అధ్యాపకులను వేధిస్తోన్న ప్రిన్స్‌పాల్‌పై సీరియస్‌

19 Aug, 2019 08:26 IST|Sakshi

నిజాలు నిగ్గు తేలుస్తున్న నిఘా వర్గాలు

‘సాక్షి’ వరుస కథనాలపై స్పందించిన సర్కార్‌

సాక్షి, రాజమహేంద్రవరం (తూర్పు గోదావరి): స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణల వ్యవహారాన్ని గత సర్కారు మసిపూసిన మారేడుకాయ చందంగా చేయగా.. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో చేపడుతున్న విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తున్నారు. మహిళా అధ్యాపకులపై వేధింపుల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడంతో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది.. రెండున్నరేళ్లుగా ఈ కళాశాలలో ప్రిన్సిపాల్‌పై మహిళా అధ్యాపకులు ఫిర్యాదులు చేస్తున్నా పెడచెవిన పెట్టడానికి దారి తీసిన పరిస్థితులపై శనివారం నిఘా వర్గాలు సమాచారం సేకరించాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రిన్సిపాల్‌ కొత్తపల్లి వీర్రాజు వేధింపులకు పాల్పడుతున్నారని దళిత కుటుంబానికి చెందిన కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ ఉదయశాంతి రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపిన తీరును కూడా ఆరా తీశారు.

ఆ సమయంలో హఠాత్తుగా అనారోగ్యానికి గురైనట్టు ప్రిన్సిపాల్‌ ఆస్పత్రిలో జాయిన్‌ కావడం, తదనంతర పరిణామాల్లో కేసును నీరు గార్చేసిన వ్యవహారాన్ని అన్ని కోణాల్లో పరిశీలిస్తున్నారు. వేధింపులు ఎదుర్కొన్న ఉదయశాంతితో పాటు 17 మంది మహిళా అధ్యాపకులు మూకుమ్మడిగా లిఖిత పూర్వకంగా అప్పటి ఇంటర్మీడియట్‌ బోర్డు కమిషనర్‌ ఉదయలక్ష్మికి ఫిర్యాదు చేసినా.. బాధ్యులపై చర్యలకు ఇంతకాలం మోకాలడ్డిన వారెవరనే దానిపై ప్రభుత్వం నిజాలు తవ్వితీస్తోంది. ప్రిన్సిపాల్‌ వేధింపులు భరించలేక దళిత మహిళా అధ్యాపకురాలు ధైర్యం చేసి బయటకు వచ్చి చెప్పుకున్నా గత టీడీపీ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు.

తీవ్రంగా పరిగణిస్తున్న ప్రభుత్వం
అసలు కేసు నీరుగారిపోవడానికి దారి తీసిన పరిస్థితులు, అందుకు కారకులెవరనే విషయంపై ప్రభుత్వం అంతర్గతంగా విచారణ సాగిస్తోంది. మహిళలకు అన్ని రంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న తరుణంలో కళాశాల ప్రిన్సిపాల్‌ తీరును జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నీరుగారిస్తే గార్చారు, కనీసం ఆయనపై వేసిన విచారణలోనైనా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బాధితులంతా నిరీక్షించారు. ప్రిన్సిపాల్‌పై విచారణకు గత ప్రభుత్వంలో అప్పటి రాజమహేంద్రవరం ఆర్‌జేడీ వైవీ సుబ్బారావు నియమితులయ్యారు. ఫిబ్రవరి 11న ఆయన విచారణ జరిపారు. ఆ సమయంలో ప్రిన్సిపాల్‌ వ్యవహార శైలిపై ఉదయశాంతితో పాటు 17 మంది ఉపాధ్యాయులు మూకుమ్మడిగా ఒకే లేఖపై సంతకాలు పెట్టి మరీ వాంగ్మూలమి చ్చారు.

అయినప్పటికీ నాటి టీడీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని చాలా సింపుల్‌గా తీసుకుందనే విమర్శలున్నాయి. అందుకే వాటి పూర్వాపరాలను ప్రస్తుత ప్రభుత్వం తవ్వి తీస్తోంది. నాటి విచారణ సమయంలో మినిట్స్‌ నమోదు చేసిన అప్పటి, ప్రస్తుతæ ఇంటర్మీడియట్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ (రాజమహేంద్రవరం) కార్యాలయ సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ, అప్పటి ఆర్‌జేడీ వైవీ సుబ్బారావుల వ్యవహార శైలిపై కూడా దృష్టి సారించారని సమాచారం. మహిళా అధ్యాపకులందరూ ఒక్కటై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడానికి దారి తీసిన పరిస్థితులు, అప్పటి ఇంటర్మీడియట్‌ బోర్డులో ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించిన వారిలో ఎవరెవరు దీని వెనుక ఉన్నారనే అంశాలన్నింటినీ నిఘా వర్గాలు సేకరిస్తున్నాయి.

స్పందించిన మంత్రులు
ఇటీవల మహిళా అధ్యాపకులు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితకు ఫిర్యాదు చేసిన నేపథ్యం, ‘సాక్షి’లో 17న ‘వేధింపుల్లో ‘ప్రిన్స్‌’పాల్‌’, 18న ‘ఈయనో ప్రిన్సిఫ్రాడ్‌’ శీర్షికలన వచ్చిన వరుస కథనాలను మంత్రులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంతకాలం కాలయాపన చేస్తున్న తీరును వారు తప్పుపట్టారని తెలిసింది. అంతమంది మహిళా అధ్యాపకులు ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడమేమిటంటూ మంత్రులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పారదర్శకంగా విచారణ పూర్తి చేసి నివేదిక అందజేయాలని ఆర్‌జేడీకి ఆదేశాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్‌ వీర్రాజును ఆర్‌జేడీ నగేష్‌కుమార్‌ సోమవారం విచారించనున్నారు. జూనియర్‌ కళాశాలలోనే ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎవ్వరూ సెలవులపై వెళ్లరాదని కళాశాలకు ఆర్‌జేడీ ఆదేశాలు జారీ చేశారు. ఒకపక్క ఉన్నత స్థాయి విచారణకు రంగం సిద్ధమవుతూండగా ప్రిన్సిపాల్‌ వీర్రాజు ఆదివారం కళాశాలలోనే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను అభివృద్ధి చేస్తూంటే వేధిస్తున్నానంటూ ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. కాగా, అభివృద్ధి ముసుగులో ఆయన డొనేషన్లు తీసుకువచ్చి లెక్కాపత్రం లేకుండా చేశారని అధ్యాపకులు ఆరోపిస్తున్నారు.

తాను అంతా నిజాయతీగానే పని చేశానని చెబుతున్న ప్రిన్సిపాల్‌ మాటల్లో వాస్తవమేమిటన్నది ఈ విచారణలోనైనా తేలుతుందని అధ్యాపకులు ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి నలుగురిలో చులకనైపోతామనే భయంతో మహిళలు వేధింపుల వ్యవహారాల్లో ముందుకు రాని పరిస్థితి. అటువంటిది రెండేళ్లుగా ప్రిన్సిపాల్‌ వేధింపులపై ధైర్యంగా వారు పోరాడుతున్న తీరును ప్రభుత్వం కూడా ఆషామాషీ వ్యవహారంగా తీసుకోలేదని, అందుకే ఆర్‌జేడీని విచారణకు ఆదేశించిందని అంటున్నారు. విచారణ సమయంలో ప్రిన్సిపాల్‌ను దూరం పెట్టకుంటే మరోసారి అన్యాయమైపోతారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు