బరితెగించిన దామచర్ల

12 Apr, 2019 09:11 IST|Sakshi
ఒంగోలులోని అగ్జిలియం పోలింగ్‌ బూత్‌ వద్ద దామచర్ల, అతని అనుచరుల అరాచకాలను అడ్డుకునేందుకు మొహరించిన బాలినేని, అతని వర్గీయులు

పోలింగ్‌ సమయం దాటాక కూడా ఓటర్లను అనుమతించాలంటూ అధికారులపై రుబాబు

పచ్చచొక్కాలు వేసుకున్నట్లుగా వ్యవహరించిన పోలీసులు

ఉద్రిక్తత నడుమ రాత్రి పొద్దుపోయేంత వరకు కొనసాగిన పోలింగ్‌

సాక్షి, ఒంగోలు సిటీ: టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఆ పార్టీ ఒంగోలు అసెంబ్లీ అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ బరితెగించారు. గురువారం ఉదయం ఒకవైపు పోలింగ్‌ జరుగుతుండగానే.. మరోవైపు ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. రాత్రివేళ పోలింగ్‌ సమయం మించిపోయినప్పటికీ ఓటర్లను అనుమతించాలంటూ పోలింగ్‌ అధికారులపై రుబాబు చేశారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్సు సమీపంలో గల అగ్జిలియం స్కూలు వద్ద జరుగుతున్న ఈ విషయం గురించి తెలుసుకున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో వెంటనే అక్కడకు చేరుకున్నారు.

దామచర్ల, అతని వర్గీయులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. పోలీసులను కూడా దామచర్ల తనవైపు తిప్పుకోవడంతో డీఎస్పీలు రాధేష్‌ మురళి, శ్రీనివాసాచారి అత్యుత్సాహం ప్రదర్శించారు. దామచర్లకు దాసోహమై వైఎస్సార్‌ సీపీ నాయకులపై మాత్రమే విచక్షణా రహితంగా లాఠీచార్జి చేశారు. టీడీపీ నాయకులను మాత్రం బుజ్జగిస్తూ పక్కకు పంపి తీవ్ర విమర్శల పాలయ్యారు. దామచర్ల, టీడీపీ నాయకులతో పాటు డీఎస్పీల తీరుతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. గురువారం అర్ధరాత్రి వరకు అదే పరిస్థితి కొనసాగింది.

అసలేం జరిగిందంటే...
ఒంగోలు నగరంలోని గోరంట్ల కాంప్లెక్సు సమీపంలో అగ్జిలియం స్కూలు ఉంది. ఇక్కడ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ ముందుగా పోలింగ్‌ కేంద్రాల వద్దకు వెళ్లి తన అనుచరుల ద్వారా ఆ సమీపంలోని ముస్లింలను ప్రలోభాలకు గురిచేశారు. బుధవారం రాత్రి వీలు కాకపోవడంతో డబ్బు పంచలేకపోయామని, ఇప్పుడు డబ్బులిస్తామని, వెళ్లి టీడీపీకి ఓటేయాలని ఒత్తిడి చేశారు. అంతటితో ఆగకుండా అగ్జిలియంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న సమయంలో అక్కడ ఒక బూత్‌లో టీడీపీ ఏజెంటు లేడని, పోలింగ్‌ ఆపాలని అధికారిపై ఒత్తిడి తెచ్చారు. దీంతో బెదిరిపోయిన పీవో పోలింగ్‌ ఆపారు.

అక్కడే తిష్టవేసి ఇష్టారాజ్యంగా దామచర్ల వ్యవహరించడంతో సమాచారం అందుకున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆ పార్టీ నాయకులు కాకుమాను రాజశేఖర్, శింగరాజు వెంకట్రావు, ధూళిపూడి ప్రసాద్‌ తదితరులు అక్కడకు చేరుకున్నారు. ఆ సమయంలో దామచర్ల పోలింగ్‌ కేంద్రంలోనే ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న డీఎస్పీలు రాథేల్‌మురళి, శ్రీనివాసాచారిలు అక్కడికి చేరుకున్నారు. బాలినేని, దామచర్ల, వారి వర్గీయులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు.

దామచర్ల, అతని వర్గీయులు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, పోలింగ్‌ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని, ఇక్కడి నుంచి వారు వెళ్తేనే తాము కూడా వెళ్తామని బాలినేని, అతని అనుచరులు స్పష్టం చేశారు. పోలీసుల ఒత్తిడితో ఇద్దరు నాయకులతో పాటు వారి అనుచరులు బయటకు వచ్చి వాహనాలు తీశారు. అయితే, దామచర్ల, అతని అనుచరులు వారి వాహనాలను బాలినేని వాహనాలకు అడ్డంగా ఉంచి పక్కకు తీసే అవకాశం ఉన్నా తీయకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

వైఎస్సార్‌ సీపీ నాయకులపై మాత్రమే లాఠీచార్జి...
బాలినేని, దామచర్ల, వారి వర్గీయులు అక్కడి నుంచి వెళ్లకపోవడంతో డీఎస్పీలు, పోలీసులు లాఠీచార్జికి దిగారు. సమస్య వచ్చింది దామచర్ల కారణంగా అని, వారిని ముందుగా పంపించాలని బాలినేని వారిస్తున్నా వినిపించుకోకుండా వైఎస్సార్‌ సీపీ నాయకులపై మాత్రమే పోలీసులు లాఠీలతో దాడి చేశారు. తీవ్ర అసభ్యకర పదజాలంతో మహిళలపై సైతం విరుచుకుపడ్డారు. గొడవ ముదురుతుందని భావించిన దామచర్ల, అతని వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

రాత్రివేళ మళ్లీ ఉద్రిక్తత...
గురువారం రాత్రి స్థానిక వెంకటేశ్వరకాలనీలో దామచర్ల జనార్దన్‌ సోదరుడు సత్య పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభపెట్టారు. ఓటర్లకు డబ్బులిస్తున్నట్లుగా బాలినేనికి సమాచారం అందడంతో తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ సత్య అనుచరులతో వాగ్వాదం జరిగింది. పోలీసులు కల్పించుకోవడంతో సత్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. మళ్లీ అగ్జిలియం వద్ద దామచర్ల జనార్దన్‌ పీవోతో గొడవ పడుతున్నారని సమాచారం అందడంతో బాలినేని వెంటనే అక్కడికి వెళ్లారు. పోలింగ్‌కు సమయం ముగిసిన తర్వాత కూడా ఓటర్లను అనుమతించాలని పీవోపై దామచర్ల ఒత్తిడి చేస్తున్నారు. సమయంలోగా స్లిప్పులు పొందిన వారిని మాత్రమే అనుమతిస్తామని పీవో తెలిపారు. ఆ సమయంలో బాలినేని వెళ్లడంతో ఇరువర్గాల మధ్య మళ్లీ గొడవ జరిగింది. రాత్రి పోలింగ్‌ అయ్యేంత వరకు అగ్జిలియం వద్దనే రెండువర్గాలు తిష్టవేశాయి. పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారు. రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఉద్రిక్తత మధ్యే పోలింగ్‌ జరిగింది.


 

మరిన్ని వార్తలు