14వేలమంది రక్తదానం చేశారు!

20 Oct, 2019 10:50 IST|Sakshi

సాక్షి, విజయవాడ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రామవరప్పాడులోని శుభమ్ కళ్యాణ మండపంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు పోలీసు విభాగాల్లో సిబ్బంది పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. రక్తదాతలను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించామని, మొత్తం 14వేలమంది రక్తదానం చేశారని డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. తొమ్మిదివేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారని చెప్పారు.ప్రజలకు ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు పోలీసులు ప్రాణత్యాగానికి కూడా వెనకాడరని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. జర్నలిస్టులపై ఎవరు దాడి చేసినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

అంతకుముందు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం 3కే రన్ నిర్వహించారు. విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో నిర్వహించిన ఈ రన్‌లో భారీగా చిన్నారులు, యువత పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీపీ ద్వారకా తిరుమలరావు నగదు బహుమతితోపాటు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరాగాంధీ మున్సిపల్  స్టేడియంలో స్మృతి పరేడ్‌ను నిర్వహించనున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోపాటు హోంమంత్రి, డీజీపీ పాల్గొంటారని స్పష్టం చేశారు.
 

1959లో అమరులైన సీఆర్పీఎఫ్ పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, ఈ నెల 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నన్నామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందులో భాగంగా 15,16 తేదీల్లో ఓపెన్ హౌస్‌లు, వెపన్స్ ప్రదర్శన, డాగ్ షో వంటి కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల కోసం, వారి రక్షణ కోసమే మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని ఈ వారోత్సవాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. పోలీసులపై  ఉన్న అపోహలను పోగొట్టాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు.

మరిన్ని వార్తలు