నాగరాజులో..అంత విషమెందుకో..

31 Oct, 2017 15:30 IST|Sakshi

నేనే మోనార్క్‌’ అని రెచ్చిపోతున్న ఎస్సై 

దురుసుగా ప్రవర్తించడం ఆయనకున్న నైజం

గతంలో అనుచితంగా వ్యవహరించిన దాఖలాలెన్నో...

సాక్షి ప్రతినిధి, కాకినాడ :  పచ్చ ఖద్దరు వేసుకున్న నేతలు వివిధ రకాలుగా దౌర్జన్యాలకు దిగుతున్నారు ... ప్రత్యర్థులనే కాదు అధికారులను కూడా వదలకుండా దాడులకు దిగుతున్నారు ...వారు చేస్తే తప్పు కానప్పుడు నేను చేస్తే తప్పేంటీ? అని అనుకున్నారో ఏమో రామచంద్రపురం ఎస్సై నాగరాజు ఒక్కసారిగా విషం చిమ్మారు. ఇదేమీ ఆయనకు కొత్త కాదని గత చరిత్ర చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. గతంలో ఒకాయనను కారు పార్కింగ్‌ విషయంలో కాలర్‌ పట్టుకుని కొట్టుకుంటూ స్టేషన్‌కు లాక్కెళ్లారు. ఆ తర్వాత ఒక న్యాయవాది విషయంలో దురుసుగా ప్రవర్తించాడు. తాజాగా సమాజంలో గౌరవ ప్రతిష్టలున్న మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కుమారుడు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తన జులుం చూపించారు.  

 ఈ ఏడాది ఆగస్టు 30వ తేదీన ద్రాక్షారామకు చెందిన కుక్కల సూర్యశంకర నారయణ భార్య ఇతర కుటుంబ సభ్యులతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఇంటికి కారులో ద్రాక్షారామ వెళుతున్నారు. అప్పట్లో రామచంద్రపురంలో రోడ్డు అభివృద్ధి పనులు కూడా జరగడం లేదు. ప్రధాన రహదారిలో కారును రోడ్డుకు పక్కగా తీసి ఆపారు. ఇంతలో అటుగా వచ్చిన ఈ ఎస్సై నాగరాజు కారును తీయాలని హుకుం జారీ చేశాడు. కారు పక్కగానే ఉందని, షాపులోకి తమవారు వెళ్లారని, వారు వచ్చిన వెంటనే తీసి వేస్తానని చెప్పేలోగానే సూర్యశంకర నారాయణ కాలర్‌ పట్టుకుని కొట్టుకుంటూ స్టేషన్‌కు లాక్కెళ్లారు. 

♦ ఇదే తరహాలో పట్టణానికి చెందిన ఒక లాయర్‌ విషయంలోనూ దురుసుగా ప్రవర్తించినట్లు చెబుతున్నారు. అనుచితంగా ప్రవర్తించడం తనకో ట్రాక్‌ రికార్డ్‌గా భావిస్తున్నాడేమో తెలియదుగానీ ... ఆ తరహాలోనే దురుసుగా ప్రవర్తిస్తూ   వివాదస్పదంగానే వ్యవహరించడం రివాజుగా మారిపోయింది.   

స్టేషన్‌కు వచ్చేవారితో మర్యాదగా నడుచుకోవాలని ఓ వైపు పోలీసు ఉన్నతాధికారులు హితబోధలు చేస్తున్నా నాగరాజు తరహా అధికారులకు చెవికెక్కడం లేదనడానికి ఆదివారం రాత్రి జరిగిన ఘటనే ఓ ఉదాహరణ. చేతిలో లాఠీ ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తనకెవరూ అడ్డు కాదని...కర్కశంగా వ్యవహరిస్తున్నారు. తప్పు చేస్తే ఓకే...ఏదీ లేనప్పుడు...కేవలం కారు పార్కింగ్‌ విషయంలో చేయి చేసుకోవడం... కాలర్‌ పట్టుకుని స్టేషన్‌కు ఈడ్చుకెళ్లడం.. లాఠీ విరిగేలా కొట్టడం చూస్తే నాగరాజులో పేరుకుపోతున్న విషాన్ని పట్టి పిండేయకపోతే సమాజానికే తీవ్ర విఘాతం కలిగిస్తుందని ప్రజాస్వామ్యవాదులు హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వార్తలు