ఆ డైరీలో ఏముంది?

23 Jun, 2014 02:00 IST|Sakshi
ఆ డైరీలో ఏముంది?

మార్కాపురం : మావోయిస్టు జానా బాబూరావు డైరీలో ఉన్న అంశాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉన్న వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. నల్లమల మురారి కురవ వద్ద ఈ నెల 19న జరిగిన పోలీసుల ఎన్‌కౌంటర్‌లో జానా బాబూరావు, కవిత, నాగమణి అనే మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. సంఘటన స్థలంలో గ్రేహౌండ్స్ పోలీసులు ఒక డైరీని స్వాధీనం చేసుకున్నారు.
 
 అది జానా బాబురావుదిగా గుర్తించారు. డైరీలో ఉన్న వివరాలపై జిల్లా పోలీసు ఉన్నతాధికారులు లోతైన విశ్లేషణ చేస్తున్నారు. బాబూరావు గతంలో నల్లమల కార్యదర్శిగా పనిచేసిన శాఖమూరి అప్పారావుకు గన్‌మెన్‌గా వ్యవహరించినట్లు గుర్తించారు. బాబూరావు కోసం ప్రకాశం, గుంటూరు పోలీసులు 2010 నుంచి నల్లమలలో కూంబింగ్ నిర్వహిస్తున్నా ఆయన తప్పించుకు తిరుగుతున్నాడు.

ఇద్దరు మహిళా మావోయిస్టులతో కలిసి బాబూరావు ఎన్నికలకు ముందు యర్రగొండపాలెం, పుల్లలచెరువు ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లు అంటించాడని అప్పట్లో పోలీసుల దర్యాప్తులో తేలింది. బాబూరావు తన ఉనికిని కాపాడుకుంటూ నల్లమలలో అత్యంత జాగ్రత్తగా సంచరించాడు. ఈ మూడేళ్లలో చెంచు గూడేల్లో మావోయిస్టు సానుభూతిపరులను తయారు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఒక ఏకే 47, ఎస్‌ఎల్‌ఆర్ , 303 తుపాకీ, 9ఎంఎం కార్బన్ తుపాకీ, రెండు కత్తులు, రెండు గొడ్డళ్లు, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 
పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలివీ..
బాబూరావు వాడిన సెల్‌ఫోన్ డేటా కూడా పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా సిమ్ కార్డు ఎవరి పేరుపై ఉంది? రీచార్జి కార్డులు ఎలా వస్తున్నాయి? ఇప్పటి వరకు ఎవరెవరికి బాబూరావు సెల్‌ఫోన్ నుంచి కాల్స్ వెళ్లాయి? మూడేళ్ల నుంచి జీవనం గడిపేందుకు అవసరమైన ఆర్థిక సాయం ఎవరు చేశారు? నిత్యావసరాలు ఎలా వచ్చాయి? యర్రగొండపాలెం, పుల్లలచెరువు, దోర్నాల, త్రిపురాంతకం ప్రాంతాల నుంచి ఎవరైనా రహస్యంగా సహకరిస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాల కోసం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
 
నల్లమలపై పూర్తి పట్టు
జానాబాబూరావు కిట్ బ్యాగ్‌లో ఓ మ్యాప్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. నల్లమలపై పూర్తి పట్టున్న బాబూరావు మూడేళ్ల నుంచి గ్రేహౌండ్స్ పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్నాడు. 2004 వరకు మావోయిస్టులు నల్లమల ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా, శిక్షణ కేంద్రంగా, రిక్రూట్‌మెంట్ జోన్‌గా వాడుకున్నారు. ఆ సమయంలోనే అధిక సంఖ్యలో డంప్‌లు ఏర్పాటు చేసుకుని వాటిలో పెద్ద ఎత్తున నగదు, ఆయుధాలు దాచారు. బాబూరావు డైరీలో ఉన్న డంప్‌ల వివరాలపై కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు. మార్కాపురం ఓఎస్‌డీ, డీఎస్పీతో పాటు గతంలో ఈ ప్రాంతంలో పనిచేసిన పోలీసు ఉన్నతాధికారులు డైరీపై దర్యాప్తులో నిమగ్నమై ఉన్నారు.
 
వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. డైరీలో బీసీలకు రాజ్యాధికారం, మావోయిస్టుల సిద్ధాంతాలు, జమా ఖర్చుల వివరాలు ఉన్నట్లు తెలిసింది. జనసంచారానికి దూరంగా.. ఎత్తయిన కొండపై ఎన్‌కౌంటర్ జరిగింది. తాత్కాలిక గుడిసె వేసుకుని ఇద్దరు మహిళా మావోయిస్టులతో బాబూరావు ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు సేద తీరే సమయంలో ఒకరు గార్డు డ్యూటీ నిర్వహిస్తుంటారని భావిస్తున్నారు. బాబూరావు తరచూ కొండ దిగి కృష్ణానది ఒడ్డుకు వచ్చి జాలర్లకు డబ్బులు ఇచ్చి తమకు అవసరమైన పనులు చేయించుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 

మరిన్ని వార్తలు