పోలీస్ యంత్రాంగం అప్రమత్తం

31 Jul, 2013 06:25 IST|Sakshi

 రాష్ట్ర విభజన నిర్ణయంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. నగరంలో భద్రతాపరమైన చర్యలు చేపట్టింది. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న జిల్లాలో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. యూపీఏ ప్రభుత్వ వైఖరితో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
 
 ప్రశాంత జిల్లాలో ఎక్కడ చూసినా పోలీసు బలగాలు భారీగా మోహరించాయి. నెల్లూరు నగరం పారా మిలటరీ దళాల బూట్ల చప్పుళ్లు, కవాతులు, పోలీసు వాహనాల పెట్రోలింగ్‌తో మార్మోగింది.  యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయడంతో జిల్లా వ్యాప్తంగా అల్లర్లు జరగకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
 
 జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికలు బుధవారంతో ముగియనున్నాయి. దీంతో జిల్లాలో ఇప్పటికే 144 సెక్షన్ అమలులో ఉంది. తాజాగా మంగళవారం రాత్రి యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా ప్రకటనలు చేయడంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉండడంతో ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ కె. బాలవెంకటేశ్వరరావు పర్యవేక్షణలో నగర పోలీసు అధికారులు, పారామిలటరీ, ఏపీఎస్పీ సిబ్బంది  రాత్రి పెట్రోలింగ్ చేపట్టారు. ఎస్పీ రామకృష్ణ సాయంత్రం నగరంలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.
 

మరిన్ని వార్తలు