‘ఖాకీ’ల హైడ్రామా.!

10 Nov, 2014 02:55 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఏయూ తెలుగు విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ జెర్రా అప్పారావు అరెస్టు వెనుక హైడ్రామా నడిచిందా? పోలీసులు చెబుతున్న దానికి, ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాలకు పొంతన కుదరడం లేదా? రిమాండ్ రిపోర్ట్‌లో ఆయన్ని ఏయూ క్వార్టర్స్‌లో అరెస్టు చేసినట్టు, అప్పారావు భార్య మైనావతికి ఇచ్చిన అరెస్ట్ రిపోర్ట్‌లో నర్సీపట్నం శివారులో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు పేర్కొనడం మరింత అనుమానానికి తావిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు అతిగా వ్యవహరించి విమర్శలు పాలైన సంగతి తెలిసిందే.

వీళ్లంతా ఎవరు..
ఏజెన్సీలో గనుల తవ్వకాలకు నీలాపు రాజబాబు అనే వ్యక్తి లెసైన్స్ తీసుకున్నారు. అతని వద్ద వాసుపరి ప్రసాద్ ఏజెంట్‌గా ఉన్నారు. తరువాత అతని వద్ద జగదీష్ చాపరాతిపాలెంలో మైనింగ్‌కు సబ్ లీజు తీసుకున్నాడు. జగదీష్ వద్ద సుబ్బరాజు ఏజెంట్. చాపరాతిపాలెం మైనింగ్‌లో నష్టం రావడంతో తనకు దేవుడు క్యారీ మైనింగ్ కూడా లీజుకు ఇవ్వాల్సిందిగా రాజబాబును జగదీష్ కోరాడు. ఆ పనిలో భాగంగా ప్రొఫెసర్ అప్పారావు నివాసానికి ప్రసాద్, సుబ్బరాజు వెళ్లారు. మావోయిస్టులు చెప్పిన పనులు చేసిపెట్టాలని అప్పారావు తమకు సూచించినట్లు ప్రసాద్ పోలీసులకు వెల్లడించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

ఏలేశ్వరం నుంచి పేలుడు సామగ్రి
మరోవైపు మైనింగ్‌కు వాడే పేలుడు పదార్థాలను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం ప్రాంతంలో కొనుగోలు చేశారు. నర్సీపట్నంలోని పెదబోడ్డేపల్లి గ్రామంలో ఆడిగర్ల శ్రీరామ్మూర్తి ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఉంచారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 5 గంటలకు నర్సీపట్నం ఎస్‌ఐ జి.అప్పారావు తన సిబ్బందితో దాడిచేసి ప్రసాద్, సుబ్బరాజులను అరెస్ట్ చేశారు. వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి ఉదయం 8 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు రెండు బృందాలుగా ఏర్పడిన పోలీసులు కాకినాడలో జగదీష్‌ను, విశాఖపట్నంలో అప్పారావును అరెస్ట్ చేశారు. సాయంత్రానికి నర్సీపట్నం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు ఎఫ్‌ఐఆర్ పంపించారు.
 
పొంతన ఏదీ?

నర్సీపట్నం ఎస్‌ఐ తానే ఫిర్యాదుదారుడిగా ఉదయమే నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నలుగురిని నిందితులుగా పేర్కొన్నారు. కానీ ఆ రోజు సాయంత్రం 5 గంటల వరకూ నిందితుల అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరించలేదు. నర్సీపట్నం ఏఎస్పీ డి.సత్య ఏసుబాబు రాసిన రిమాండ్ రిపోర్ట్‌లో ప్రొఫెసర్ అప్పారావును 6వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకు యూనివర్సిటీ క్వార్టర్స్‌లో అరెస్ట్ చేసి, 4 గంటలకు నర్సీపట్నం తీసుకువెళ్లినట్లు ఉంది. 7వ తేదీ తెల్లవారుజామున 2 గంటల సమయంలో విశాఖలోని స్పెషల్ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్డులో హాజరుపరిచినట్లు నిందితుల తరపు న్యాయవాదులు చెబుతున్నారు.

7వ తేదీ తెల్లారేసరికి నిందితులు విశాఖ కేంద్ర కారాగారంలో ఉన్నారు. మరోవైపు అప్పారావు భార్య మైనావతికి ఇచ్చిన అరెస్ట్ రిపోర్ట్‌లో అప్పారావును నర్సీపట్నం శివారులో అరెస్ట్ చేశామని పోలీసులు పేర్కొనడం గమనార్హం. మరో విచిత్రమేమిటంటే అప్పారావును 6వ తేదీ మధ్యాహ్నం అరెస్ట్ చేస్తే వర్సిటీ విద్యార్థులు ఆయన అరెస్టుకు ముందే ఉదయం నుంచి ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారనుకోవాలన్నమాట.

చార్జ్‌షీట్‌కు ఆరు నెలలు
అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్-2008(ఉపా చట్టం-రాజద్రోహ నేరం) కింద జీకె వీధి మండలం చాపరాతిపాలెంకి చెందిన వాసుపరి ప్రసాద్, తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన గణపతిరాజు సుబ్బరాజు అలియాస్ వర్మ, కొవ్వూరు జగదీష్, ఏయూ ప్రొఫెసర్ జెర్రా అప్పారావులపై పలు సెక్షన్లతో కేసులు నమోదు చేశారు. సాధారణంగా నిందితులకు 90 రోజుల్లో చార్జ్‌షీట్ వేయాలి. కానీ ఈ యాక్ట్ ప్రకారం అరెస్ట్ అయితే చార్జ్‌షీట్ ఫైలు చేయడానికి 180 రోజులు గడువు ఉంటుంది. అంటే దాదాపు ఆరు నెలల పాటు చార్జ్‌షీట్ లేకుండానే నిందితులను నిర్బంధంలో ఉంచవచ్చు. ఈ లోగా నిందితులు బెయిల్ కోసం న్యాయ స్థానంలో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు