మట్కా నిర్మూలించండి

2 Oct, 2018 13:50 IST|Sakshi
ఎస్పీకి సమస్యను విన్నవించుకుంటున్న చింతలపల్లి పక్కీరయ్య

పోలీస్‌ ప్రజాదర్బార్‌లో ఫిర్యాదు చేసిన బుధవారపేట వాసులు

కర్నూలు: ‘నగరంలో ఇద్దరు మట్కా డాన్‌లు మనుషులను ఏర్పాటు చేసుకుని ఆన్‌లైన్‌ ద్వారా పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తున్నారు. కూలీనాలీతో జీవనం సాగించే పేదలు, మధ్య తరగతి ఉద్యోగులు ఈ ఉచ్చులో ఇరుక్కుని ఆర్థికంగా నష్టపోతున్నారు’ అంటూ బుధవారపేటకు చెందిన పలువురు ఎస్పీ గోపీనాథ్‌ జట్టికి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో గోపీనాథ్‌ జట్టి ప్రజాదర్బార్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా 9121101200 సెల్‌ నంబర్‌కు వచ్చిన ఫిర్యాదులను నోట్‌ చేసుకున్నారు. నేరుగా ప్రజాదర్బార్‌కు వచ్చి కలసిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. బుధవారపేటతో పాటు పాతబస్తీలో కొంతమంది మట్కా నిర్వహిస్తున్నారని, పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని బుధవారపేట వాసులు ఫిర్యాదు చేశారు. 

జిల్లా నలుమూలల నుంచి 92 ఫిర్యాదులువచ్చాయి. వాటిలో కొన్ని..
ఆడ పిల్లలు పుడుతున్నారని వేధించడం, ముందే స్కానింగ్‌ చేయించి మగబిడ్డ, ఆడబిడ్డ అని తెలుసుకుని డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లి అబార్షన్‌ చేయించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారని, సంబంధిత డాక్టర్లు స్కానింగ్‌ సెంటర్లపై కఠినమైన కేసులు నమోదు చేయాలని కొంతమంది వ్యక్తులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.  
తన తలారీ ఉద్యోగాన్ని పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు తీసుకుని బతికినంత కాలం సగం జీతం ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తూ, అన్నం పెట్టడం లేదని మిడుతూరు మండలం చింతలపల్లె గ్రామానికి చెందిన పక్కీరయ్య ఫిర్యాదు చేశారు.   
తన 20 ఎకరాల పొలాన్ని కుమారుడు లాక్కున్నాడని, అందులో ఆరెకరాలు ఇప్పటికే అమ్మేశాడని, కనీసంతమ బాగోగులు కూడా చూడకుండా కొట్టి, గాయపరిచి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామానికి చెందిన భద్రాద్రి చెన్నయ్య  ఫిర్యాదు చేశారు.  
తాను ప్రస్తుతం మట్కా రాయడం లేదని, ఐదేళ్లుగా కిరాణం షాపుతో జీవనం సాగిస్తున్నానని, తనపై ఉన్న మట్కా షీటు తొలగించాలని హాలహర్వి మండలం చింతకుంట గ్రామానికి చెందిన ముళ్ల జాఫర్‌ కోరారు.  
కొట్టం విక్రయిస్తానని చెప్పి రూ.60 వేలు అడ్వాన్స్‌గా తీసుకుని కర్నూలుకు చెందిన ఒక వ్యక్తి మోసం చేశాడని సంతోష్‌నగర్‌కు చెందిన మేకల సుజాత ఫిర్యాదు చేశారు.
రైల్వే ఉద్యోగం చేస్తున్న కుమారుడు తన పేరుతో ఉన్న ఆరెకరాల పొలాన్ని రాసి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నాడని శిరివెల్ల మండలం మహదేవపురం గ్రామానికి చెందిన లక్ష్మీదేవి ఫిర్యాదు చేశారు. పోలీస్‌ దర్బార్, డయల్‌ యువర్‌ ఎస్పీ కార్యక్రమాలకు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. అడిషనల్‌ ఎస్పీ మాధవరెడ్డి, లీగల్‌ అడ్వైజర్‌ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకటాద్రి, బాబుప్రసాద్, నజీముద్దిన్, వినోద్‌కుమార్, మురళీధర్, సీఐలు ములకన్న, మహేశ్వర్‌రెడ్డి, వన్‌స్టాప్‌ సెంటర్‌ సిబ్బంది సునిత పాల్గొన్నారు. 
కర్నూలు నగరం వెంకటరమణ కాలనీకి చెందిన మూర్తి.. గురుకుల పాఠశాలలో కాంట్రాక్టు టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.1.60 లక్షలు తీసుకుని మోసం చేశాడని బంగారుపేటకు చెందిన కరుణాకర్‌ ఫిర్యాదు చేశారు. 

మరిన్ని వార్తలు