ర్యాగింగ్‌ రాక్షసి

18 Jun, 2019 09:48 IST|Sakshi

సాక్షి, పార్వతీపురం,(విజయనగరం) : టీనేజ్‌లో రంగుల ప్రపంచం. బాధ్యతలు తెలియని ప్రాయం. చిన్న బాధకు కందిపోయే మనస్సు. అప్పుడే ఆకర్షణలకు లోనవుతున్నారు. కొత్త మోడల్‌ స్మార్ట్‌ ఫోన్‌లు.. కొత్త కొత్త బైకుల్ని చూసి మనసు పారేసుకుంటారు. బ్రాండెడ్‌ డ్రెస్‌లు కొని ధరించాలని ఉవ్విళ్లూరుతారు. ఇవన్నీ దొరకాలంటే.. చేతినిండా పైసలు కావాలి. టీనేజ్‌ యువత సులభ సంపాదనకు అలవాటు పడుతోంది. ఇందులో భాగంగా తోటి విద్యార్థులను వేధించడం, సీనియర్లు జూనియర్లతో ఖర్చులు పెట్టించడం, కొత్తగా కళాశాల్లో చేరే అమాయక విద్యార్థుల బలహీనతను కనిపెట్టి వారిని బెదిరించి ఖర్చు పెట్టించడం.. ఇవన్నీ ర్యాగింగ్‌లో భాగమయ్యాయి. కళాశాలల్లో ర్యాగింగ్‌ వెర్రి తలలు వేస్తోంది. పోలీసులు మహిళా రక్షక్‌ పేరిట కమిటీలను ఏర్పాటు చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు వృద్ధి చెందేలా.. ర్యాగింగ్‌ నిరోధించేలా కళాశాలల యాజమాన్యాలు తీసుకోవలసిన చర్యలపై అవగాహన కథనమిది. 

కళాశాలలు, వసతిగృహాలు, క్యాంపస్‌ల ఆవరణల్లో వివిధ రూపాల్లో ర్యాగింగ్‌ సాగుతోంది. గతంలో పలుచోట్ల బాలికల వసతిగృహాల్లోను ఈ దుమారం రేగడం తెలిసిందే. గత ఏడాది విజయనగరం పట్టణంలో విద్యార్థినులను ఆకతాయిలు వేధిస్తే పోలీసులు బుద్ధి చెప్పడం తెలిసిందే. వివిధ కారణాలతో ఇలాంటివి ఒకటి, రెండు మాత్రమే బయటికి వస్తున్నాయి.కళాశాల బయట ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లు తదితర ప్రాంతాల్లో సీనియర్లే కాకుండా... బయటి వ్యక్తులు కూడా ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. అమ్మాయిలు చూసీ చూడనట్టు ఉండటంతో ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఎవరైనా కామెంట్‌ చేస్తే గట్టిగా ఎదిరించాలని.. బహిరంగ ప్రాంతాల్లో పోలీసు నిఘా పెట్టాలని మహిళా సంఘాలు సూచిస్తున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు ఆడపిల్లలు వెళ్లే సమయాల్లో బస్సులో ప్రయాణించే కొందరు ఆకతాయిలు ఇబ్బంది పెట్టడం, ద్వందార్థాలతో వారిని కించపరచడం చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే ఆడపిల్లలు ఫిర్యాదు చేయాలి. లేదంటే ఏడాది పొడవునా ఆకతాయిలు రెచ్చిపోయి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు 
ర్యాగింగ్‌ నిరోధానికి కళాశాల యాజమాన్యాలు నిర్లక్ష్యం వహిస్తే వారు దీన్ని ప్రోత్సహించినట్టు భావించి శిక్షించాలని చట్టం చెబుతోంది. దీనికి కళాశాల  ప్రిన్సిపల్, కరస్పాండెంట్‌ కమిటీలోని అధ్యాపకులు, వార్డెన్‌ బాధ్యులే. దీనికి తోడు ఇలాంటి కళాశాలలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలను నిలిపివేస్తారు.ర్యాగింగ్‌కు పాల్పడితే బాధితులు ఫిర్యాదు చేయాలి. విద్యార్థులు క్రమ శిక్షణను అలవరచుకోవాలి. యాజమాన్యాలు సైతం ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలి. 

సుప్రీంకోర్టు ఆదేశాలివి..
దేశ వ్యాప్తంగా ర్యాగింగ్‌ నిరోధానికి సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. దీని ప్రచారం కోసం కమిటీని ఏర్పాటు చేసింది. దీని సిఫార్సులను విధిగా అమలు చేయాలి. కళాశాలకు కొత్తగా వచ్చే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు సీనియర్లు, జూనియర్ల మధ్య స్నేహభావం పెంపొందించేందుకు సాంస్కృతిక, క్రీడా  కార్యక్రమాలను ఆయా కళాశాలల్లో విస్తృతంగా నిర్వహించాలి. ప్రతి కళాశాలలో ర్యాగింగ్‌ నిరోధక పర్యవేక్షణ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలి. 

పోలీసుల టోల్‌ ఫ్రీ నంబరు 
విద్యార్థులు ర్యాగింగ్‌కు గురైతే వెంటనే 100 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. వెంటనే కంట్రోల్‌ రూమ్‌ అధికారులు, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తారు. లేదంటే స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు నేరుగా తెలపొచ్చు. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ మానవ నవరుల శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌ 18001805522కు కూడా ఫిర్యాదు చేయొచ్చు. సంఘటన జరిగిన వెంటనే బాధితులు లేదా స్నేహితులు హెల్ప్‌లైన్‌ను సంప్రదించొచ్చు. బాధితుల పేరు, ప్రాంత కంట్రోల్‌ రూమ్‌లో నమోదవుతాయి. అక్కడి అధికారులు తక్షణమే స్పందించి సంస్థ, విశ్వవిద్యాలయం అధికారులకు సమాచారం ఇస్తారు. సంఘటన తీవ్రమైందని భావిస్తే కంట్రోల్‌ రూమ్‌ నుంచి నేరుగా జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీలకు సమాచారం అందిస్తారు. 

తీసుకోవలసిన జాగ్రత్తలు
కళాశాల నోటీసు బోర్డులో ర్యాగింగ్‌ నిరోధక హెల్ప్‌లైన్‌ నంబరు ఉండాలి. ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయాలి. ప్రిన్సిపల్‌ ఆయా విభాగాల అధిపతులు, కమిటీ సభ్యులు, స్క్వాడ్‌ సబ్‌ డివిజన్‌ జిల్లా పోలీసు అధికారుల ఫోన్‌ నంబర్లు ఉండాలి. కానీ జిల్లాలోని చాలా కళాశాలల్లో వీటి గురించి పట్టించుకోవడం లేదు. ప్రతి కళాశాలలో మనస్తత్వ నిపుణుడిని నియమించాలి. విద్యార్థులకు కౌన్సిలింగ్‌ ఇప్పించాలి. విధిగా తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించాలి. పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలను ప్రచురించాలి.

మరిన్ని వార్తలు