ఆయన రూటే సప'రేటు'

9 Mar, 2017 15:35 IST|Sakshi


►ముందు దాడులు.. ఆపై దందాలు
► అడిగింది ఇవ్వకుంటే చితకబాదుడే
► చీరాల టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ అధికారి నిర్వాకం


చీరాల : చీరాల టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒక దిగువస్థాయి అధికారి రూటే సపరేటుగా ఉంది. అ స్టేషన్‌కు సీఐ (ఎస్‌హెచ్‌వో)గా ఎవరు వచ్చినప్పటికీ ఆయన దందాలకు మాత్రం అడ్డూ అదుపూ లేదు. కేసు ఏదైనా ఆయన అడిగింది ఇవ్వాల్సిందే. ముందు దాడులు చేస్తాడు. తీవ్రంగా వేధిస్తాడు. అన్ని విధాలుగా బెదిరింపులకు పాల్పడతాడు. ఆపై నెలవారీ వసూళ్లు చేయడం ఆయన ప్రత్యేకత. క్రికెట్‌ బెట్టింగ్, పేకాట శిబిరాలు నడిపేవారే ఆయనకు స్నేహితులు. ఆయన ఏ కేసుల్లో పట్టుకున్నా బాధితుల జేబులు ఖాళీ అవ్వాల్సిందే. పేరుకు యువ అధికారి అయినప్పటికీ వసూళ్లలో మాత్రం ముందుంటాడు. కొన్ని గృహాల్లో గుట్టుచప్పుడు కాకుండా జరిగే వ్యభిచారంపై నిఘాపెట్టి అర్ధరాత్రి దాడులు చేస్తాడు. అందులో పెద్ద తిమింగలాలను వదిలి వ్యభిచారులను మాత్రమే స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా వేధించి కేసులు పెట్టిస్తాడు. పెద్ద తిమింగలాల వద్ద పెద్ద మొత్తంలో గుంజుతాడు. అయితే ఈయన మాత్రం మహా ముదురు. తన అక్రమాలు బయటపడకుండా మరొకరిపైకి నెట్టడంలో ఆయన దిట్ట.

వేధింపులతో మహిళ ఆత్మహత్యాయత్నం...: ఇటీవల చీరాలలోని కొత్తపేట గోపాల్‌నగర్‌లో అర్ధరాత్రి ఒక నివాసంపై దాడిచేసి నాగజ్యోతి అనే మహిళను ఇదే అధికారి స్టేషన్‌కు తీసుకొచ్చాడు. ఆమెను అన్ని విధాలుగా వేధించాడు. వేధింపులు తట్టుకోలేక ఆ మహిళ పోలీసుస్టేషన్‌ నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ఆమెకు వెన్నుపూస విరిగింది. అయితే దానిని కూడా బయటకు రాకుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు ఆ అధికారి. ప్రమాదానికి గురైన మహిళను ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లకుండా చీరాల్లోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించాడు. అయితే స్టేషన్‌కు తీసుకొచ్చిన మహిళ విషయాన్ని సెంట్రీ బుక్కులో కూడా ఎంట్రీ చేయలేదు. ఆమె పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వేధించిన ఘటనలో సీఐ ఫిరోజ్‌ బలయ్యాడు. ఆయనపై సస్పెన్షన్‌ వేటు పడింది.

క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల ద్వారా లక్షల వసూళ్లు.. : ఈ యువ అధికారి క్రికెట్‌ బెట్టింగ్‌ బాబులతో సాన్నిహిత్యంగా వ్యవహరించి లక్షల రూపాయలు సంపాదించినట్లు సమాచారం. టీడీపీకి చెందిన ఓ స్థానిక కౌన్సిలర్‌ తనయుడు క్రికెట్‌ బెట్టింగులు నిర్వహిస్తుంటాడు. అతని ద్వారా పేరాల ప్రాంతంతో పాటు ఇతర ప్రాంతాలలో బెట్టింగ్‌ నిర్వహించే వారినుంచి నెలవారీ మామూళ్లు పెద్ద ఎత్తున వసూలు చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి.

స్వాధీనం చేసుకున్న సొమ్ము స్వాహా...: ఇటీవల వడ్డె సంఘంలో బొమ్మా బొరుసు ఆడుతున్న స్థావరంపై అర్ధరాత్రి దాడిచేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం రూ.6 లక్షలకుపైగా దొరికినట్లు సమాచారం. కానీ కోర్టుకు చూపింది మాత్రం రూ.1.3 లక్షలు మాత్రమే. మిగిలిన మొత్తాన్ని ఈ యువ అధికారి, కొందరు సిబ్బంది స్వాహా చేశారు. అయితే బొమ్మా బొరుసు కాకుండా పేకాటగా మార్చి కోర్టుకు పెట్టారు. ఈ విషయంపై జిల్లా పోలీసు బాస్‌తో పాటు చీరాల డీఎస్పీకి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఈ ఘటనకు సంబంధించి రెండు రోజులు విచారణ కూడా జరిపారు. నేరుగా డీఎస్పీనే నిందితులతో ప్రత్యేకంగా విచారించారు కూడా. చివరకు స్పెషల్‌ బ్రాంచ్‌ విచారణ జరిగింది. అయినా ఈ అధికారిపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ అధికారికి పైస్థాయిలో అండదండలున్నాయనే ప్రచారం ఉంది. ఇవే కాకుండా అనేక ప్రైవేటు కేసుల్లో జోక్యం చేసుకుని ప్రాంతానికి ఒకరిద్దరు వ్యక్తులను, కొందరు హోంగార్డులను పెట్టుకుని సెటిల్‌మెంట్లు చేయడం ఆయనకు నిత్యకృత్యంగా మారింది. ఈ అధికారి కారణంగా ఆ స్టేషన్‌కు బాధితులు వెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికైనా ఆ అధికారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు