అనంతలో దొంగనోట్ల దొర

28 Jul, 2013 01:46 IST|Sakshi
అనంతలో దొంగనోట్ల దొర

అనంతపురం జిల్లా కేంద్రంగా ఓ పోలీసు ఉన్నతాధికారి నేతృత్వంలో నకిలీనోట్ల చలామణి ముఠా భారీ కార్యకలాపాలు సాగిస్తోందా? నకిలీ నోట్ల ముఠాకు అధికార, విపక్షాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు దన్నుగా నిలుస్తున్నారా? దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే నకిలీ నోట్ల ముఠాలో కొన్ని జాతీయ బ్యాంకుల మేనేజర్లు, వ్యాపారులు.. 20 మందికి పైగా కింది స్థాయి పోలీసు అధికారులు కీలకపాత్ర పోషిస్తున్నారా?అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి పోలీసువర్గాలు.
 బయటపడిందిలా..: అనంతపురం జిల్లాలో ధర్మవరానికి చెందిన వెంకటరమణ, రమేష్, ఖలీల్, సలీం,బాషాలు నకిలీ నోట్ల చలామణి ముఠాలో సభ్యులు. రూ.వంద అసలైన కరెన్సీకి రూ. మూడు వందలు నకిలీ కరెన్సీని ఇస్తూ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇటీవల కర్ణాటకలోని కోలార్‌జిల్లా కొప్పలవాయిహళ్లికి చెందిన రామచంద్ర నకిలీ నోట్ల కోసం ఈ ముఠాను సంప్రదించాడు. పుట్టపర్తి మండల పరిధిలోని బత్తలపల్లి సమీపంలో గంటల మారెమ్మ కనుమవద్దకు వస్తే నకిలీనోట్లను అందజేస్తామని ఈ ముఠా రామచంద్రకు చెప్పింది. దీంతో రామచంద్ర రూ. 2 లక్షలు తీసుకుని వారు చెప్పిన ప్రదేశానికి శుక్రవారం (26వ తేదీ) వచ్చాడు. అయితే వీరి కదలికలు పసిగట్టిన హెడ్ కానిస్టేబుల్ వెంకటగిరి వారిని అదుపులోకి తీసుకున్నాడు. పుట్టపర్తి రూరల్ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లాడు. వారు భారీఎత్తున లంచాన్ని ఎరగా వేయడం తో నకిలీనోట్ల చలామణి కేసు కాకుండా దొంగతనం కేసును నమోదు చేశాడు. అయితే నిఘా వర్గాలు అసలు విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదివారం పుట్టపర్తి పోలీసుస్టేషన్‌కు వెళ్లి విచారణ జరిపారు. హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయితే విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి నందుకే పుట్టపర్తి రూరల్ హెడ్ కానిస్టేబుల్ వెంకటగిరిని సస్పెండ్ చేసినట్లు సీఐ వేణుగోపాల్ సోమవారం తెలిపారు.
 
 పోలీసు ఉన్నతాధికారే ముఠా మేస్త్రీ!: పోలీసుల అదుపులో ఉన్న ముఠా సభ్యులను ఎస్పీ విచారించినపుడు.. తమకు ఓ పోలీసు ఉన్నతాధికారే మేస్త్రీ అని, మరో 20 మంది కానిస్టేబుళ్లు, పోలీసు అధికారులు సహకరిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. ధర్మవరం కేంద్రంగా..: అనంతపురం జిల్లాలో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ధర్మవరం గణతికెక్కింది. బెంగళూరులో నకిలీ నోట్లను తయారుచేసే ఓ ముఠా ధర్మ
 వరాన్ని తమ వ్యాపార కేంద్రంగా చేసుకుంది. రెండున్నరేళ్ల క్రితం ఐదుగురు సాధారణ వస్త్ర వ్యాపారులు వీరికి ఏజెంట్లుగా మారారు. రాష్ట్రంలో భారీ ఎత్తున నకిలీ నోట్లను చలామణి చేయించారు. రెండు జాతీయ బ్యాంకుల మేనేజర్లు, నలుగురు రియల్టర్లను ముఠాలో చేర్చుకుని దందాను విస్తరించారు. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తారు. ఇది ఓ పోలీసు ఉన్నతాధికారి దృష్టికి వెళ్లడంతో.. ఆయన అసలు విషయం పసిగట్టారు. వ్యాపారంలో సింహభాగం తనకు వాటాగా ఇస్తే అండగా ఉంటానని ఆ పోలీసు అధికారి హామీ ఇచ్చారు. ఇందుకు వస్త్రవ్యాపారులు అంగీకరించడంతో ఇప్పుడు దొంగ నోట్ల ముఠామేస్త్రీగా ఆ పోలీసు అధికారి వ్యవహరిస్తున్నారు. ఈ పోలీసు అధికారికి అధికార, విపక్షాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల అండ ఉందని ఎస్పీ విచారణలో తేలింది. మరిన్ని కీలక అంశాలను కూడా ముఠా సభ్యులు వివరించడంతో ఏఎస్పీ నవదీప్‌సింగ్‌ను ఎస్పీ సమగ్ర విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు