నమ్మించి... మోసం చేశాడు..

16 Jul, 2014 03:00 IST|Sakshi

మచిలీపట్నం క్రైం : ప్రేమించానన్నాడు... పెళ్లిచేసుకుంటానన్నాడు... మాయమాటలు చెప్పాడు... ఆపై ఆమెను లొంగదీసుకుని ఐదు నెలల గర్భవతిని చేశాడు. తీరా పెళ్లి విషయానికి వచ్చే సరికి మొహం చాటేశాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని సదరు యువతి తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించింది.

ఈ సంఘటనపై మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మచిలీపట్నం ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నారగాని శ్రీనివాసరావు రోల్డుగోల్డు పనులు చేస్తుంటాడు. ఇతనికి భార్య ఇరువురు పిల్లలున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ 19 ఏళ్ల యువతి శ్రీనివాసరావు వద్ద పని నిమిత్తం చేరింది. ప్రతి రోజూ పని నిమిత్తం అతని ఇంటికి వెళ్లి వస్తుండేది.
 
వారిద్దరి మధ్య చనువు పెరిగి  శ్రీనివాసరావు ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన సదరు యువతి శ్రీనివాసరావుకు శారీరకంగా దగ్గరయ్యింది. యువతి తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో వారు పనులకు వెళ్లిపోయేవారు. దీంతో సమయం కుదిరినప్పుడల్లా శ్రీనివాసరావు యువతి ఇంటికి వెళ్లి ఆమెను లొంగదీసుకునే వాడు.

దీంతో సదరు యువతి నెలసరి ఆగిపోవడంతో అనుమానం వచ్చిన శ్రీనివాసరావు ఆమెను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించాడు. అయితే వైద్యులు యువతి ఐదు నెలల గర్భవతి అని ధ్రువీకరించారు. దీంతో శ్రీనివాసరావును వివాహం చేసుకోవాలంటూ యువతి ఒత్తిడి చేయడం మొదలుపెట్టింది. అందుకు శ్రీనివాసరావు 12వ తేదీన ఆమెను విజయవాడ రైల్వే  స్టేషన్‌కు వస్తే ఇద్దరం వివాహం చేసుకుందామని చెప్పాడు.
 
అతని మాటలు నమ్మిన ఆమె ఇంట్లో తెలియకుండా విజయవాడ వెళ్లి  పోయింది. అయితే శ్రీనివాసరావు ఎంతకీ రాకపోవడంతో రైల్వేస్టేషన్‌లో రోజంతా ఒంటరిగా గడిపింది. యువతి అదృశ్యంతో కంగారుపడిన తల్లిదండ్రులు, బంధువులు ఆమె ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టగా విజయవాడ రైల్వేస్టేషన్‌లో ఉన్నట్లు సమాచారం అందింది.

దీంతో ఆమె బంధువులు అక్కడికి చేరుకుని యువతిని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. అనంతరం జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన సదరు యువతి శ్రీనివాసరావు తనను నమ్మించి గర్భవతిని చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు