ దగ్ధం చేసిన నేపథ్యంలో మంగళవారం రాత్రి నుంచి విలీన మండలాలకు బస్సులు బంద్‌ అయ్యాయి. దీంతో బుధవారం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆంధ్రాతో పాటు తెలంగాణకు చెందిన  బస్సులను కూడా రద్దు చేయడంతో ఆంధ్రా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు చెందిన ప్రయాణికులు నిరాశకు గురయ్యారు. ఆంధ్రాలోని రాజమండ్రి, కాకినాడ, రావులపాలెం, గోకవరం, విశాఖపట్నం, విజయవాడ డిపోలకు చెందిన బస్సులు రద్దయ్యాయి. తెలంగాణలోని భద్రాచలం, హైదరాబాద్, కరీంనగర్, తాండూరు, పరిగి డిపోలకు చెందిన బస్సులు కూడా రద్దయ్యాయి. కాగా మావోయిస్టులు గురువారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం కూడా బస్సులు తిరుగుతాయో లేదోనని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు బస్సులు బంద్‌ కావడంతో ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని ఆటోడ్రైవర్లు మూడు రెట్లు అధికంగా ఛార్జీలు వసూలు చేసినట్టు ప్రయాణికులు వాపోయారు. కుంట, చట్టి, చింతూరు నుంచి భద్రాచలానికి బస్సుకు రూ.60 చార్జీ కాగా సమయాన్ని బట్టి ఆటోడ్రైవర్లు రూ.వంద నుంచి 200 వరకు ఛార్జీలు వసూలు చేశారని ప్రయాణికులు ఆరోపించారు.

మరిన్ని వార్తలు