పాపం పోలీసు!

30 May, 2016 01:01 IST|Sakshi
పాపం పోలీసు!

రాజధాని నేపథ్యంలో తీవ్రమైన పని ఒత్తిడి
నిత్యం వీఐపీల పర్యటనలు, ఎక్కడో చోట ఆందోళనలు
గుంటూరులో ఊహించని రీతిలో పెరిగిన ట్రాఫిక్
అమలులోకి రాని వారాంతపు సెలవు ప్రకటన
సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టుల్లో పలు ఖాళీలు
నిలిచిపోయిన కొత్త పోలీస్‌స్టేషన్‌ల ప్రతిపాదనలు


నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న పోలీసులు రాజధాని పుణ్యమా అంటూ ప్రస్తుతం పరుగులు తీయాల్సి వస్తోంది. సుమారు ఏడాదిన్నర కాలం నుంచి జిల్లాకు చెందిన పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పని చేయాల్సి వస్తుందంటే అతిశయోక్తి కాదు. పెరిగిన పనిభారంతో రేయింబవళ్లు ఉక్కిరిబిక్కిరికి  లోనై సతమతమవుతున్నారు. పోలీసు ఉద్యోగమంటేనే కత్తిమీద సాములా మారిన పరిస్థితి రాజధానిలో నెలకొంది.

ఓ వైపు పెరిగిన నేరాల సంఖ్య, మరో వైపు ప్రముఖుల భద్రత కోసం క్షణం తీరిక లేకుండా డ్యూటీలు చేస్తున్నారు. కుటుంబం, వ్యక్తిగత జీవితంపై సైతం శ్రద్ధ కనబర్చే అవకాశం రాజధాని పోలీసులకు లేకుండా పోయింది. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా వారు మానసికంగా కుంగిపోతున్నారు.     - సాక్షి, గుంటూరు

 
సాక్షి, గుంటూరు : రాజధాని నిర్మాణ నేపథ్యంలో జిల్లా పోలీసుల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రధానంగా గుంటూరు నగరానికి పెరిగిన వీవీఐపీల తాకిడి, కలెక్టరేట్ వద్ద ప్రజా సమస్యలపై ఆందోళనలు, అనూహ్యంగా పెరిగిన నేరాలతో పోలీసులకు గతం కంటే పనిభారం అమాంతం గా పెరిగిపోయింది. రోజూ ప్రముఖుల రక్షణకోసం ఎండనక, వాననక తిరగాల్సి వస్తోంది. సీఎం రెస్ట్ హౌస్ వద్ద రోజుకొకరు చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో ఎక్కడ ఏ సంఘటన చోటుచేసుకున్నా అటువైపు పరిగెత్తాల్సి వస్తోంది. నగరంలో ఊహించని విధంగా పెరిగిన ట్రాఫిక్‌ను కట్టడి చేయాలంటే తలకుమిం చిన భారంగా మారుతోంది.ఇలా పోలీసు కష్టాలను చూసి అయ్యే పాపం అని జాలి చూపే వారే ఎక్కువ మంది ఉన్నారు.


 రాజధాని ప్రకటించినప్పటి నుంచే...
రాజధాని నిర్మాణం ప్రకటించినప్పటి నుంచి గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పోలీసులకు పనిభారం ఎక్కువైంది. అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిపైనే ఈ శ్రమంతా పడుతోంది. వారాంతపు సెలవులు ఇస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ సిబ్బంది కొరతతో అది ఆచరణకు నోచుకోలేదు. 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ ఎర్రటి ఎండలో సీఎం రెస్ట్ హౌస్ వద్ద, తాత్కాలిక రాజధాని నిర్మాణ ప్రాంతం వద్ద, వారికి కేటాయించిన పలు ప్రాంతాల్లో బందోబస్తులో విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు.

గుంటూరు అర్బన్ పరిధిలో 36 ఎస్.ఐ. పోస్టులు, ఎనిమిది హెడ్ కానిస్టేబుల్, 11 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెరిగిన పనిభారానికి తోడు సిబ్బందిని పెంచకపోగా, ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయకపోవడంతో ఆ పని భారమంతా పోలీసులపైనే పడుతోంది. రోజురోజుకు పెరిగిపోతోన్న భూ వివాదాలు, దోపిడీలు, దొంగతనాలు, కిడ్నాప్‌లు వంటి నేరాలు పోలీసు అధికారులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.


అటకెక్కిన కొత్తపోలీసు స్టేషన్‌ల ప్రతిపాదన
అర్బన్ జిల్లాతోపాటు, రూరల్ జిల్లాలోని కొన్ని పోలీసు స్టేషన్‌లతో కలిపి ప్రత్యేక పోలీసు కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలని గతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే గుంటూరు, విజయవాడలను కలిపి సీఆర్‌డీఏ ప్రాంతం మొత్తాన్ని గ్రేటర్ అమరావతి పోలీసు కమిషనరేట్‌గా చేయాలని కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు పట్టుబట్టడంతో దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి పోలీసు కష్టాలను తీర్చాలంటూ పలువురు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు