తూటా పేలిందా..పేల్చుకున్నాడా?

28 Sep, 2014 03:36 IST|Sakshi
తూటా పేలిందా..పేల్చుకున్నాడా?

తన సర్వీసు రివాల్వర్ తూటాకు బలైన రేణింగవరం ఎస్సై విష్ణుగోపాల్‌ది ఆత్మహత్యా..లేక మిస్‌ఫైరా అన్నదానిపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి.   

అద్దంకి : తన సర్వీస్ రివాల్వార్ తూటాకు బలైన రేణింగవరం ఎస్సై విష్ణుగోపాల్‌ది ఆత్మహత్యా.. లేక మిస్ ఫైరా.. అన్న విషయంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఠాణాలో పేలిన తూటా కావడంతో కారణాలు బయటి వారికి తెలిసే అవకాశం లేదు. ఎస్సై మృతిపై జిల్లాలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తుపాకీ గురిపెట్టడంతో సుశిక్షితుడైన ఎస్సై.. ఆయన చేతిలో అది మిస్ ఫైరైందంటే ఎవరూ నమ్మడం లేదు. అదే విధంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడా.. అన్న అనుమానం కూడా పలువురిలో వ్యక్తమవుతోంది. తనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నది మరికొందరి వాదన. శాంతిభద్రతలు పరిరక్షించే స్థానంలో ఉన్న ఓ పోలీసు అధికారి ఇలా పిరికితనంగా తనకు తానే ఎందుకు కాల్చుకుంటాడు? ఒక వేళ మిస్ ఫైరైతే అది పిన్ పాయింట్‌లోనే ఎందుకు పేలిందనే ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. మిస్‌ఫైర్ కారణంగానే ఎస్సై మృతి చెందాడని ఉన్నతాధికారులు చెబుతున్న విషయం తెలిసిందే.

ఆందోళనలో పోలీసు వర్గాలు
రేణింగవరం ఎస్సై విష్ణుగోపాల్ మరణం పోలీసు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉత్సాహంగా, చలాకీగా పనిచేసే ఎస్సై.. అప్పటికప్పుడే తుపాకీ మిస్‌ఫైరై మరణించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పోలీసు విధులంటే ఆటుపోట్లు సహజమంటున్నారు. ఆరోపణలు, అవమానాలు, పొగ డ్తలు, అవార్డులు, రివార్డులు, ఉన్నతాధికారుల నుంచి చీవాట్లు, రాజకీయ వర్గాల నుంచి బెదిరింపులు షరా మామూలేనని పేర్కొంటున్నారు. పోలీస్ అధికారులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా అరుదని చెబుతున్నారు.

ఎస్సై గది సీజ్
ఎస్సై మృతి చెందిన గదిని ఉన్నతాధికారులు సీజ్ చేశారు. గది తలుపులు బిగించి తాళం వేశారు. మిస్‌ఫైర్ కారణంగానే ఎస్సై చనిపోయారని చెబుతున్నా గదిని క్షుణ్ణంగా పరిశీలిస్తే నిజానిజాలు బయటపడే అవకాశం లేకపోలేదు.

పేదరికంలో పుట్టి.. ఎస్సైగా ఎదిగి
పేదరికంలో పుట్టి పట్టుదలతో ఎస్సై పోస్ట్ సాధించిన విష్ణుగోపాల్.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా  బోగోలు బిట్రగుంట బృందావనానికి చెందిన కొల్లా రామారావు పెద్ద కుమారుడు. చిన్న వయసు నుంచే ఆటల్లో రాణించారు. ఎస్సై కావాలన్న కలను విష్ణుగోపాల్ సాకారం చేసుకున్నారు. స్వగ్రాంలో ఆయనకు మంచి పేరు ఉంది. తమ కుమారుడు మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించి మంచి పేరు తెచ్చుకుంటాడనుకున్న తల్లిదండ్రులకు తీరని విషాదం మిగిలింది.

మరిన్ని వార్తలు