వాటికే అనుమతులు

21 Apr, 2020 13:32 IST|Sakshi

జిల్లాలో ఇప్పటికే రెండువేల మందికి పరీక్షలు

ప్రతి గ్రామంలో పోలీసు నిఘా

రెడ్‌జోన్‌లో 28 మండలాలు

లాక్‌డౌన్‌ నిబంధనలు కఠినంగా అమలు

వైద్య, ఇతర అత్యవసర సేవలకే అనుమతి

నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా

కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్టచర్యలు చేపడుతోంది. ఈ మహమ్మారి విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రతువులో జిల్లా పోలీస్‌ శాఖ కీలకంగా వ్యవహరిస్తోంది. విదేశాల నుంచి వచ్చిన వారు, సెజ్‌లు మొదలుకొని ఢిల్లీ సభలకు వెళ్లిన వారి వరకు అందరినీ గుర్తించడంలో క్రియాశీలకంగా పనిచేసింది. ఇప్పటివరకు కోవిడ్‌ 19 లక్షణాలున్న 2,100 మందిని గుర్తించి క్వారంటైన్‌కు తరలించారు. ఇతర జిల్లాలతోపాటు సరిహద్దులో తమిళనాడు రాష్ట్రం ఉండడం, సముద్రతీరం అధికంగా ఉన్న క్రమంలో పోలీసు శాఖా పరంగా ముందస్తు చర్యలు చేపట్టింది. ఇక కీలక దశలో సెకండ్‌ కాంటాక్ట్‌పై జిల్లా పోలీసు యంత్రాంగం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది.  

సాక్షి ప్రతినిధి, నెల్లూరు:  కోవిడ్‌–19పై పోరులో జిల్లా పోలీస్‌ యంత్రాంగం బిజీగా ఉంది. అన్ని ప్రాంతాల్లో పెద్దసంఖ్యలో పికెటింగ్‌లు ఏర్పాటుచేసి జిల్లా సరిహద్దులను పూర్తిగా మూసివేసి లాక్‌డౌన్‌ను పర్యవేక్షిస్తున్నారు. కరోనా వైరస్‌ జిల్లాలో సెకండ్‌ కాంటాక్ట్‌ ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని గుర్తించింది. దానిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటివరకు నమోదైన 67 కేసుల్లో సుమారు 40 కేసుల వరకు సెకండ్‌ కాంటాక్ట్‌కు సంబంధించినవే ఉన్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారి ప్రయాణ వివరాల ఆధారంగా అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతోపాటు వారితో ఎక్కువగా కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 4,664 శాంపిల్స్‌ సేకరించగా, వారిలో 3,715 మంది ఫలితాలు వచ్చాయి. మొత్తంగా 67 మందికి పాజిటివ్‌ వచ్చింది. కాగా 2,100 శాంపిల్స్‌ సెకండ్‌ కాంటాక్ట్‌ అయిన వారే ఉన్నాయి. ఎస్పీ భాస్కర్‌ భూషణ్‌ నేతృత్వంలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, నలుగురు ఎస్సైలతోపాటు పోలీసులతో కలిపి నాలుగు బృందాలు ఏర్పాటు అయ్యాయి. ఇవి జిల్లాలో నాలుగు డివిజన్లలో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించాయి. దీనిని మరికొన్ని రోజులపాటు కొనసాగించనున్నారు. తద్వారా వైద్యారోగ్య శాఖ, క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రభుత్వ విభాగాలకు కేసులను గుర్తించడం కొంత సులువైంది.

ఇవీ రెడ్‌జోన్లు
జిల్లాలో 28 మండలాలను రెడ్‌జోన్లుగా గుర్తించారు. నెల్లూరు నగరం, పరిసర ప్రాంతాలు, వాకాడు, నాయుడుపేట, తడలతోపాటు కేసులు అధికంగా నమోదైన మండలాలను, వాటికి మూడు కిలోమీటర్లు పరిధిలో ఉన్న ప్రాంతాలను గుర్తించి రెడ్‌జోన్లుగా ప్రకటించారు. అక్కడ పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. మిగిలిన మండలాల్లో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కార్యకలాపాలు కొనసాగనున్నాయి. అలాగే రెడ్‌జోన్లలో పూర్తిస్థాయిలో నిత్యావసరాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే జిల్లాలో ఉన్న ఐదు ట్రూనాట్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌ల ద్వారా రోజుకి 250 వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు.

వాటికే అనుమతులు
ఇక జిల్లాలో పోలీస్‌ వాట్సాప్‌ నంబర్, ఈ మెయిల్‌ ద్వారా అత్యవసరాలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారు. ఇప్పటివరకు వేలసంఖ్యలో ఈ మెయిల్స్‌ వచ్చిన క్రమంలో వైద్యసేవలు, డెత్, ఇతర కారణాలతో అంతర్‌ జిల్లా వరకు జిల్లా ఎస్పీ అనుమతి ఇస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి అనుమతుల కోసం డీజీపీ కార్యాలయానికి పంపుతున్నారు. ఇంకా మెడికల్‌ సేవలు, ఇతర అత్యవసరాల వాహనాలకు మాత్రమే అనుమతులు లభిస్తున్నాయి. మిగిలిన ఆహార ఉత్పత్తుల వాహనాలకు మార్గదర్శకాలకు అనుగుణంగా పర్మిషన్‌ ఇస్తున్నారు. జిల్లా నుంచి ఇప్పటివరకు ఏడువేల వరకు అనుమతుల కోసం దరఖాస్తులు రాగా వాటిలో 240 పాస్‌లు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడుపుతున్న వారికి రూ.2.26 కోట్ల జరిమానా విధించారు.

వెంకటగిరిలో అలర్ట్‌
వెంకటగిరి: శ్రీకాళహస్తి, ఏర్పేడు మండలాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో  వెంకటగిరిని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. వెంకటగిరి సమీప మండలం బాలాయపల్లిలోని ఊట్లపల్లి గ్రామంలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయింది. రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో వెంకటగిరి సీఐ అన్వర్‌బాషా, మున్సిపల్‌ ఇన్‌చార్జి కమిషనర్‌ మదర్సాఅలీ, తహసీల్దార్‌ చొప్పా రవీంద్రబాబులు అప్రమత్తమయ్యారు. రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి జనసంచారం లేకుండా చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి సరైన కారణం లేకుండా వెంకటగిరిలోకి రానీయడం లేదు. వెంకటగిరిలోకి వచ్చే ప్రధాన మార్గాలను బారికేడ్ల ద్వారా మూసి వేయించి కేవలం క్రాస్‌రోడ్డు వద్ద ఉన్న రోడ్డు ద్వారా మాత్రమే వెంకటగిరిలోకి అనుమతిస్తున్నారు.

పక్కాగా లాక్‌డౌన్‌ అమలు
జిల్లాలో 28 మండలాలు రెడ్‌జోన్‌లో ఉన్నాయి. వాటిలో పక్కాగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నాం. జిల్లా పోలీసు యంత్రాంగం సెకండ్‌ కాంటాక్ట్‌ కేసులపై ఎక్కువగా దృష్టి సారించింది. నిబంధనల్ని అతిక్రమించిన వారికి జరిమానా విధిస్తున్నాం.  –  భాస్కర్‌ భూషణ్, జిల్లా ఎస్పీ

మరిన్ని వార్తలు