తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

30 Jan, 2020 10:19 IST|Sakshi

సాక్షి, గుత్తి: ఇంట్లో చెప్పా పెట్టకుండా వెళ్లిపోయిన ముగ్గురు విద్యార్థుల ఆచూకీని సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా పోలీసులు కనుగొన్నారు. కర్ణాటక రాష్ట్రంలో తిరుగుతున్న పిల్లలను గుర్తించి పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి. లచ్చానుపల్లికి చెందిన వంశీ, నరసింహారెడ్డి, రాజేష్‌లు ఈ నెల 24న ఇంట్లోంచి వెళ్లిపోయారు. తల్లిదండ్రులు సమీప పరిసరాలు, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించక పోవడంతో ఈ నెల 25న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు విద్యార్థులూ నేరుగా తిరుపతికి చేరుకొని శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లారు.

అయితే వారి వద్ద ఆధార్‌కార్డులు లేకపోవడంతో తిరుమలలో దర్శనానికి అనుమతించలేదు. చేసేదిలేక వారు రైలు ఎక్కి నేరుగా కర్ణాటక రాష్ట్రం బళ్లారికి వెళ్లారు. వీరిలో నరసింహారెడ్డి తండ్రి సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావడంతో.. టవర్‌ లొకేషన్‌ ఆధారంగా బళ్లారిలో ఉన్నట్లు తెలుసుకుని ఎస్‌ఐ ఇబ్రహీం తన సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రైల్వే స్టేషన్‌ వద్ద తచ్చాడుతుండగా గమనించి గుత్తి పోలీసుస్టేషన్‌కు తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు, 1098 చైల్డ్‌లైన్‌ సభ్యులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి వారికి పిల్లలను అప్పగించారు. పోలీసులకు విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.    

>
మరిన్ని వార్తలు