అమ్మా... ఎక్కడమ్మా

31 Jul, 2019 09:06 IST|Sakshi
తాటిపాకలో గుర్తించిన రెండేళ్ల చిన్నారి 

బిక్కుబిక్కుమంటూ పాపం... పసిబిడ్డ...

తాటిపాక సెంటరులో వదలివెళ్లిన వైనం

రెండేళ్ల బాలికను సంరక్షించిన అధికారులు 

కాకినాడ శిశువిహార్‌కు తరలింపు

ఎవరితో వచ్చిందో... ఎందుకు వదిలి వెళ్లారో... అందరూ తన చుట్టూ ఎందుకు గుమిగూడారో... ఈ పోలీసుల హడావుడి ఏమిటో తెలియని అమాయకత్వం. వచ్చీ రాని మాటలతో తన వివరాలుగానీ, తల్లిదండ్రుల సమాచారం కానీ, కనీసం ఊరూ పేరు కూడా చెప్పలేకపోవడంతో ‘కంటేనే అమ్మ, నాన్నలు కాదు మనసున్న మేమూ తల్లిదండ్రులమే’నంటూ అక్కున చేర్చుకున్నారు పిల్లలు లేని ఓ దంపతులు. చట్టప్రకారం దత్తత తీసుకోవాలే తప్ప ఇలా కాదంటూ పోలీసు స్టేషన్లో కొంతసేపు ఉంచి...తరువాత కాకినాడలోని శిశువిహార్‌కు అప్పగించారు. అమ్మా...ఎక్కడమ్మా అంటూ ఆ చిన్నారి ఏడుస్తూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తోంది.

సాక్షి, తూర్పుగోదావరి : అమాయకపు చూపులతో.. అటు.. ఇటూ.. వెళ్లే వారిని చూస్తూ... తాటిపాక సెంటరులోని షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న గుర్తు తెలియని రెండేళ్ల చిన్నారిని మంగళవారం రాజోలు పోలీసులకు స్థానికులు అప్పగించారు. ఆ బాలికను ఎస్సై ఎస్‌.శంకర్‌ రాజోలు ఐసీడీఎస్‌ సీడీపీఓ వై.కె.డి.రమాదేవికి అప్పగించారు. దీంతో బాలికను సీడీపీఓ రమాదేవి కాకినాడ శిశువిహార్‌కు తీసుకుని వెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాటిపాక సెంటరులోని విక్టరీ బజార్‌ సమీపంలో గత రెండు రోజులుగా ఓ రెండేళ్ల పాప వర్షంలో తడుస్తూ ఏడుస్తుండగా మాజీ ఎంపీటీసీ గెడ్డం సురేష్, దళిత నాయకుడు బొంతు మణిరాజులు గుర్తించారు. పాపను చేరదీసి ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూశారు. చిన్నారి చిరునామా తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేసినా ఫలి తం లేకపోవడంతో పొదలాడకు చెందిన డ్రైవర్‌ రాజు ఇంటి వద్ద పెట్టారు. ‘అమ్మ కావాలని, అమ్మా ఎక్కడున్నావంటూ అప్పుడప్పుడూ విలపిస్తోంది.

‘తనకు పిల్లలు లేరని, పాపను దత్తత తీసుకుంటా’నని రాజు చెప్పగా...దత్తత తీసుకునేందుకు ఇది సరైన మార్గం కాదని సురేష్, మణిరాజులు చెప్పి రాజోలు ఎస్సై శంకర్‌కు అప్పగించారు. పాప సమాచారం తెలిసే వరకు పాపను ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో క్షేమంగా ఉంటుందని ఎస్సై వివరించారు. పాప ఆచూకీ తెలిసిన వారు రాజోలు పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఐసీడీఎస్‌ సీడీపీఓ రమాదేవి, సూపర్‌వైజర్లు డి.ప్రసన్నరాణి, కె.చంద్రకళ, అంగన్‌వాడీ యూనియన్‌ లీడర్‌ పి.అన్నపూర్ణలు చిన్నారిని కాకినాడ శిశువిహార్‌కు తీసుకుని వెళ్లారు.

>
మరిన్ని వార్తలు