ఖాకీ వనం.. పచ్చపాతం

25 Feb, 2019 07:56 IST|Sakshi

మసక బారుతున్న పోలీసు ప్రతిష్ట

కేసుల పరిష్కారంలో పురోగతి శూన్యం

రాజకీయ నేతల ఒత్తిళ్లకు సలాం

ఏలూరులో హత్య దర్యాప్తుపై నిర్లక్ష్యం

పాత్రపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ ప్రజాప్రతినిధులఆదేశాలు శిరోధార్యంగా మారడం ఆరోపణలకు తావిస్తోంది. చట్టానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు పసుపు రంగు పులుముకుంటున్నారు. రాజ్యాంగ హక్కులు కాల రాస్తున్నారు. మొన్నటి కత్తుల రవికుమార్‌ నుంచి నిన్నటి కామిరెడ్డి నాని కేసుల వ్యవహారం వరకూ పోలీసుల పాత్రపై ప్రజలల్లో తీవ్రఅసంతృప్తి వ్యక్తమవుతోంది.

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌ : ఏలూరు రూరల్‌ ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం తల లేని మొండెం లభించింది. ఇది హత్యగా మృతుని బంధువులు ఆరోపిస్తూ పలువురిపై అనుమానాలు వ్యక్తం చేశారు. అయినా ఈ కేసు దర్యాప్తులో పురోగతి శూన్యం. సామాన్యులకు సంబంధించి పలు కేసులు పెండింగ్‌లో ఉన్నా పట్టించుకోని పోలీసులు ఏమాత్రం ప్రాధాన్యత లేని అంశాలపై మాత్రం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలకు రక్షణ కల్పించడం, న్యాయం చేయాల్సిన పోలీసులు ఇలా ‘పచ్చ’ పాతం చూపించటంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

నేతలకు తొత్తులుగా..
దళితులను కించపరుస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కనీసం కేసు కూడా పెట్టని పోలీసు అధికారులు.. చింతమనేని వ్యాఖ్యల వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినవైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దళిత నేత కత్తుల రవి, నవ వరుడు కామిరెడ్డి నానిపై కేసులు నమోదు చేయడంతో పాటు ‘పెద్దల’ ప్లాన్‌లను అమలుచేస్తూ అరెస్టుల హైడ్రామాలతో వేధింపులకు పాల్పడుతున్నారు. రాజకీయ ఒత్తిళ్లతో పక్కా ప్రణాళికతోనే వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నేతలను కేసులు, అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం 41 నోటీసు ఇచ్చి పంపాల్సిన కేసుల్లో రాజకీయ నేతల మెప్పు కోసం వ్యక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేసేలా వ్యవహరిస్తూ జులుం ప్రదర్శించటంతో పోలీసు వ్యవస్థ ప్రజల్లో పలుచనవుతోంది.

ఏలూరు హత్య దర్యాప్తులో పురోగతి ఏదీ ?
ఏలూరు పోణంగి ప్రాంతంలో నాలుగురోజుల క్రితం తలలేని మొండెం లభించింది. ఇది ఏలూరులో సంచలనంగా మారింది. మృతుడి తల భాగం ఇప్పటికీ లభ్యం కాలేదు. పోలీసు బృందాలు తల కోసం తీవ్రస్థాయిలో గాలిస్తున్నాయి. మృతుడు ఏలూరు వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన కంచి సతీష్‌గా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా హత్యకు సంబంధించి వన్‌టౌన్‌ ప్రాంతంలోని ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త, తమ్ముడి పాత్రపై మృతుడి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడికి తొమ్మిదేళ్ల క్రితం వివాహమైనా భార్య నుంచి విడిపోయి జీవిస్తున్నాడు. ఒకవేళ అటువైపు నుంచి ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలోనూ బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయినా పోలీసు అధికారులు మాత్రం ఇటువంటి కేసుల దర్యాప్తులో పురోగతి చూపకపోగా రాజకీయ ఒత్తిళ్లతో నాయకుల ఆదేశాలను పాటిస్తూ కేసులను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. 

మరిన్ని వార్తలు