అయినా.. తీరు మారలేదు !

13 Jul, 2019 09:57 IST|Sakshi
స్టేషన్‌ బయట కూర్చొని ఉన్న టైర్‌బండ్లు, ఇసుక ట్రాక్టర్ల యజమానులు 

సాక్షి, నెల్లూరు : ‘స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదపూర్వకంగా ఉండాలి. వారి బాధలు విని న్యాయం చేయాలి’ అని చెప్పిన ఉన్నతాధికారుల ఆదేశాలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. సిబ్బంది స్టేషన్‌కు వచ్చే వరితో అమర్యాదగా వ్యవహరిస్తున్నారు. దీంతో వారు అసహనం వ్యక్తం చేసి వెళ్లిపోతున్నారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పదేపదే ఫ్రెండ్లీ పోలీసింగ్‌ గురించి చెబుతున్నా క్షేత్రస్థాయిలో మరిస్థితి మరోలా ఉంది. అడపాదడపా చోటుచేసుకుంటున్న ఘటనలు దీనిని రుజువు చేస్తున్నారు. నెల్లూరు నగరంలో సంతపేట పోలీస్‌స్టేషన్‌లో పరిస్థితి అధ్వానంగా మారిందనే విమర్శలున్నాయి.

స్టేషన్‌కు వెళ్లాలంటేనే బాధితులు హడలిపోయే పరిస్థితి ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది స్టేషన్‌కు వెళ్లేవారితో అమర్యాదగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. సంబంధిత అధికారులను కలవాలంటే అనేక అవమానాలను దిగమింగాల్సిన పరిస్థితి నెలకొంది. స్టేషన్‌లోకి అడుగుపెడితే చాలు ‘ఎవరు రా? ఎందుకు వచ్చారు రా?’ అంటూ ప్రశ్నించడమే కాకుండా బయటకు పోండి రా? అధికారులు ఉన్నప్పుడు రండి? అంటూ ఫిర్యాదుదారులను, ఇతరులను బయటకు పంపివేస్తున్నారు. దీంతో వారు అధికారులు వచ్చేంతవరకూ స్టేషన్‌ బయట పడిగాపులు కాయాల్సివస్తోంది. రిసెప్షన్‌ వ్యవస్థలోని ఒకరు మరీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఆ సిబ్బంది ప్రవర్తనపై అదే స్టేషన్‌లో పనిచేస్తున్న పలువురు సిబ్బంది సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

తాజగా శుక్రవారం ఓ కుటుంబం తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. దీంతో రిసెప్షన్‌లో ఉన్న ఓ సిబ్బంది వెంటనే వారివద్దకు వచ్చి ‘ఇంతమంది  ఎందుకు వచ్చారు రా’ అంటూ వారిని నిలదీశారు. అంతేకాకుండా ‘అక్కడున్న పిల్లలను బయటకు వెళ్లిపోండిరా.. లేదంటే లోపలవేసి నాలుగు తగిలాస్తా’ అని పేర్కొన్నారు. దీంతో ఆ కుటుంబంలోని పిల్లలు అక్కడినుంచి దూరంగా వెళ్లిపోయారు. ఇన్‌స్పెక్టర్‌ పిలుస్తున్నారని ఇసుక ట్రాక్టర్లు, టైరుబండ్ల వ్యాపారులను పోలీస్‌స్టేషన్‌కు  పిలిపించారు. వారితో సైతం సదరు రిసెప్షన్‌ సిబ్బంది అమర్యాదగా వ్యవహరించి స్టేషన్‌ బయటకు పంపివేశారు. దీంతో వారు స్టేషన్‌ బయట పడిగాపులు కాశారు. ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు