అమోనియం నైట్రేట్‌పై నిఘా!

15 Dec, 2014 01:51 IST|Sakshi

కొయ్యూరు : తీవ్ర పేలుడు ప్రబావం కలిగిన అమోనియం నైట్రేట్ మావోయిస్టుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు కట్టదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. క్వారీలకు సరఫరాపై కూడా నిఘా ఉంచారు. ఇటీవల కొందరినుంచి సుమా రు 300 కిలోల అమోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకుని కేసులు పెట్టడం తెలిసిందే.
 
లోతుగా దర్యాప్తు.. ఒకప్పుడు మావోయిస్టులకు విచ్చలవిడిగా పేలుడు పదార్థాలు చేరేవి. కొంత కాలంగా ఆ పరిస్థితి లేకపోవడంతో మందుపాతరలు పేల్చే అవకాశం తగ్గింది. పేలుడు పదార్థాలు మావోయిస్టులకు చేరుతున్నాయని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు స్టోన్ క్వారీ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అక్రమ నిల్వలు స్వాధీనం చేసుకుని అరెస్టులు చేశారు. పెదబొడ్డేపల్లిలో కూడా పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు లోతుగా దర్యాప్తు జరిపి, దీంతో సంబంధాలున్న వారిపై కేసు నమోదు చేశారు.
 
నాతవరం మండలంపై దృష్టి...  మన్యంలో కొన్ని చోట్ల మాత్రమే క్వారీలున్నాయి. అక్కడ వినియోగించేది తక్కువే. దీంతో పోలీసులు మైదాన ప్రాంతంపై దృష్టిపెట్టారు. నాతవరం మండలంలో క్వారీలు ఎక్కువగా ఉండడంతో వాటిపై దృష్టి సారించారు. మన్యంలో ఎర్రమట్టి క్వారీలు నిర్వహించే వారిపై మావోయిస్టులు ఎలాంటి హెచ్చరికలు చేయకపోవడం పోవడాన్ని పోలీసులు అనుమానించారు. వారికి అవసరమైంది ఏదో నిర్వాహకులు సరఫరా చేసి ఉంటారన్న కోణంలో దర్యాప్తు జరిపారు. అమోనియం నైట్రేట్ లాంటి పేలుడు పదార్థం సరఫరా చేశారన్న అభియోగంపై ఇద్దరిని అరెస్టు చేశారు.
 
క్వారీలపై పర్యవేక్షణ..
రూరల్ ఎస్పీ ప్రవీణ్‌కుమార్ క్వారీలపై పూర్తిగా సిబ్బందితో దృష్టి సారించారు. అమోనియం నైట్రేట్‌ను డీజిల్ లేదా మండే ఏ పదార్థం దేనితో కలిపినా భారీ పేలుడు సంభవిస్తుంది. మావోయిస్టులు వాటితో విధ్వంసానికి పాల్పడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై స్థానిక సీఐ సోమశేఖర్‌ను సంప్రదించగా కొయ్యూరు మండలంలో పెద్దగా క్వారీలు లేవని చెప్పారు. ఉన్నవాటిని తనిఖీ చేశామని తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా