పల్లెలపై పోలీస్‌ నిఘా

9 Mar, 2020 13:44 IST|Sakshi

సమస్యాత్మక గ్రామాల గుర్తింపులో సిబ్బంది బిజీ  

గతంలో గొడవలు జరిగిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి  

ముందస్తు బైండోవర్లకు ఉన్నతాధికారుల ఆదేశం

కర్నూలు: స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాటు షురూ అయ్యాయి. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమైంది. రాజకీయంగా గుర్తింపు ఉన్న జిల్లా కావడంతో ఇప్పటి నుంచే ఎన్నికలకు పటిష్టమైన భద్రత, శాంతిభద్రతలు అదుపులో ఉంచడానికి చర్యలు ముమ్మరం చేశారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలు, గతంలో ఆయా గ్రామాల్లో ఎన్ని కేసులు నమోదయ్యాయి. నేరాల పాత రికార్డుల ఆధారంగా జాబితాలు రూపొందిస్తున్నారు. 

నోటిఫికేషన్‌కు వారం ముందే..
స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌కు వారం ముందే ఎస్పీ ఫక్కీరప్ప జిల్లా యంత్రాంగంతో సమావేశం నిర్వహించి ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఎక్కడ గొడవలు జరగడానికి ఆస్కారం ఉందనే సమాచారం ముందుగానే తెప్పించుకుని వాటిని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకోవాలి అనే అంశాలపై సర్కిళ్ల వారీగా అధికారులకు సూచనలిచ్చారు. గ్రామాల్లో ఆయా రాజకీయ పక్షాలకు నేతృత్వం వహిస్తున్న వారు ఎవరు, గత ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారి వివరాలపై  సబ్‌ డివిజన్‌ అధికారులతో జాబితాలు సిద్ధం చేయించారు.  

అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి..
జిల్లాలో బాగా ఘర్షణలు చోటు చేసుకునే పోలీసు సబ్‌డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా ఆళ్లగడ్డ, నంద్యాల, బనగానపల్లె, పాణ్యం, డోన్, పత్తికొండ, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమస్యాత్మక వ్యక్తులు, ఫ్యాక్షన్‌ ప్రభావిత గ్రామాలకు సంబంధించిన జాబితా ఇప్పటికే రూపొందించారు. ఆయా ప్రాంతాల్లోని గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రౌడీషీటర్లు ప్రతి వారం స్టేషన్‌కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సిబ్బందికి గ్రామాలను దత్తత ఇచ్చి పూర్తిస్థాయి సమాచారం తెప్పించుకుంటున్నారు. 

బైండోవర్లకు ఆదేశం..
పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో రౌడీషీటర్లు, సమస్యలను సృష్టించే వారిని ముందస్తు బైండోవర్లు చేయాలని ఎస్పీ ఆదేశించారు. గ్రామాల్లో ఏ అలజడి జరిగినా వెంటనే స్టేషన్లకు తెలిసేలా సమాచార సేకరణకు కొందరిని వేగులను పెట్టుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతల ఫోన్‌ నంబర్లు, బరిలోకి దిగే అభ్యర్థుల జాబితా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.    

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి..
ఎన్నికల బందోబస్తు కోసం 5వేల మంది సిబ్బందిని సిద్ధం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి 2,401 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఇందులో 781 పోలింగ్‌ కేంద్రాలు అత్యంత సమస్యాత్మక, 709 కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అలాగే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 2,820 అత్యంత సమస్యాత్మక, 2,770 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు. మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి 302 అత్యంత సమస్యాత్మక, 288 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు.అక్రమ మద్యం, డబ్బు పంపిణీని అరికట్టేందుకు 42 చెక్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు