మన్యంలో భయం భయం

25 Sep, 2018 07:15 IST|Sakshi
సీలేరులో తనిఖీలు చేపడుతున్న పోలీసులు

ఏవోబీలో ముమ్మర కూంబింగ్‌

భయం గుప్పెట్లో ఏజెన్సీ  గ్రామాలు

వణికిపోతున్న గిరిజనులు 

సాక్షి, విశాఖపట్నం :అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు మట్టుబెట్టడంతో విశాఖ ఏజెన్సీలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. కొంతకాలంగా గ్రామ, మండల స్థాయి నాయకులనే పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో హతమార్చడం, వాహనాలకు నిప్పుపెట్టడం వంటి ఘటనలకు పాల్పడిన మావోలు ఏకంగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలనే హతమార్చడం పోలీసులకు సవాల్‌గా మారింది. తమ నేతలను రక్షించడంలో విఫలమయ్యారంటూ అరుకు, డుంబ్రిగుడ పోలీస్‌ స్టేషన్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆదివారం నాటి ఉద్రిక్త çపరిస్థితులు సోమవారం నాటికి కాస్త అదుపులోకి వచ్చాయి. అయితే ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజనుల్లో నెలకొంది.

ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హతమార్చిన ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రత్యక్ష సాక్షులు గుర్తించిన ముగ్గురు మావోల వివరాలను మీడియాకు విడుదల చేశారు. అయితే వీరు ఏ దళంలో పనిచేస్తున్నది.. ఇప్పటి వరకు ఏఏ ఘటనల్లో పాల్గొన్నది మాత్రం చెప్పలేదు. మిగిలిన వారిని కూడా త్వరలోనే గుర్తిస్తామని ప్రకటించారు. నిన్నటి ఘటన నేపథ్యంలో ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. విశాఖ మన్యంతోపాటు ఏవోబీలో గ్రేహౌండ్స్‌ దళాలు, స్పెషల్‌ పార్టీ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు కూంబింగ్‌ ఆపరేషన్‌ను ముమ్మరం చేశారు.

ఘటన జరిగిన డుంబ్రిగూడ మండలంతోపాటు మావోల ప్రాబల్యం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. కటాఫ్‌ ఏరియాతోపాటు ఏవోబీ ప్రాంతాల్లో అణువణువు గాలిస్తున్నారు. అదనపు బలగాల కూంబింగ్‌ ఆపరేషన్‌తో ఏజెన్సీ గ్రామాలన్నీ భయం గుప్పెట్లో వణికిపోతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోననే ఆందోళన గిరిజన గ్రామాల్లో కన్పిస్తోంది. గిరిజనులైతే ఇళ్లు వదిలి బయటకొచ్చేందుకు భయపడుతున్నారు. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కర్నీ ప్రశ్నిస్తున్నారు. నిన్నటి ఘటనలో పాల్గొన్న మావోయిస్టులను చూసారా? వారి కదలికలను గమనిం చారా? గుర్తుపట్టగలరా అంటూ ఆరా తీస్తున్నారు. ప్రత్యేక బలగాల బూట్ల చప్పుళ్లతో విశాఖ ఏజెన్సీ దద్దరిల్లిపోతుంది. మొత్తమ్మీద విశాఖ మన్యంలో ఏ క్షణాన్న ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది.

అర్ధరాత్రి బస్సు సర్వీసులు నిలిపివేత 
సీలేరు (పాడేరు): ఏవోబీలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఏజెన్సీ ముఖద్వారం నర్సీపట్నం నుంచి ఆంధ్రా–ఒడిశా సరిహద్దు ప్రాంతాల వరకు అడుగడుగునా పోలీసు బలగాలు మోహరించాయి. విశాఖ నుంచి ఏజెన్సీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే రాత్రి పూట బస్సు సర్వీసులను నిలిపివేశారు. విశాఖ–భద్రాచలం, విశాఖ–హైదరాబాదు, భద్రాచలం మీదుగా రాత్రి పూట వెళ్లే బస్సులు తిరగలేదు. ఆంధ్రా, ఒడిశా, తూర్పుగోదావరి, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ముమ్మర గాలింపు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు