మిస్‌ యూ రాజా

9 May, 2020 08:35 IST|Sakshi
రాజాకు నివాళులర్పిస్తున్న ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీ సత్తిబాబు తదితరులు

అనారోగ్యంతో పోలీస్‌ జాగిలం మృతి

సాక్షి,  కోనేరుసెంటర్‌(మచిలీపట్నం): పరిస్థితులను పసిగట్టేతత్వం.. ఎదుటి వ్యక్తుల కదలికలను నిశితంగా గమనించే నైజం.. నిరంతరం నేర పరిశోధనా దృష్టితో పోలీసులకు సైతం అంతుచిక్కని అనేక చిక్కుముళ్లతో కూడిన కేసులను కూడా సునాయాసంగా ఛేదించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో పలు పురస్కారాలు అందుకున్న జిల్లాకు చెందిన పోలీస్‌ జాగిలం(రాజా)శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందింది. (అప్రమత్తతతోనే ముప్పు తప్పింది )
ప్రతిభకు పట్టం.. 

  • పోలీసు జాగిలం రాజా వయస్సు ఆరేళ్లు. 2015లో జిల్లా పోలీసుల వద్దకు చేరిన ఈ డాగ్‌.. దాదాపు 17 కేసులను ఛేదించింది. 
  • అంతేకాక రాష్ట్ర, జాతీయస్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని జిల్లా పోలీసు డాగ్‌ టీంకు పతకాలు తెచ్చిపెట్టి జిల్లా పోలీసు ప్రతిష్టను దశదిశలా చాటింది.  
  • 2014లో హైదరాబాదు మోయినాబాద్‌ పోలీసు డాగ్‌ శిక్షణ కేంద్రంలో ఎనిమిది నెలల పాటు ప్రత్యేక తర్ఫీదు పొందిన రాజా.. శిక్షణలో మంచి ప్రతిభ కనబరచి సిల్వర్‌ మెడల్‌ను కైవసం చేసుకుంది. 
  • 2015లో హర్యానాలో జరిగిన ఆలిండియా పోలీసు డ్యూటీ మీట్‌లో పాల్గొని 29 రాష్ట్రాల్లోని పోలీసు జాగిలాలతో తలపడి తృతీయస్థానంలో బ్రాంజ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది. లక్ష రూపాయల రివార్డుతో పాటు ఒక ఇంక్రిమెంట్‌ను సాధించింది.  
  •  2016లో జరిగిన ఉమ్మడి రాష్ట్రాల రీఫ్రెష్‌ కోర్సులో 2014లో తీసుకున్న శిక్షణకు సంబంధించి నిర్వహించిన పోటీలో ప్రతిభ కనబరచి ప్రథమస్థానంలో షీల్డును అందుకుంది.  
  • నేరపరిశోధనలో హంతకుల ఆచూకీ పసిగట్టటంతో పాటు శిక్షణలో నేర్చుకున్న అనేక అంశాలతో పాటు జిల్లా పోలీసు ప్రాంగణంలో జరిగే స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అనేక విన్యాసాలు చేసి అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులతో పాటు పిల్లలను విశేషంగా ఆకట్టుకుంటుంది. 

ఐదు నిమిషాల్లో కేసు ఛేదన.. 
అది 2018 జూలై 29న ఏ కొండూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ హత్య జరిగింది. మరిదితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తన భర్తను పచ్చడిబండతో దారుణంగా కొట్టి చంపింది. ఈ హత్యను మృతుని భార్య, తమ్ముడు కలిసి చేశారు. మరుసటి రోజు ఏ పాపం తెలియని అమాయకుల్లా శవం వద్ద కూర్చుని విలపిస్తున్నారు. ఈ హత్యపై పోలీసులకు ఎలాంటి ఆధారాలు అందలేదు. అసలు హత్య ఎందుకు జరిగి ఉంటుందనే విషయం అంతు చిక్కలేదు. అలాంటి సమయంలో పోలీసు డాగ్‌ రాజా రంగంలోకి దిగి.. ఐదే ఐదు నిముషాల్లో హత్య చేసిన భార్యతో పాటు మృతుని తమ్ముడిని పూర్తి ఆధారాలతో పట్టించి అధికారుల చేత శభాష్‌ అనిపించుకుంది.  

అధికార లాంఛనాలతో.. 
పోలీసు డాగ్‌ రాజాకు శుక్రవారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. జిల్లా ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబు పుష్పగుచ్ఛంతో నివాళులు అర్పించారు. ఎస్పీతో పాటు ఏఎస్పీ మోకా సత్తిబాబు, ఏఆర్‌ ఏఎస్పీ బి. సత్యనారాయణ, డీఎస్పీలు మహబూబ్‌బాషా, ఉమామహేశ్వరరావు, ధర్మేంద్ర, ఇతర సిబ్బంది నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు