మూడో రోజూ కొనసాగిన వేధింపుల పర్వం

3 Oct, 2018 13:50 IST|Sakshi
సీఐ లక్ష్మణ్‌తో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు, న్యాయవాదులు

వైఎస్సార్‌ సీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి గంటల పాటు కూర్చోబెట్టిన పోలీసులు

ఆందోళనకు దిగిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు

పోలీస్‌స్టేషన్‌ ఎదుట బైఠాయింపు

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో నాయకులను పంపించిన వైనం

గుంటూరు :తెనాలిరూరల్‌ వైఎస్సార్‌ సీపీ నాయకులపై ‘అధికార’ వేధింపులు మూడో రోజూ కొనసాగాయి. పురపాలక సంఘ కార్యాలయంలోకి అక్రమంగా ప్రవేశించారని మున్సిపల్‌ కమిషనర్‌ కె.శకుంతల ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్టీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారు. 41 నోటీస్‌ ఇచ్చి, స్టేషన్‌ బెయిల్‌పై పంపే అవకాశమున్నా, మూడు రోజులుగా స్టేషన్‌కు పిలిపించి, గంటల తరబడి వేచిచూసేలా చేసి, వేధిస్తుండటంపై వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పార్టీ నాయకులు చింకా సురేష్‌చంద్ర యాదవ్, అక్కిదాసు కిరణ్‌కుమార్, షేక్‌ దుబాయ్‌బాబు, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, కఠారి హరీష్‌పై 448, 186 రెడ్‌ విత్‌ 34 సెక్షన్‌ల కింద కేసు నమోద చేసిన పోలీసులు, అవి బెయిలబుల్‌ సెక్షన్‌లయినా, స్టేషన్‌ బెయిలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అంతటితో ఆగకుండ, వీరిని స్టేసన్‌కు పిలిపించి గంగల తరబడి వేచి చూసేలా చేసి, రాత్రికి పంపుతున్నారు. ఇదే పర్వం మంగళవారమూ కొనసాగడంతో పార్టీ కార్యకర్తలు స్టేషన్‌ ముందు ఆందోళనకు దిగారు. తమ నాయకులకు వెంటనే బెయిల్‌ ఇచ్చి పంపకపోతే ఆత్మహత్యకైనా సిద్ధమంటూ ధర్నా చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో స్టేషన్‌ ఎదుటే రోడ్డుపై బైఠాయించి, పోలీసులు, టీడీపీ నేతలు, ఎమ్మెల్యే ఆలపాటి రాజేందర్రప్రసాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

సీఐతో న్యాయవాదుల చర్చలు
సురేష్‌చంద్ర యాదవ్‌ న్యాయవాది కావడంతో, పోలీసుల వేధింపులు తెలుసుకున్న బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మందలపు వేణుగోపాలరావు, గుంటూరు కృష్ణ, బేతాళ ప్రభాకర్, జన్ను శివకుమార్, కేఎం విల్సన్, మధిర సురేష్, పరిపూర్ణారెడ్డి తదితర న్యాయవాదులు స్టేషన్‌కు వచ్చి సీఐతో మాట్లాడారు. వివాదం సద్దుమణిగేలా చొరవ చూపాలని కోరారు. బార్‌ అసోసియేషన్‌ బాధ్యులకు సమాచారమివ్వకుండ కేసు నమోదయిన పార్టీ నాయకులపై ఎటువంటి చర్యలు తీసుకోమని పోలీసులు తెలిపారు. అలాగే బెయిల్‌/రిమాండ్‌కు సంబంధించిన వ్యవహారం పూర్తి చేసిన అనంతరం పిలిపిస్తామని, అప్పుడు వస్తే సరిపోతుందని సీఐ చెప్పారు. అనంతరం నాయకులు స్టేషన్‌ బయటకు రావడంతో బైఠాయించిన వారు ఆందోళనను విరమించారు. న్యాయవాదినైన తనను వ్యక్తిగతంగా ఇబ్బందులకు గురి చేస్తే పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయవచ్చన్న టీడీపీ నాయకుల ఎత్తుగడకు పోలీసులు వత్తాసు పలకడం దురదృష్టకరమని సురేష్‌చంద్రయాదవ్‌ పేర్కొన్నారు. చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు