భూ వివాదాల పరిష్కారానికి ఎస్‌వోపీ

11 Jan, 2014 05:01 IST|Sakshi
భూ వివాదాల పరిష్కారానికి ఎస్‌వోపీ

సాక్షి, హైదరాబాద్: భూ వివాదాలకు సంబంధించిన కేసుల్లో పోలీసుశాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఆగస్టు నుంచి అమలుచేస్తున్న స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ (ఎస్‌వోపీ)ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలోనూ అమలుచేయనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకూ ఆదేశాలిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ బి.ప్రసాదరావు వెల్లడించారు. పోలీస్ కమిషనరేట్‌లు, పోలీస్ అర్బన్ జిల్లాల్లో వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం భూ వివాదాలే ఉంటున్నాయి. ఈ కేసుల్లో ఒకరికి అనుకూలంగా వ్యవహరిస్తే మరో వర్గం పోలీసులకు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించే పరిస్థితి వస్తోంది. ఇలాంటి కేసులతో ఎలా వ్యవహరించాలి? దర్యాప్తు ఏ విధంగా చేపట్టాలి? అనే అంశాలపై పూర్తిస్థాయి అధ్యయనం అనంతరం ఎస్‌వోపీని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ రూపొం దించారు. అదే నివేదికను ప్రభుత్వానికి, డీజీపీకి కూడా అందించారు. దాన్ని అన్ని జిల్లాల పోలీసులకూ పంపాలని డీజీపీ తాజాగా నిర్ణయించారు. పోలీసులు వారితో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడ కుండా బాధితులకు న్యాయం చేసేలా సర్క్యులర్ జారీచేయనున్నారు. అందులోని అంశాలు...
 
 ఠ    స్థిరాస్తి సరిహద్దులపై వివాదం రేగిన కేసుల్లో ఉభయపక్షాలూ సంబంధిత అధికారులతో సర్వే చేయించుకునేలా సూచించాలి. సర్వే సమయంలో మినహా మరెప్పుడూ కోర్టు ఆదేశాలు లేకుండా రక్షణ కల్పించకూడదు.
 ఠ ఇరు పక్షాలూ భూమి హక్కు పత్రాలతో పోలీసుల్ని ఆశ్రయిస్తే రెవెన్యూ అధికారుల నుంచి వివరణ తీసుకోవాలని చెప్పాలి. కోర్టు ఆదేశాలు ఉంటే తప్ప ఏ ఒక్కరికీ అనుకూలంగా వ్యవహరించొద్దు.
 ఠ    జీపీఏతో వచ్చిన వ్యక్తి తన ఆస్తికి రక్షణ కోరితే ఆ జీపీఏ అధీకృత వ్యక్తులు చేసిందేనా? సదరు వ్యక్తి ప్రస్తుతం బతికే ఉన్నారా? అనేది పరిగణనలోకి తీసుకోవాలి. ప్రధాన జీపీఏ హోల్డర్ చనిపోతే అది రద్దైనట్లే అని గుర్తిం చాలి. ఆధారాలుంటే కేసులు నమోదు చేయాలి. ప్రస్తుతం సదరు స్థిరాస్తిలో నివసిస్తున్న (పొజిషన్‌లో ఉన్న) వారిని ఖాళీ చేయించే యత్నం చేయకూడదు.
 
 ఠ    సేల్ అగ్రిమెంట్‌తో వచ్చి ఆస్తికి రక్షణ కోరితే కోర్టు ఆదేశాలు లేనిదే ఎలాంటి చర్యలు చేపట్టకూడదు.
 ఠ    స్థిరాస్తి కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించి మోసపోయానని బాధితులు ఆధారాలతో వచ్చినా కోర్టు ఆదేశాల్లేనిదే రక్షణ ఇవ్వకూడదు.
 ఠ    ఒకరి వద్ద జీపీఏ, రిజిస్ట్రేషన్ ఉండి.. మరొకరి వద్ద రెవెన్యూ రికార్డులు ఉంటే వారిలో ఎవరికి, ఏ రకంగా ఆస్తిపై హక్కులు సంక్రమించాయో రెవెన్యూ రికార్డుల ఆధారంగా పరిశీలించాలి.
 ఠ    స్థిరాస్తిపై కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌తో ఫిర్యాదుదారుడు వస్తే, ఆ ఉత్తర్వులను పరిశీలించి ఆమేరకు నడుచుకోవాలి.
 ఠ    ఫిర్యాదుదారుడు కోర్టు ఆదేశాలతో వచ్చి ఆస్తికి రక్షణ కోరినా... రిజిస్టర్డ్ జీపీఏతో వచ్చి పొజిషన్ ఇప్పించాలని కోరినా... రెవెన్యూ అధికారులను సంప్రదించాకే చర్యలు తీసుకోవాలి.
 ఠ    భూముల ఆక్రమణ పైఫిర్యాదు వస్తే పత్రాలను సరిచూసిన తరవాత కేసు నమోదు చేయాలి. ఆక్రమణదారులను అరెస్టు చేయాలి. నిందితుడైనప్పటికీ అతడిని నేరుగా ఆ స్థిరాస్తి నుంచి ఖాళీ చేయించకూడదు. కోర్టు ద్వారా ఆదేశాలు తెచ్చుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించాలి.
 ఠ    ఓ వ్యక్తి ఒకే స్థలంపై అనేక మందికి సేల్‌డీడ్స్ ఇచ్చారని ఫిర్యాదు వస్తే రికార్డుల ప్రకారం ఆ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తికే మద్దతు ఇవ్వాలి. వేరే వ్యక్తి పొజిషన్‌లో ఉన్నారని తెలిసినా కోర్టు ఆదేశాలు లేనిదే ఖాళీ చేయించకూడదు.
 ఠ    పక్కా సేల్‌డీడ్‌తో పోలీసుల్ని ఆశ్రయించి, మ్యూటేషన్ కాలేదని చెప్పి ఆస్తికి రక్షణ కోరితే రికార్డుల్ని పరిశీలించాలి. కోర్టు కేసులు లేకుంటే మాత్రమే రక్షణ ఇవ్వాలి.
 ఠ    స్థిరాస్తిపై న్యాయస్థానం స్టేటస్ కో జారీ చేసిన వ్యక్తి పోలీ సులను ఆశ్రయిస్తే ఖాళీ స్థలమైతే భౌతికంగా ఎలాంటి మార్పు చేర్పులు చేయకూడదని ఇరుపక్షాలకు సూచిం చాలి. కోర్టు ఆదేశాలు ఉంటేనేచర్యలు తీసుకోవాలి.
 ఠ    స్థిరాస్తిని ప్రభుత్వ విభాగాలు స్వాధీనం చేసుకుంటున్నాయనే ఫిర్యాదు వస్తే కోర్టును ఆశ్రయించాల్సిందిగా సూచించాలి.
 ఠ    లీజుకు, అద్దెకు తీసుకున్న వ్యక్తి దాన్ని రెన్యువల్ చేయించుకోవడం, ఖాళీ చేయడం లేదనే వివాదాల్లో కోర్టును ఆశ్రయించమని చెప్పాలి.
 ఠ    ఇనామ్ భూమిపై వివాదం వస్తే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న నమోదుల్ని పరిగణనలోకి తీసుకోవాలి. పట్టాదారుపాసు పుస్తకాల అంశాన్ని పరిశీలించి ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్ ఉన్న వారికి మద్దతు ఇవ్వాలి.
 ఠ    తరచుగా భూ వివాదాలు, నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిపై మరో కేసు నమోదైతే ‘ల్యాండ్ గ్రాబర్ షీట్’ తెరిచి, నిఘా ఉంచాలి.

>
మరిన్ని వార్తలు