పోలీసు శాఖలో ఎన్నికల సందడి

26 Dec, 2018 13:51 IST|Sakshi
జిల్లా పోలీస్‌ కార్యాలయం

జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం

అర్బన్, రూరల్‌ పోలీస్‌ జిల్లాల పరిధిలో పోటీలో ఏడుగురు అభ్యర్థులు

సమస్యలు పరిష్కరించేవారికే ప్రాధాన్యత అంటున్న పోలీసులు  

గుంటూరు: రాజధాని జిల్లా గుంటూరు పోలీసుల శాఖలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్‌ వెలువడనుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. అర్బన్, రూరల్‌ జిల్లాల పరిధిలో ఎన్నికల్లో పోటీ పడేందుకు కొందరు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం పదవుల్లో కొనసాగుతూ రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతూ వచ్చే ఎన్నికల్లో అనుకూలమైన అభ్యర్థికి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో ఉన్నారు. అయితే  ప్రస్తుతం ఉన్న ఓ సంఘం నాయకుడి పట్ల కొందరు అసంతృప్తితో ఉన్నారు. ఈ ఎన్నిక్లలో కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలని ఆలోచన చేస్తున్నారు.

బరిలో ఏడుగురు..
రెండు జిల్లాల పరిధిలో మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో పాల్గొననున్నట్లు పోలీసులు చర్చించుకుంటున్నారు. తమకు సమస్యలు ఎదురైనప్పుడు వాటిని పరిష్కరించి అండగా నిలిచే అభ్యర్థులకే తమ మద్దతు తెలుపుతామంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీస్‌ మార్క్‌లో అభ్యర్థుల ఎంపిక సదరు అభ్యర్థులకు మద్దతు తెలపాలంటూ చాపకింద నీరులా ప్రచారం చేస్తున్నారు.

నూతన సంవత్సరంలో..
వచ్చే నెలలో నోటిఫికేషన్‌ వెలువడిన అనంతరం వారం రోజుల వ్యవధిలో ఎన్నిక ప్రక్రియను ముగిస్తారు. ప్రస్తుతం అర్బన్‌ జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడిగా పోటీ పడేందుకు శైలేంద్ర కుమార్, మస్తాన్‌వలి, జానయ్యలు సిద్ధంగాగా ఉండగా, రూరల్‌ జిల్లా పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న చందు పూర్ణచంద్రరావు, బాల కోటేశ్వరరావు, చెన్నయ్య, హరి బరిలో పోటీపడతారని ప్రచారం జరుగుతుంది. వీరిలో ఉన్నతాధికారులకు, సిబ్బందికి మధ్య వారధిగా ఎవరుంటారనే అంశంపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ఆయా సంఘాల నాయకులు చిన్నచిన్న పొరపాట్లు చేశారని, అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా బాధ్యతగా పనిచేసేవారినే ఎన్నుకుంటామని పోలీసులు అంటున్నారు.

సంఘం ఎన్నిక జరిగేదిలా..
పోలీస్‌ అధికారుల సంఘం ఎన్నికలో సీఐ నుంచి కానిస్టేబుల్‌ వరకు పాల్గొంటారు. జిల్లా పరిధిలోని సీఐలు అందరూ కలసి ఓ మెంబర్‌ను, సబ్‌ డివిజన్‌ పరిధిలో ఉండే ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు 50 మంది ఉంటే ఓ మెంబరును, అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఇద్దరిని ఎన్నుకోవచ్చు. మహిళా హెడ్‌ కానిస్టేబుళ్లు ప్రతి 40 మంది ఒక్క మెంబరు, ఒక్కో స్టేషన్‌ పరిధిలో ఉండేహెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు(పురుషులు) ప్రతి 40 మంది ఒక్క మెంబరు చొప్పున ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఆర్మడ్‌ రిజర్వ్‌ విభాగం అధికారులు, సిబ్బంది కూడా పాల్గొంటారు. ఎన్నికైన మెంబర్లు సంఘం అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారులు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్లను కలుపుకొని మొత్తం 13 మంది సభ్యులను ఎన్ను కుంటారు. అనంతరం అధ్యక్షుడు, కార్యదర్శి కలిసి ఇద్దరు కో–ఆప్షన్‌ మెంబర్లును ఎన్నుకోవడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. వీరంతా అనంతరం రాష్ట్ర స్థాయిలో జరిగే పోలీస్‌ అధికారుల సంఘం ఎన్నికలో నేరుగా పోటీ చేయడం, ఓటు వేసేందుకు అర్హులు.

కలుపుకుపోయేతత్వం ఉండాలి..
ఎన్నికలో ఎంతమందైనా పోటీపడవచ్చు. అందరిని కలుపుకు పోతూ సమస్యలు పరిష్కరించగలిగే నాయకత్వం ఉండాలి. అలాంటప్పుడే ఉన్నతాధికారులు, తొటి సిబ్బంది గౌరవం దక్కుతుంది. సివిల్, ఏఆర్‌ రెండు కళ్లు లాంటివి. ఎవరినీ నొప్పించకుండా సమయస్ఫూర్తిగా నెగ్గుకురావాలి.–దళవాయి సుబ్రహ్మణ్యం,రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా