‘మీపై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం’

17 Mar, 2020 17:50 IST|Sakshi

సాక్షి, గుంటూరు : మాచర్ల దాడి ఘటనలో టీడీపీ నేతలపై పోలీసు అధికారుల సంఘం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు జిల్లాలో పర్యటించే ముందు నేతలు పోలీసులకు సమాచారం ఇస్తే రక్షణ కల్పించాల్సిన బాధ్యత తమపై ఉంటుందని అన్నారు. మంగళవారం జిల్లాలో పోలీసు అధికారుల సంఘ సభ్యులు బాలమురళికృష్ణ, మాణిక్యాలరావు, బేబీ రాణి మాట్లాడుతూ.. పోలీసులకు ముందుగానే సమాచారం అందించామని బోండా ఉమా, బుద్దా వెంకన్న మాట్లాడుతున్నారని, అలా మాట్లాడటం సమంజసం కాదని తెలిపారు. మాచర్లలో దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న స్థానిక సీఐ ఘటనా స్థలానికి చేరుకుని, దాడి నుంచి నేతలను కాపాడారని తెలిపారు. 

పోలీసులు వాహనంలో రాజకీయ నాయకులను ఎక్కించుకోకూడదని తెలిసినా వారి ప్రాణాలు కాపాడేందుకు పోలీస్ వాహనంలో నాయకులను తరలించామన్నారు. తమ ప్రాణాలకు తెగించి నాయకుల ప్రాణాలను కాపాడామని పేర్కొన్నారు. ప్రాణాలు కాపాడిన పోలీసులపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యే పోలీసులకు పోస్టింగ్‌లు వేశారని మాట్లాడుతున్నారన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే పోస్టింగ్‌లు ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు. రిపోర్టు ఇవ్వమంటే బాధితులు ఇవ్వలేదని, సుమోటాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

‘‘పోలీసులపై బురద చల్లవద్దు. రాజకీయ పార్టీలకు అంటగడుతూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేయవద్దు. పోలీసులు నాయకుల ప్రాణాలను కాపాడినా.. నింధించడం బాధ కలిగించింది. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం వలనే ఆ రోజు గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళగలిగారు. పోలీసులు లేకుంటే నేడు మీరు బ్రతికి ఉండే వాళ్ళు కాదు. రాజకీయ నాయకులు పోలీసులపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదు. మీ పై కేసులు పెట్టడానికి కూడా వెనుకాడము’ అని పోలీసు అధికారుల సంఘ సభ్యులు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు