ఏజెంట్లపై పోలీసు విచారణ కూడా జరిపించండి: ద్వివేది

7 May, 2019 16:14 IST|Sakshi
గోపాల కృష్ణ ద్వివేదీ(పాత చిత్రం)

అమరావతి: రాజకీయ పార్టీలకు సంబంధించిన కౌంటింగ్‌ ఏజెంట్ల గురించి పోలీసు విచారణ కూడా జరిపించాలని స్థానిక ఎన్నికల అధికారులకు ఏపీ సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదీ సూచించారు. మంగళవారం కౌంటింగ్‌ జిల్లా స్థాయి అధికారుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గోపాల కృష్ణ ద్వివేదీ, కౌంటింగ్‌ సిబ్బంది శిక్షణలో పలు సూచనలు చేశారు. కౌంటింగ్‌ సిబ్బంది ఎంపికలో జాగ్రత్త వహించాలని కోరారు. సమస్య వచ్చిన పోలింగ్‌ బూత్‌ల కౌంటింగ్‌ని చివరి రౌండ్‌కు మార్పు చేయాలని చెప్పారు.

మాక్‌పోల్‌ చేసిన ఓట్లు కూడా వీవీపాట్స్‌లో కలిసి పోయి ఉంటే ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలొ కౌంటింగ్‌ చేసి వివరించండని అన్నారు. మాక్‌ పోల్‌ వివరాలు అన్ని పార్టీ ఏజెంట్ల వద్ద ఉంటాయి కాబట్టి సమస్య ఉండదన్నారు. పోస్టల్‌ బ్యాలెట్లు 23వ తేదీ ఉదయం 7 గంటల 59 నిమిషాల వరకు తీసుకోవచ్చునని చెప్పారు. నిబంధనల ప్రకారం పోస్టల్‌ బ్యాలెట్‌ కౌంటింగ్‌ నిర్వహించాలని సూచన చేశారు. సమస్య ఉండి.. అవసరమైతే తప్ప రీకౌంటింగ్‌కి అనుమతి ఇవ్వవద్దని సూచన చేశారు. 

ఎప్పుడూ ఇలా ఒత్తిడి ఎదుర్కోలేదు

చాలా ఎన్నికల్లో విధులు నిర్వహించాం.. ఎప్పుడూ ఈవిధంగా ఒత్తిడి ఎదుర్కోలేదని జాయింట్‌ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బాబూరావు వ్యాఖ్యానించారు. 12 మంది ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకునే విషయంలో పునరాలోచన చేయండని బాబూరావు, ద్వివేదీకి విన్నవించారు. ఒత్తిడి వల్ల కిందస్థాయిలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని చెప్పారు.

ఎన్నికల సిబ్బందిలో అభద్రతా భావాన్ని తొలగించాలని కోరారు. దీనిపై ద్వివేది స్పందిస్తూ..తప్పు ఎంతవరకు చేస్తే అంతవరకే చర్యలు తీసుకున్నామని అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపై చర్యలు తీసుకోలేదన్నారు. కావాలని అధికారులు తప్పులు చేయరు..కొంతమంది నిర్లక్ష్యం వల్ల తప్పులు జరిగాయన్నారు. కౌంటింగ్‌ విషయంలో నిర్లక్ష్యం వీడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు