ఎన్నికల వేళ.. తస్మాత్‌ జాగ్రత్త..

16 Mar, 2019 12:32 IST|Sakshi

సాక్షి, ఎమ్మిగనూరు: ఎన్నికల వేళ పోలీసులకు విశేషాధికారాలు ఉంటాయి. వారనుకొంటే ఎంతటి నేరగాడినైనా ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది. చిన్న నేరాన్నీ ఉపేక్షించకుండా కట్టడిచేస్తే దాని ఫలితం ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాదవుతుంది. ఎన్నికలవేళ పోలీసుల అమ్ములపొదిలో అమరి ఉన్న అధికారాలను పరిశీలిస్తే.. 

సెక్షన్‌ 125(ఏ):  అభ్యర్థులు తమకు పడిన శిక్షలు..తమపై మోపిన నేరాలకు సంబంధించిన విచారణలు గోప్యంగా ఉంచటం నేరం. ఉద్దేశపూర్వకంగా గోప్యంగా ఉంచితే శిక్షార్హమే. దీనికి ఆరునెలలు జైలు.. జరిమానా.. రెండూ విధించవచ్చు. 

సెక్షన్‌ 126: ఎన్నికలకు 48 గంటలలోపు ఊరేగింపులు చేయడం, సమావేశాలు నిర్వహించటం, మీడియా ప్రకటనలు ఇవ్వడం, సంగీత కచేరీలు తదితర వినోద కార్యక్రమాలు నిర్వహించటం నేరం. దీనికి రెండు సంవత్సరాల వరకూ జైలు, జరిమానా, రెండూ విధించవచ్చు. 

సెక్షన్‌ 127(ఏ): పార్టీలు నిర్వహించే బహిరంగ సభలకు ఎవరైనా అడ్డంకులు సృష్టించటానికి ప్రయత్నించటం నేరం. ఘర్షణలు సృష్టించే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఆరునెలలు జైలుశిక్ష తప్పదు. 

సెక్షన్‌127: ప్రచురణకర్తల చిరునామా లేకుండా కరపత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రకటనలు ముద్రించటం నేరం. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు జిల్లా మెజిస్ట్రేట్‌ అనుమతితోనే జారీ చేయాలి. దీన్ని ఉల్లంఘిస్తే ఆరునెలలు జైలు, రూ.25వేలు జరిమానా చెల్లించక తప్పదు. 

సెక్షన్‌128: ఎన్నికల విధుల్లో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల ప్రక్రియకు చెందిన విషయాలను గోప్యంగా ఉంచాలి. ఉల్లంఘిస్తే మూడునెలలు జైలు తప్పదు. 

సెక్షన్‌ 129: ఎన్నిక విధుల్లో ఉన్న అధికారులు ఏపార్టీ అభ్యర్థికైనా అనుకూలంగా వ్యవహరించటం నేరం. నిబంధనలు అతిక్రమిస్తే ఆరునెలలు జైలు.. జరిమానా ఉంటుంది. 

సెక్షన్‌ 130: పోలింగ్‌ స్టేషన్‌కు100 మీటర్లలోపు ప్రచారం నిర్వహించటం, ఓటర్లను అభ్యర్థించటం, ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లేయొద్దని చెప్పడం నేరం. 

సెక్షన్‌ 131, సెక్షన్‌ 132: పోలింగ్‌ స్టేషన్‌లలో ఉన్నవ్యక్తులకు, ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఆగ్రహం తెప్పించేలా మెగాఫోన్లు, లౌడ్‌స్పీకర్‌లతో ధ్వనులు చేయటం నిషిద్ధం. అలాంటివారిని అరెస్టు చేయాల్సిందిగా ప్రిసైడింగ్‌ అధికారులు.. పోలీసు అధికారులకు సూచించవచ్చు. నిందితులకు మూడునెలలు జైలు, జరిమానా, రెండూ విధించవచ్చు. 

సెక్షన్‌ 134(ఏ): ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పార్టీలకు ఎన్నికల ఏజెంటుగా, పోలింగ్‌ కౌటింగ్‌ ఏజెంట్‌గా బాధ్యతలు నిర్వహించటం నేరం. అందుకుగాను మూడునెలలు జైలు తప్పదు. 

సెక్షన్‌ 134(బీ): ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుల అనుమతిపొందిన సాయుధ పోలీసులు మినహా ఎవ్వరూ ఆయుధాలు ధరించి పోలింగ్‌స్టేషన్‌ సమీపంలో సంచరించ కూడదు. పట్టుబడితే రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుంది. 

సెక్షన్‌ 165, 166 సీఆర్‌పీసీ: పోలీసులు వారెంట్లు లేకుండానే సోదాలు చేసే అధికారాన్ని ఈ సెక్షన్లు కల్పిస్తాయి. ఓటర్లకు పంపిణీ చేయటానికి ఎక్కడైనా డబ్బు, మద్యం, ఇతర బహుమతులను భద్రపర్చినట్లు సమాచారం వస్తే పోలీసులు వెంటనే సోదాలు నిర్వహిస్తారు. అనుమతిలేకుండా ఉంచిన ఆయా స్టాకును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేస్తారు. 

సెక్షన్‌ 353, 332, 186, 189, 190: ప్రకారం విధుల్లో ఉన్న ఉద్యోగులను నిరోధించటం, వారిపై దౌర్జన్యాలకు పాల్పడటం, దాడులు చేయటం వంటి చర్యలను నేరాలుగా పరిగణిస్తారు. ఎన్నికల నేపథ్యంలో కిడ్నాపులు, దాడులు, దౌర్జన్యాలు, హత్యాయత్నాలు, మారణాయుధాలు వినియోగించి దాడులకు పాల్పడటం, బాంబులు విసురుకోవడం చేస్తే..ఐపీసీతోపాటు ఆర్‌పీ యాక్టు, పోలీసు చట్టంలోని సెక్షన్‌లకింద కేసులు నమోదు చేస్తారు.  

మరిన్ని వార్తలు