మున్సిపల్ ‘రణరంగం’

18 Jul, 2015 01:04 IST|Sakshi
మున్సిపల్ ‘రణరంగం’

ఔట్‌సోర్సింగ్ కార్మికులపై  విరుచుకుపడ్డ పోలీసులు
పది మందికి గాయాలు

 
విజయవాడ సెంట్రల్ : శ్రమజీవుల రక్తం చిందింది. శాంతియుతంగా సాగుతున్న ర్యాలీపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. మహి ళా కార్మికులను మెడలు పట్టి రోడ్డున ఈడ్చారు. దొరికినవారిని దొరికినట్టు ప్రత్యేక వాహనాల్లో కుక్కి పోలీస్ స్టేషన్లకు తరలించారు. పోలీసులు వర్సెస్ కార్మికుల మధ్య తోపులాటలు, వాగ్యుద్ధాలు, హాహాకారాలతో లీలామహల్ సెంటర్ రణరంగాన్ని తలపించింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 13 జిల్లాల నుంచి సుమారు 9 వేల మంది ఔట్‌సోర్సింగ్ కార్మికులు నగరానికి చేరుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిచేందుకు తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచిఉదయం 10.30 గంటలకు ర్యాలీగా బయలుదేరారు. లీలామహల్ సెంటర్‌లోని మనోరమ హోటల్ వద్దకు చేరుకొనేసరికి బారికేడ్లతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కార్మికులు వాదనకు దిగారు. తమ బాధలు తీరాలంటే పోరాటాలే శరణ్యమన్నారు.

పోలీసులు ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. మహిళా కార్మికులపై పోలీసులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు. ఓవైపు రక్తమోడున్నప్పటికీ కార్మికులు పోరాటాన్ని కొనసాగించారు. ఈ ఘటనలో పది మందికి పైగా కార్మికులకు గాయాలయ్యాయి. బాసటగా నిల్చిన యూని యన్, వామపక్ష నాయకులను బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనా ల్లో పడేశారు. వన్‌టౌన్, భవానీపురం, ఇబ్రహీంపట్నం, త్రీటౌన్, సూర్యారావుపేట, సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణలు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు.
 
మా ఉసురు తగులుతుంది
 టీడీపీ సర్కార్‌కు తమ ఉసురు తగులుతోం దం టూ కార్మికులు శాపనార్ధాలు పెట్టారు. అరెస్ట్‌ల అనంతరం మునిసిపల్ జేఏసీ నాయకులతో హోటల్ గేట్‌వేలో ముఖ్యమంత్రి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనంగా రూ.15,432  చెల్లించాలని, ఇం జినీరింగ్ విభాగంలో పని చేసే స్కిల్డ్, సెమీస్కిల్డ్ ప్రకారం వేతనాలు చెల్లించాలని, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలనే డిమాండ్లపై సీఎంతో చర్చించారు. ఏ ఒక్కదానికి సీఎం అంగీకరించలేదు. మీకు(కార్మికులకు) ఇచ్చేందుకు మా(ప్రభుత్వం) వద్ద డబ్బులు ఉండాలిగా అన్నారు. మీరు అంగీకరిస్తే జీతాలు చెల్లించే బాధ్యత స్థాని క సంస్థలు చూసుకుంటాయని యూనియన్ నేతలు బదులిచ్చారు. ఆ స్థానిక సంస్థల వద్దే డబ్బుల్లేవు. వాళ్లకే మేం ఇస్తున్నాం అంటూ బుకాయించారు. ఔట్ సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది తానేనని సీఎం పేర్కొన్నారు. చర్చలు విఫలమయ్యాయని తెలుసుకున్న కార్మికులు చంద్రబాబు తీరుపై దుమ్మెత్తిపోశారు.
 ఎత్తుకుపై ఎత్తు.. సీఎం క్యాంప్ కార్యాలయ ముట్టడికి భారీగా కార్మికులను తరలించడంలో యూనియన్ నా యకులు సఫలమయ్యారు. అయితే పోలీసులు గురువారం నుంచే రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండ్‌ల్లో అరెస్ట్‌లకు శ్రీకారం చుట్టారు. అయినప్పటికీ వివిధ మార్గాల ద్వారా అనూహ్యంగా 9 వేల మంది కార్మికులు విజయవాడ చేరుకున్నారు.
 
 

మరిన్ని వార్తలు