ఖాకీలకు చిక్కని బుకీలు

25 Sep, 2019 10:01 IST|Sakshi

ఆన్‌లైన్, సెల్‌ఫోన్‌ల ద్వారానే క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహణ

కొందరు పోలీసు అధికారులకు భారీగా నెలవారీ మామూళ్లు 

ఒంగోలులో బెట్టింగ్‌ ముఠాను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కీలక బుకీలను పట్టలేకపోతున్న ఖాకీలు

సాక్షి, ఒంగోలు: సప్త వ్యసనాల్లో లేని కొత్త వ్యసనం ఒకటి దశాబ్ద కాలంగా రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంత యువతను పెడదోవ పట్టిస్తూ పీల్చిపిప్పి చేస్తోంది. ఆ వ్యసనం పేరే క్రికెట్‌ బెట్టింగ్‌. గత 15 ఏళ్ల క్రితం మొదలైన ఈ బెట్టింగ్‌ వ్యసనం మొదట్లో ఇండియా జట్టు ఆడే మ్యాచ్‌లకు మాత్రమే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ఆడేది వన్డే, టెస్ట్‌మ్యాచ్‌ అనే బేధం లేకుండా, ఆడేది మన జట్టా, విదేశీ జట్లా అనేది చూసుకోకుండా బెట్టింగ్‌ నిర్వహిస్తూనే ఉన్నారు. టి–20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్‌ జాఢ్యం బాగా ఊపందుకుంది. దీనికితోడు ఐపీఎల్‌ అంటూ ఒక సీజన్‌లో వరుసగా 90 నుంచి 100 మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టింగ్‌ జాఢ్యం మరింత ముదిరి పాకాన పడినట్లయింది. ప్రస్తుతం ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతుండటంతో జిల్లాలో బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఎక్కడో ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లో ఉండే బుకీలు ఆన్‌లైన్‌ ద్వారా తమ కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తమ తమ ఏజంట్ల ద్వారా బెట్టింగ్‌ నిర్వహిస్తూ ఈ వ్యసనాన్ని దేశవ్యాప్తం చేశారు.

విచారణలో జాప్యం.. అజ్ఞాతంలోకి కీలక బుకీలు..
ఒంగోలు నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారనే సమాచారంతో సుమారు 15 రోజుల క్రితం పోలీసులు ఓ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో రెండు విభాగాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా విచారణ ప్రారంభించారు. అయితే పోలీస్‌ అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల విచారణ ముందుకు సాగలేదు. దీంతో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించారు. విచారణలో జరిగిన జాప్యం వల్ల కీలక బుకీలు ఫోన్‌లు స్విచ్‌ ఆఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. బెట్టింగ్‌ ముఠా దొరగ్గానే వారి నుంచి సమాచారం సేకరించి దర్యాప్తు వేగవంతం చేసి ఉంటే కీలక బుకీలు దొరికే అవకాశం ఉండేది. ఇప్పటికైనా పోలీసులు క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతున్న కీలక బుకీలను పట్టి అత్యాశతో జీవితాలు కోల్పోతున్న యువతను రక్షించాలని పలువురు కోరుతున్నారు.

కీలక బుకీలను పట్టలేక పోతున్నారు...
ఎక్కడెక్కడో ఉంటూ గ్రామీణ ప్రాంతాలకు సైతం తమ బెట్టింగ్‌ను విస్తరించి కోట్లు గడిస్తున్న బుకీలను పోలీసు వ్యవస్థ ఏమి చేయలేకపోవడం శోచనీయం. ఆన్‌లైన్‌ ద్వారా అనేక మంది ఏజంట్లను పెట్టుకొని దేశవ్యాప్తంగా తమ బెట్టింగ్‌ దందాను నడుపుతున్న బుకీలను మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పోలీసు అధికారులు బుకీల నుంచి మామూళ్లు తీసుకుంటూ బెట్టింగ్‌లకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడే బుకీల మూలాలను కనిపెట్టి ఆటకట్టించాల్సిన పోలీసులు లాడ్జిలు, హోటళ్లు, టీస్టాల్స్, రెస్టారెంట్లలో చిన్న చిన్న బెట్టింగ్‌లు నిర్వహించే  యువకులను అదుపులోకి తీసుకొని వారిపై తూతూమంత్రంగా  కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

పట్టణ ప్రాంతాల్లో భారీగా బెట్టింగ్‌ నిర్వహించే ఏజంట్లను అదుపులోకి తీసుకొని వారిని విచారించి వారు ఎవరి వద్ద నుంచి లైన్‌ తీసుకొని బెట్టింగ్‌ నిర్వహిస్తున్నారో కనుగొని తద్వారా తీగలాగుతూ డొంకను కదిలించాల్సిన పోలీసు అధికారులు మాకేం పట్టిందిలే అనుకుంటూ దొరికిన వారిపై చోటా మోటా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై పోలీసు, ఇంటిలిజెన్స్‌ రాష్ట్ర ఉన్నతాధికారులు దృష్టి సారించి బెట్టింగ్‌ మహమ్మారిని కూకటి వేళ్ళతో పెకిలించకపోతే ఎందరో యువకులు బలి కావడంతోపాటు వారి కుటుంబాలు రోడ్డునపడే ప్రమాదం ఉంది.

గ్రామీణ ప్రాంతాలకూ పాకిన జాఢ్యం..
మొదట్లో నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ బెట్టింగ్‌ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు సైతం పాకడంతో, ఈ వ్యసనానికి బానిసలైన యువత భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారుతుంది. క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహించే బుకీల వద్ద నుంచి వారి ఏజంట్లు, క్రికెట్‌ బెట్టింగ్‌లాడే యువత వరకు వీరందరిలో క్రికెట్‌ అంటే తెలిసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారనేది ఆశ్చర్యం కలిగించే విషయం. క్రికెట్‌ బెట్టింగ్‌లు ఆడేవారిలో బడా వ్యాపారుల కుమారులే కాకుండా ప్రైవేట్‌ కంపెనీలు, చిన్నచిన్న షాపుల్లో గుమస్తాలుగా పనిచేస్తున్న యువకులు, విద్యార్థులు, చివరకు పొలం పనులు చేసుకునే యువ రైతులు సైతం ఈ బెట్టింగ్‌ మహమ్మారి బారిన పడి తమ జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాల్లో నుంచి క్రికెట్‌ బుకీలు ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు నిర్వహిస్తూ జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల యువతను ఆకర్షిస్తూ బెట్టింగ్‌ మహమ్మారిని విస్తరిస్తున్నారు. ఈ బెట్టింగ్‌ మహమ్మారికి ఎంతో మంది యువకులు తీవ్రంగా నష్టపోయి కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు బెట్టింగ్‌ల్లో సర్వం కోల్పొయి ఉన్న అప్పులు చెల్లించలేక ఊరు వదిలి పరారై అజ్ఞాతంలో జీవనం సాగిస్తున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.  

మరిన్ని వార్తలు